breaking news
Health safety
-
ఆల్–ఉమెన్ రూట్స్ కేఫ్
‘నేను ఎంత సంపాదించాను’ అని లెక్కలు వేసుకునేవారు కోకొల్లలుగా ఉంటారు. ‘నేను ఏం తింటున్నాను’ అని ఆరోగ్య ప్రమాణాలతో విశ్లేషించుకునేవారు వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే ఉంటారు. సుప్రీం కోర్టు లాయర్ మీనాక్షి కుమార్ రెండో కోవకు చెందిన వ్యక్తి. వివిధ రకాల వంటకాలు నేర్చుకోవడానికి థాయ్‌లాండ్ వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్న మీనాక్షి... ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘తాజా కూరగాయలు – తాజా వంటకాలు’ నినాదంతో ‘రూట్స్ కేఫ్’ పేరుతో ఫామ్–టు–టేబుల్ ఫుడ్ కేఫ్ స్టార్ట్ చేసి దానిని ఆల్–ఉమెన్ కేఫ్‌గా తీర్చిదిద్దింది. తన పొలంలో రసాయన రహిత కూరగాయలు పండిస్తోంది. మహిళా ఆర్థిక స్వాతంత్య్రం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది..నల్లకోటులో సుప్రీం కోర్టు కారిడార్లలో బిజీ బిజీగా కనిపించేది మీనాక్షి కుమార్. ఆమె తండ్రి కూడా న్యాయవాది. క్రిమినల్ లాయర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 2011 సంవత్సరం ఆమె జీవితాన్ని కొత్తదారిలోకి తీసుకువెళ్లింది. ఆ సంవత్సరం యూకేలోని న్యూ క్యాజిల్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి వెళ్లింది మీనాక్షి.సరదాగా మొదలైంది...యూనివర్శిటీలోని డార్మిటరీ కిచెన్‌లో సరదాగా వంట చేసేది మీనాక్షి. ఆ సరదా కాస్తా ఫ్యాషన్‌గా మారింది. యూకేలో తనకు సింగపూర్ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు ఇలా అన్నాడు.... ‘చదువు కోసం మాత్రమే కాదు మనకు ఆనందాన్ని ఇచ్చే కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా సెలవులు పెట్టవచ్చు’ చార్టెర్డ్ ఎకౌంటెంట్ అయిన అతడు కిక్ కోసం పేస్ట్రీ స్టూడెంట్‌గా మారాడు. అతడి మాటలు మీనాక్షిపై బాగా ప్రభావం చూపించాయి. వెంటనే బ్యాంకాక్‌కు వెళ్లి ప్రసిద్ధ పాకశాస్త్ర పాఠశాల ‘లె కార్డాన్ బ్లూ’లో చేరింది. అది తొమ్మిది నెలల కోర్సు. స్టార్ చెఫ్ గగన్ ఆనంద్ దగ్గర పాఠాలు నేర్చుకునే అవకాశం వచ్చింది. అలా వచ్చింది ఒక ఐడియా!మీనాక్షి ఇండియాకు వచ్చిన తరువాత, కోవిడ్ కల్లోలం మొదలైంది. ఇంటికే పరిమితమైన ఆమె టెర్రస్‌పై రకరకాల కూరగాయలు పండించేది. ‘సరిగ్గా వినియోగించుకుంటే చిన్న స్థలంలో కూడా పెద్ద దిగుబడి సాధించవచ్చు’ అనే విషయాన్ని గ్రహించిన మీనాక్షి ఆ తరువాత నోయిడాలోని తన కుటుంబానికి చెందిన ఎకరం పొలంలో సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఆ వ్యవసాయ క్షేత్రం ఆమె ప్రయోగశాలగా మారింది. ఒకరోజు మార్నింగ్ వాక్కు వెళుతూ ఒక మూలన మూతబడి ఉన్న పిజ్జా పాయింట్‌ను చూసింది మీనాక్షి. ఆ సమయంలోనే తనలో ఒక ఆలోచన మెరిసింది.రూట్స్ కేఫ్ మొదలైంది ఇలా...‘తాజా కూరగాయలు... తాజా వంటకాలు’ నినాదంతో ‘రూట్స్ కేఫ్’ ప్రారంభించింది. తమ పొలంలో పండిన కూరగాయలనే ‘రూట్ కేఫ్’లో వినియోగించేవారు. సీజన్లను బట్టి మెనూ మారుతుంది. ‘ప్రతిదీ తాజాగా’ అనే పేరు రావడంతో ‘రూట్స్ కేఫ్’ బాగా క్లిక్ అయింది.మన దేశంలో పండే కూరగాయలే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన కూరగాయలతో చేసిన వంటకాలు ‘రూట్స్ కేఫ్’లో అందుబాటులో ఉంటాయి. ‘రూట్స్ కేఫ్’ను ప్రత్యేకంగా నిలబెట్టింది దేశ, విదేశ రసాయన రహిత కూరగాయలతో చేసిన నోరూరించే వంటకాలు మాత్రమే కాదు... సిబ్బంది కూడా. ‘రూట్స్ కేఫ్’లో ఉద్యోగులందరూ మహిళలే. ‘రూట్స్ కేఫ్‌లో పనిచేయాలనుకునే మహిళలకు ప్రధాన అర్హత...వారికి ఎలాంటి అనుభవం లేక΄ోవడం! ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు. అయితే అనుభవం లేని వారే ఆసక్తితో అన్నీ నేర్చుకుంటారు. వారిలో అంకితభావం అధికంగా కనిపిస్తుంది. రూట్స్ కేఫ్‌ను ఆల్–ఉమెన్ కేఫ్‌గా తీర్చిదిద్దడంలో విజయం సాధించాను’ అంటుంది మీనాక్షి.జీరో నుంచి శిక్షణ‘రూట్స్ కేఫ్’లో చేరిన మహిళలకు కూరగాయలు కోయడం, వంట చేయడం నుంచి వడ్డించడం వరకు జీరో నుంచి శిక్షణ ఇచ్చింది మీనాక్షి. ‘ఉద్యోగం చేస్తున్నాను అనే సంతోషం కంటే కొత్త విద్య నేర్చుకున్నామనే సంతృప్తి వారిలో కనిపిస్తుంది’ అని రూట్స్ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగుల గురించి చెబుతోంది మీనాక్షి. గృహిణిగా పదిహేడు సంవత్సరాలు ఇంటికే పరిమితమైన మీనాక్షి ‘రూట్స్ కేఫ్’తో ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టింది.‘కోవిడ్ తరువాత మాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదైనా ఉద్యోగం చేయాలని గట్టిగా అనుకున్నాను. కాని నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? మీకు ఎలాంటి అనుభవం ఉండనక్కర్లేదు. ఇంటర్వ్యూకు వచ్చేయండి...అనే రూట్స్ కేఫ్ పిలుపు నన్ను ఆకట్టుకుంది. ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నా జీవితంలో తొలిసారిగా ఉద్యోగంలో చేరాను. నెల జీతం ఇరవై వేలు అందుకున్నప్పుడు నా సంతోషానికి హద్దులు లేవు. ఇది నేను సాధించిన జీతం అనే భావన ఎంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది మధుమిత. ఇలాంటి మధుమితలెందరికో కొత్త జీవితాన్ని ఇచ్చింది రూట్స్ కేఫ్. ఆర్థిక స్వాతంత్య్రమే... అసలైన ప్రాధాన్యతమోడల్ స్ట్రీట్‌ఫుడ్ కార్ట్లు, హై–ఎండ్ కాఫీ ప్రోగ్రామ్స్, ప్రాంతీయ వంటకాలతో ప్రయోగాలు... మొదలైనవాటితో ‘రూట్స్ కేఫ్’ విజయపథంలో దూసుకు΄ోవడం ఒక కోణం అయితే, మరో కోణం... స్త్రీల ఆర్థిక స్వాతంత్రానికి విలువనిచ్చే వేదికగా రూట్స్ కేఫ్ పేరు తెచ్చుకోవడం.‘డబ్బు అనేది మహిళలకు మాట్లాడే గొంతును ఇస్తుంది. స్వేచ్ఛను, గౌరవాన్నీ ఇస్తుంది’ అంటున్న మీనాక్షి కుమార్ ఎంతోమంది మహిళలకు శిక్షణ ఇచ్చి మరీ తన‘రూట్స్ కేఫ్’లో ఉద్యోగాలు ఇచ్చింది.ప్రతిరోజూ ఆ ఉత్సాహం మీలో ఉంటే...మొదటి అడుగు వేయడం అత్యంత కష్టతరమైనది కావచ్చు. అంతమాత్రాన అధైర్య పడవద్దు. ఒక అడుగు పడిన తరువాత భయం వెనకడుగు వేయిస్తుంది. ఆ తరువాత మాత్రం ప్రయాణం సజావుగానే సాగుతుంది. ప్రతిరోజూ ఉదయం మీలో ‘ఈ రోజు ఉద్యోగానికి వెళుతున్నాను’ అనే ఉత్సాహం కనిపిస్తుంటే మీరు సరిౖయెన బాటలోనే ప్రయాణిస్తున్నారని అర్థం. పూర్తిగా మహిళల నేతృత్వంలో ఒక కేఫ్ నడుపుతున్నందుకు గర్వంగా ఉంది. అయితే వ్యాపారం అన్నాక అన్నీ సంతోషకరమైన రోజులే ఉండవు. కొన్నిసార్లు కస్టమర్లు ఉండరు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అయినప్పటికీ అన్నింటినీ తట్టుకుని ఉత్సాహంగా ముదుకు సాగాలి.– మీనాక్షి కుమార్ -
నాడు సురక్ష.. నేడు శిక్ష
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన జె.అప్పలనాయుడు గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రక్తనాళాల్లో కొవ్వు స్థాయిలను తగ్గించడానికి, గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్‌లను నివారించడంతో పాటు.. అధిక రక్తపోటు సమస్యకు సంబంధించిన మందులను రోజూ వాడాల్సి ఉంటుంది. ఖరీదైన ఈ మందులను బయట కొనుగోలు చేయడం ఆ కుటుంబానికి స్తోమతకు మించిన వ్యవహారం. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా అమలులోకి తెచ్చిన మందుల డోర్ డెలివరీ ఈ కుటుంబానికి వరంగా మారింది. విలేజ్ క్లినిక్‌లోని సీహెచ్‌వో నెలనెలా ఆన్లైన్లో ఇండెంట్ పెడితే మందులు పోస్టల్లో గ్రామానికి వచ్చేవి.ఆ మందులను సీహెచ్‌వో/ఏఎన్ఎం ఇంటి వరకూ తీసుకెళ్లి అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నట్టుండి మందుల డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఆపేసింది. దీంతో మందుల కోసం అప్పలనాయుడు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ఇలాఅప్పలనాయుడు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గుండె, కిడ్నీ, క్యాన్సర్, న్యూరో సంబంధిత దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతున్న వారి పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ముందు వరకు క్రమం తప్పకుండా ఇంటి గుమ్మం వద్దకే సజావుగా సాగిన మందుల డోర్ డెలివరీ.. ఇప్పుడు నిలిచి పోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేచి నడిచే సత్తా ఉన్న వారు ప్రయాణ చార్జీలు పెట్టుకుని, ఆపసోపాలు పడి పెద్దాస్పత్రులకు వెళుతుంటే అక్కడ కూడా కొన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదని, బయట కొనుక్కోమని చీటీలు రాసిస్తున్నారని పేదలు లబోదిబోమంటున్నారు. పక్షవాతం బారినపడి.. కాళ్లు, చేతులు పని చేయని, కదల్లేని స్థితిలో ఉండే వికలాంగులు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేదేమీ లేక స్థానికంగా ప్రైవేట్ మెడికల్ స్టోర్స్‌లో ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి బాధిత కుటుంబాలు తీవ్ర అగచాట్లు పడుతున్నాయి.బాధితులకు భరోసా కరువు⇒ గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను సచివాలయాల వారీగా వైద్య శాఖ ఆన్లైన్లో పొందు పరిచింది. ఈ సమాచారం ఆధారంగా విలేజ్ క్లినిక్‌లోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లు ప్రతి నెలా మందులను ఆన్లైన్లో ఇండెంట్ పెట్టేవారు. ఆ మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఏపీఎంఎస్ఐడీసీ పోస్టల్ ద్వారా గ్రామాలకు చేరవేసేది. అనంతరం సీహెచ్‌వో/ఏఎన్ఎంలు ఆ మందుల పార్సిల్‌ను బాధితుల ఇంటి వద్దకు చేరవేసి, వాటిని ఎలా వాడాలో వివరించే వారు. ⇒ అయితే జూన్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఆన్లైన్లో ఇండెంట్ పెడుతున్నప్పటికీ, ఏపీఎంఎస్ఐడీసీ మందులను గ్రామాలకు పంపడం లేదు. మందులు రావడం లేదని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించక పోవడంతో సీహెచ్‌వోలు ఇండెంట్ పెట్టడం కూడా మానేశారు. దీంతో వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. ⇒ బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్, దీర్ఘకాలిక కిడ్నీ, క్యాన్సర్ జబ్బుల బాధితులు జీవిత కాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన మందులు కొనుగోలు చేయడానికి నెలకు రూ.వేలల్లో కూడా ఖర్చు అవుతుంది. వ్యవసాయ, రోజు వారీ కూలి పనులపై ఆధారపడే పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బాధితులు ఖరీదైన మందులు నెలనెలా కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత సహకరించదు. దీంతో చాలా మంది మందుల వాడకాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా జబ్బులు ముదిరి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతుంటాయి.⇒ ఈ పరిస్థితిని నివారించి బాధితులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మందుల డోర్ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని దయలేని చంద్రబాబు ప్రభుత్వం ఆపేయడం పట్ల బాధిత కుటుంబాలు మండి పడుతున్నాయి.ఆత్మస్థైర్యం కోల్పోయినట్లైందిగతంలో ప్రభుత్వమే నేరుగా ఇంటి దగ్గరకు మందులు పంపేది. నర్సమ్మ ఇంటి వద్దకే వచ్చి మందులు అందజేసి, నా ఆరోగ్యం గురించి వాకబు చేసి, మందులు ఎలా వాడాలో వివరించేది. నాకు ఎంతో ఆత్మస్థైర్యం నింపింది. ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యం కోల్పోయాను. పై నుంచి వచ్చే మందులు కొద్ది నెలలుగా రావడం లేదని ఏఎన్ఎం, నర్సమ్మ చెప్పారు. – అప్పలకొండ, అనకాపల్లి జిల్లారోగాలు ముదిరిపోతాయిదీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ, కదల్లేని పరిస్థితుల్లో గ్రామాల్లో చాలా మంది ఉంటారు. క్రమం తప్పకుండా మందుల వాడకంతో బాధితుల్లో జబ్బులు నియంత్రణలో ఉంటాయి. మందులు ఆపేస్తే జబ్బులు ముదిరి, మరిన్ని అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి. – డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
అన్నింటికీ అవతలికే..
ఆదిలాబాద్ టౌన్ : డీఈవో, ఆర్వీఎం జిల్లా కార్యాలయాలు ఉన్నటువంటి జిల్లాకేంద్రంలోని గజిటెడ్ నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలో 600లకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో పురాతన పాఠశాలల్లో ఇదొక్కటి. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న బి.చంద్రకుమార్ కూడా ఇదే పాఠశాలో చదువుకున్నారు. ఆయన ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఈ పాఠశాలలో సదస్సులు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎంతో మంది ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలలో ఇప్పటికీ విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. విద్యార్థినుల అవసరాలు తీరుతుండగా, విద్యార్థులు మాత్రం బయటకు వెళ్లాల్సి వస్తుంది. జిల్లాలోని అనేక పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో అసలుకే టాయిలెట్లు లేక విద్యార్థులతోపాటు చదువులు చెప్పే ఉపాధ్యాయులకు కూడా సమస్య తప్పడం లేదు. మరో 4,235 మరుగుదొడ్లు అవసరం.. జిల్లాలో దాదాపు 4 వేల పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మరుగుదొడ్లు కల్పించాల్సిన బాధ్యత రాజీవ్ విద్యామిషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు అప్పగించారు. అయితే ఏ పాఠశాలలో ఎన్ని ఉన్నాయో కూడా అధికారులు లెక్క చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో 1,114 మంజూరు కాగా 1,054 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు, 60 నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. 2012-13 విద్యా సంవత్సరంలో వైకల్యంగల విద్యార్థుల సౌకర్యార్థం 261 మంజూరు కాగా 24 పూర్తయ్యాయి. 105 నిర్మాణ దశలో, 132 ఇంకా ప్రారంభం కానట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో మొత్తం పాఠశాలలు కలిపి 3,534 మరుగుదొడ్లు ఉన్నాయని, మరో 4,235 మరుగుదొడ్లు అవసరం ఉన్నట్లు ఆయా మండల విద్యాధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న విద్యార్థినుల డ్రాపౌట్ల సంఖ్య.. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవ్వడంతో విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక చాలా మంది విద్యార్థినులు సక్రమంగా పాఠశాలకు హాజరు కావడం లేదు. మరికొందరైతే పాఠశాలకు రావడం మానేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. ఇంకొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదు. ఉన్న కొన్ని మరుగుదొడ్లలో నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి. నిధుల దుర్వినియోగం.. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు వాటిని తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో పాతవాటికే రంగులు పూసి నిధులు కాజేసిన దాఖలాలు ఉన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో కాంట్రాక్టర్లు నాసీరకంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో నిర్మించిన కొన్ని నెలలకే అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఏదేమైనా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో విద్యార్థినులకు శాపంగా మారుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థినుల డ్రాప్‌ఔట్ సంఖ్యను తగ్గించి వారి సమస్యను తీర్చాలని పలువురు కోరుతున్నారు. సుప్రీం ఆదేశాలు బేఖాతరు.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను విద్యాశాఖ తుంగలో తొక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా నిర్మించాలని సుప్రీంకోర్టు 2011 డిసెంబర్లో, 2012 అక్టోబర్‌లో రెండుసార్లూ ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు జారీ అయి ఆరు నెలలైనా పరిస్థితిలో మార్పు లేదు. విద్యార్థినులు పాఠశాలలకు వచ్చేందుకు అన్ని వసతులూ కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో కానరావడం లేదు. ఫలితంగా విద్యార్థులకు భద్రత లేకుండాపోతోంది. మరుగుదొడ్లు లేక విద్యార్థినులతోపాటు అందులో పాఠాలు చెప్పే ఉపాధ్యాయినులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్డబ్ల్యూఎస్ వారు చూస్తున్నారు.. - పెర్క యాదయ్య, ఆర్వీఎం పీవో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించాల్సిన మరుగుదొడ్ల నిర్వహణ ఆర్డబ్ల్యూఎస్ వారు చూస్తున్నారు. జిల్లాకు కొత్తగా 3 వేలు మరుగుదొడ్లు మంజూరైనట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ వివరాలు మా దగ్గర లేవు.


