breaking news
Guest Editor
-
గెస్ట్ ఎడిటర్ రోల్ బాగా నచ్చింది
మహిళా గెస్ట్ ఎడిటర్ రోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఒక పత్రిక వెలువడడానికి ఇంతమంది శ్రమ దాగి ఉందని నాకు తెలియదు. తెరవెనుక ఉండి నడిపిస్తున్న సిబ్బంది, వారి పనితీరు నాకు స్ఫూర్తినిచ్చింది. – సల్మాబాను సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆహ్వానం మేరకు ఎస్సీ కార్పొరేషన్ నల్లగొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సల్మాబాను మంగళవారం యూనిట్ కార్యాలయంలో గెస్ట్ ఎడిటర్‌గా ఒక్కరోజు విధులు నిర్వర్తించారు. ‘మహిళా గెస్ట్ ఎడిటర్’గా ముఖ్యమైన వార్తలపై ఎడిటోరియల్ సిబ్బందితో చర్చించారు. వార్తల ప్రాధాన్యత, ఎడిటింగ్, పేజినేషన్‌ను పరిశీలించి సూచనలు చేశారు. కొన్ని వార్తలకు శీర్షికలను కూడా పెట్టారు. మహిళల్లో చైతన్యం కలిగించే వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా యూనిట్ కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీలించారు. పత్రిక ప్రింటింగ్ విధానం, సిబ్బంది విధులు, టెక్నికల్ అంశాల గురించి కూడా తెలుసుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని, వాటిని అందిపుచ్చుకోవాలంటే కేవలం చదువు వల్లే సాధ్యమవుతుందని సల్మాబాను చెప్పారు. ప్రస్తుతం సమాజంలో మహిళలకు ఉన్న అవకాశాలు, మహిళలు ఉన్నతంగా ఎదగాల్సిన ఆవశ్యకతపై మాట్లాడుతూ.. తాను ఆఫీసర్‌గా గుర్తింపు పొందానంటే అది రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లేనని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్లు, అన్ని రకాల సదుపాయాలు గురించి అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మంచి చదువులు చెప్పించి ఆర్థికంగా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా కృషిచేయాలి ఆమె సూచించారు. హేళన చేసిన వాళ్లే.. గొప్పగా చెబుతున్నారు.. చిన్నప్పుడు తన అమ్మానాన్నను చాలా మంది.. ఆడ పిల్లలను ఎందుకు చదివిస్తున్నారు అని అనడం తాను చూశానని. అయినా వారు కష్టపడి తనను చదివించారని చెప్పారు. అప్పటి నుంచే తాను సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అనే దిశగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించానని, ఆరోజు హేళన చేసిన వాళ్లే ఈ రోజు తన గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరుకోగలిగానని సల్మాబాను చెప్పారు. మహిళలైనా, విద్యార్థినులైనా పనిచేసే చోట, కళాశాలలు, పాఠశాలల్లో జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసిపోయి ప్రతి విషయాన్నీ చర్చించాలని చెప్పారు. కొందరు చిన్న చిన్న విషయాలకు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతుండడం బాధ కలిగిస్తోందని అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఎడిటోరియల్ సిబ్బందితో మాట్లాడుతున్న గెస్ట్ ఎడిటర్ సల్మాబాను టెక్నాలజీకి అనుగుణంగా పత్రికా రంగంలో మార్పులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పత్రికా రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అరచేతిలో ఉండే సెల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న ఈ రోజుల్లో జర్నలిజం వ్యాల్యూస్‌తో పనిచేస్తున్న ‘సాక్షి’ సిబ్బందిని ఆమె అభినందించారు. తనకు గెస్ట్ ఎడిటర్ అవకాశం కల్పించిన సాక్షి యాజమాన్యానికి సల్మాబాను కృతజ్ఞతలు తెలిపారు. ఎడిటర్‌గా పత్రికను నిర్వహించడం కత్తి మీద సామేనని పేర్కొన్నారు. -
సాక్షిలో గెస్ట్ ఎడిటర్
హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని కృష్ణప్రియ బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో గెస్ట్ ఎడిటర్ పాత్ర పోషించింది. ఎడిటోరియల్ సమావేశంలో పాల్గొని వార్తల ఎంపికలో చురుగ్గా వ్యవహరించింది. పత్రికా సిబ్బంది విధి నిర్వహణ, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సంఘటనలపై ఆసక్తిని ప్రదర్శించింది. బుధవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నగరంలోని రాణిగంజ్‌కు చెందిన కృష్ణప్రియకు ‘సాక్షి’ ఈ అరుదైన అవకాశాన్ని కల్పించింది. అంతకుముందు ‘సాక్షి’ కార్యాలయంలో అప్సా, ప్లానింగ్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో అప్సా డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ప్లానింగ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ శాంతి, ప్రతినిధులు పద్మ, పార్వతి, సత్య తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ‘ఫ్యామిలీ’ గెస్ట్ ఎడిటర్‌గా తమన్నా
హాయ్ రీడర్స్.. షూటింగ్ షెడ్యూల్ నుంచి బయటికొచ్చి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు అది సమాజానికి పనికొచ్చే పనే అయుండాలని చాలావరకు మా సినిమా వాళ్లం అనుకుంటూ ఉంటాం. ప్రజలు చూపిన ప్రేమ వల్లే కదా మేము ఇంతగా పాపులర్ అయింది. మా గొప్పదనం కంటే కూడా వాళ్ల అభిమానమే ఎక్కువని నేను అనుకుంటాను. కానీ సమాజ సేవలో నిజంగా లీనం అయిపోయి ఉండే వ్యవస్థ.. నాకు తెలిసి.. ఈ రోజుల్లో మీడియానే. మీడియా వాళ్లకు ప్రతిరోజూ ఒక పోరాటమే. ప్రతిరోజూ ఒక దీక్షే. కొత్తగా వచ్చినా, ఎనిమిదేళ్లలోనే మంచి పేరు సంపాదించుకున్న ‘సాక్షి’ పేపర్ తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ నన్ను గెస్ట్ ఎడిటర్‌గా ఆహ్వానించినప్పుడు దాన్నొక గొప్ప గౌరవంగా నేను భావించాను. నాకు తెలుగులో ప్రావీణ్యం లేకపోయినా మీడియా మీద ఉన్న అపారమైన గౌరవంతో గెస్ట్ ఎడిటర్‌గా ఉండేందుకు ఒప్పుకోవడం అనే సాహసం చేశాను. (నవ్వుతూ). ‘సాక్షి’ పాఠకులకు, ‘సాక్షి’ యాజమాన్యానికి, ‘సాక్షి’ని పోరాట పటిమతో పరుగులు తీయిస్తున్న జర్నలిస్టులకు, సిబ్బందికి నా అభినందనలు. - తమన్నా,హీరోయిన్