ground floor
-
మూడు ప్రాణాలు బలి
మణికొండ(హైదరాబాద్): గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు, దట్టమైన పొగలు చెలరేగాయి. భవనం మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించడంతో ఊపిరి ఆడక ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ పాషా కాలనీలో శుక్రవారం సాయంత్రం విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. పాషా కాలనీ ప్లాట్ నెంబర్ 72లో ఉస్మాన్‌ఖాన్, అతని తమ్ముడు యూసుఫ్ ఖాన్ కుటుంబాలు నివసిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని తన కిరాణా దుకాణంలో ఉస్మాన్ ఖాన్ ఉండగా.. ఆకస్మికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న పార్కింగ్‌లో నిలిపిన రెండు కార్లకు అంటుకున్నాయి. దీంతో ఉవ్వెత్తున మంటలు చెలరేగడంతో కారులోని గ్యాస్ సిలిండర్ పేలింది. మంటలు మరింత ఉద్ధృతమై భవనంలోని మొదటి అంతస్తుకు వ్యాపించడంతో కిచెన్ గదిలోని రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఓ గదిలో ఇరుక్కుపోయిన ఉస్మాన్‌ఖాన్ తల్లి జమిలాఖాతమ్ (78), అతని తమ్ముడి భార్య శాహినా ఖాతమ్ (38), తమ్ముడి కూతురు సిజ్రా ఖాతమ్ (4)లు ఊపిరి ఆడకపోవడంతో గదిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిందికి దూకి.. మంటల నుంచి తప్పించుకునేందుకు చుట్టుపక్కల వారు బాధితుల ఇంటి ముందు పరుపులు వేయగా.. ఉస్మాన్‌ఖాన్ తమ్ముడు యూసుఫ్‌ఖాన్, కుమారుడు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. దీంతో యూసుఫ్ ఖాన్ కాలు విరిగింది. గాయపడిన యూసుఫ్ ఖాన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్ని మాపక శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫ్లాట్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. అగి్నమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పైఅంతస్తుకు వెళ్లి గోడలకు రంగులు వేసే జూల ద్వారా ఇద్దరిని సురక్షితంగా కిందికి తీసుకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. ఇందులో ముగ్గురు మొదటి అంతస్తు నుంచి దూకి, ఇద్దరు జూల ద్వార కిందికి వచ్చి ప్రాణాలను కాపాడుకోగా.. ఇద్దరు మహిళలు, బాలిక మృతి చెందారు. ఘటనా స్థలానికి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, నార్సింగి ఏసీపీ రమణగౌడ్, మణికొండ మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్ ముదిరాజ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
లిఫ్ట్‌లో నరకం
ఇరుక్కుపోయిన అర్జీదారులు తెరచుకోని డోర్లు ఆందోళనతో కేకలు గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లి తెరుచుకున్న లిఫ్ట్ చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లో ‘మీకోసం ప్రజావాణి’ అర్జీదారులు ఇరుక్కుని నరకం చవిచూశారు. కలెక్టరేట్లోని లిఫ్ట్ కొంత కాలంగా సరిగా పనిచేయడంలేదు. ఒక్కోసారి లిఫ్ట్ గ్రౌండు ఫ్లోర్ నుంచి పైకి వెళ్లాల్సిందిపోయి లిఫ్ట్ కింది భాగంలో ఉన్న గుంతలో పడిపోవడం, పైకి వెళ్లేటప్పుడు మధ్యలో ఆగిపోవడం, లిఫ్ట్ తలుపులు తెరుచుకోక స్ట్రక్ అవుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై పలుసార్లు కలెక్టరేట్ సిబ్బంది, ప్రజలు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రజావాణికి విచ్చేసిన కొందరు అర్జీదారులు మెట్లు దిగలేక లిఫ్ట్‌ను ఆశ్రయించారు. వీరు లిఫ్ట్‌లోకి వెళ్లి కిందకు వెళ్లేందుకు స్విచ్ ఆన్ చేశారు. అయినా లిఫ్ట్ కదలకుండా స్ట్రక్ అయిపోయింది. అంతేగాక డోర్లు కూడా తెరుచుకోకపోవడంతో అందులోని ఉన్నవారు ఆందోళనకు గురై కేకలు వేస్తూ, డోర్లు బాదడం మొదలెట్టారు. అక్కడే ఉన్న ప్రజలు, కొందరు పాత్రికేయులు కలెక్టరేట్ సెక్యూరిటీకి తెలిపేందుకు వెళ్లగా అక్కడ ఎవరూ లేరు. దాదాపు 10 నిమిషాల పాటు డోర్లు తెరిచేందుకు అందరూ ప్రయత్నించడంతో ఆఖరుకు లిఫ్ట్ గ్రౌండు ఫ్లోర్‌కు వెళ్లి తెరుచుకోవడంతో అందులో ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
భారీ అగ్ని ప్రమాదం
చందన బ్రదర్స్‌లో మంటలు వస్త్రాలు, నగలు దగ్ధం రూ.10 కోట్ల వరకు నష్టం గాంధీరోడ్డులో కలకలం నగరంలోని గాంధీ రోడ్డు సమీపంలోని తీర్థకట్ట వీధిలోని చందన బ్రదర్స్ షోరూంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూం గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం, మిగిలిన రెండు అంతస్తుల్లో దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోజువారీ దినచర్యలో భాగంగా బుధవారం రాత్రి 10.10 గంటలకు షోరూంను మూత వేసి నిర్వాహకులు, సిబ్బంది వెళ్లిపోయారు. కొద్ది నిమిషాల్లోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. షాపు ముందే ఉన్న సెక్యూరిటీ గార్డు మంటలు అదుపు చేయలేకపోయాడు. ఈ రోడ్డుపై సమీపంలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అప్పటికే షోరూంలోని మూడు అంతస్తుల్లోనూ మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలతో చుట్టుపక్కల జనం బెంబేలెత్తిపోయారు. విషయం తెలియగానే చుట్టు పక్కల జనం షాపు వద్ద గుమికూడారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను అక్కడి నుంచి పంపించి వేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తిరుమల, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు ప్రాంతాల నుంచి ఆరు అగ్నిమాపక వాహనాలను రప్పించారు. దుకాణం షట్టర్ తెరుచుకోకపోవడంతో మంటలను అదుపు చేయడానికి చాలా కష్టమైంది. దీంతో జేసీబీతో షట్టర్‌ను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దుకాణం మేనేజర్లు విశ్వేశ్వరరావు, శ్యామ్ మాట్లాడుతూ పండుగలు రానుండడంతో 200 బేళ్లు వస్త్రాలు తెచ్చి ఉంచినట్లు తెలిపారు. బంగారం సుమారు 20 నుంచి 30 కేజీల వరకు ఉంటుందని తెలిపారు. దాదాపు 10 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొన్నారు. -
‘అద్దె’కు వచ్చి ఉసురు తీశారు
బంగారం కోసం వృద్ధురాలి హత్య నమ్మించి సొత్తు దోచుకున్న జంట పెదగంట్యాడ : బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. పెదగంట్యాడ ప్రాంతంలో గురువారం ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ అపరిచిత జంట ఈ దారుణానికి ఒడిగట్టిందని భావిస్తున్నారు. ఇటీవల ఆరిలోవలోనూ ఇదే తరహాలో హత్య జరిగిన నేపథ్యంలో ఈ రెండూ ఒక ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లిముక్కులో బొట్టా మహలక్ష్మి (70)కి రెండంతస్తుల ఇల్లుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఆమె ఒంటరిగా ఉంటోంది. మూడో కుమారుడు చనిపోవడంతో అతని భార్య లక్ష్మి, పిల్లలు రెండో అంతస్తులోని ఒక పోర్షన్లో ఉంటున్నారు. మొదటి అంతస్తులో రెండు పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇరవై, పాతికేళ్ల వయసున్న ఓ జంట అక్కడికి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని మహాలక్ష్మిని అడిగారు. అడ్వాన్స్ రూ. 2 వేలు ఇచ్చారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు వారు మళ్లీ వచ్చారు. గృహప్రవేశం చేస్తామని, ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలని లోనికి ప్రవేశించారు. వీరు గృహ ప్రవేశం చేస్తున్న సమయంలో మహలక్ష్మి కోడలు తనపిల్లలను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. కాస్సేపటి తర్వాత ఆమె ఇంటికి చేరుకుంది. అపరిచిత జంట అద్దెకు అడిగిన పోర్షన్ తలుపు దగ్గరకు వేసి ఉండటం లక్ష్మి గమనించింది. పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో తలుపు తీసుకొని లోపలికి వెళ్లింది. మధ్యగదిలో మహాలక్ష్మి చనిపోయి కనిపించింది. దీంతో ఆమె నిశ్చేష్టురాలయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీసీపీ శ్రీనివాస్, సౌత్ ఏసీపీ కె.వి.రమణ, న్యూపోర్టు సీఐ జి.శ్రీనివాస్, ఎస్ఐ షణ్ముఖరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అపరిచిత జంటే మహాలక్ష్మి గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మెడలోని బంగారం తాడు, చెవి ముక్కులకు ఉన్న బంగారం వస్తువులు కనిపించలేదు. ఆభరణాలకోసం దురాగతానికి పాల్పడిఉంటారని లక్ష్మి పోలీసులకు వివరించింది. ఆ వృద్ధురాలి వద్దనున్న చిక్కంలోని నగదునూ ఆ జంట కాజేసింది.