breaking news
Guru Full Moon celebrations
-
కన్నుల పండువగా గురుపౌర్ణమి వేడుకలు
పోటెత్తిన భక్తజనం అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అన్నదానం సిద్దిపేట టౌన్: పట్టణంలోని షిరిడీ సాయి మందిరంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వేకువజామున బాబాను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం హారతి, క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వర్షాల కోసం జలాభిషేకం చేశారు. దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. భక్తులకు బాబా ప్రసాదాన్ని అందజేశారు. గంటల తరబడి క్యూలో నిలుచొని స్వామిని దర్శించుకున్నారు. వేలాది మందికి అన్నదానం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు మందిరం భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో శతకోటి సాయినామ మహాయజ్ఞం నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ కృష్ణమూర్తి, అధ్యక్షుడు గందె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి, కార్యదర్శి టీ నర్సయ్య, సహాయ కార్యదర్శి రాజమౌళి, కోశాధికారి నల్ల శివానందం తోపాటు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు
ఆలయ ట్రస్టు చైర్మన్ కుమారస్వామి సాక్షి, బళ్లారి/ అర్బన్ : బళ్లారిలోని షిర్డి సాయిబాబా ఆలయంలో శుక్రవారం నుంచి గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు షిర్డి సాయిబాబా ఆలయ ట్రస్టు అధ్యక్షుడు కుమారస్వామి తెలిపారు. ఆయన గురువారం నగరంలోని విశాల్నగర్ నెలకొన్న షిర్డి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకల వివరాలను విలేకరులకు వెల్లడించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బాబా ఆలయంలో ప్రతి గురువారం 10 వేల మంది భక్తులు సందర్శిస్తుంటారని, భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురుపౌర్ణమి సందర్భంగా అన్నదానం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు లక్ష మందికి పైగా భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందున, భక్తులందరి కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 500 మందితో రక్తదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయంలో నిత్యాన్నదానానికి చెన్నైకు చెందిన రమణ అనే భక్తుడు నెలకు రూ.30 వేలు అందజేస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి సాయిబాబా ట్రస్టు నుంచి మెరిట్, పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. పూజా వివరాలు 1న తెల్లవారు జామున కాగడ హారతి, మంగళ స్నానం, గణపతి పూజ, అభిషేకం, సాయి అష్టోత్తర నామ పూజ, సాయి సంచరిత పారాయణం, ధూప హరతి, కేశవ గాయన సమాజ బృందంతో సంగీత కార్యక్రమం, రాత్రి 7 గంటలకు పల్లకీ మహోత్సవం, ఉయ్యాల సేవ తదితర పూజలు నిర్వహించారు. శనివారం గురుపౌర్ణమి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కాగడ హారతి, గణపతి పూజ, సాయి చరిత్ర పారాయణం, సాయిబాబా నగర సంకీర్తన, గంధాభిషేకం, దత్తాత్రేయ సహస్రనామ అర్చన పూజలు, సాయి సత్యవ్రతం, హారతి, అన్నదానం, సాయంత్రం 3-12 సంవత్సరాల చిన్నారులతో సాయిబాబా వేషాలు, ధూప హారతి, సాంస్కృతిక కార్యక్రమాలు, పల్లకి మహోత్సవం, ఉయ్యాల సేవ, సజారతి, ప్రసాద వినియోగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13న ఆదివారం కూడా వివిధ ధార్మిక పూజలు నిర్వహిస్తారు.