breaking news
Granite War
-
అధికార పార్టీలో గ్రానైట్ వార్!
చెక్‌పోస్టుల ఎత్తివేతపై స్వపక్ష నేతల రుసరుస సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో గ్రానైట్ వార్ కొనసాగుతూనే ఉంది. గ్రానైట్ ఓవర్‌లోడ్‌తోపాటు ఇతర అక్రమాలను అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను రాత్రికి రాత్రే ఎత్తివేయడంతో ప్రతిపక్ష పార్టీలోనూ, అధికార పార్టీలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు గ్రానైట్ అనుకూల, వ్యతిరేక గ్రూపులుగా విడిపోయారు. గ్రానైట్ అనుకూలవర్గం తమకున్న అధికార, అంగ, అర్థబలంతో చెక్‌పోస్టులను ఎత్తివేయించిందని భావిస్తున్న వ్యతిరేకవర్గం జిల్లాలో గ్రానైట్ పేరిట జరుగుతున్న అక్రమాలను, గ్రానైట్ వల్ల ప్రజలకు, పర్యావర ణానికి జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆదేశాలున్న నేపథ్యంలో వారు దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకంజ వేస్తున్నారు. త్వరలోనే గ్రానైట్ వ్యతిరేక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులంతా సమావేశమై తగిన కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక గ్రానైట్ అనుకూల ఎమ్మెల్యేలు, నాయకుల్లో తమ అభీష్టానికి వ్యతిరేకంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను ఎత్తివేయించడంలో సక్సెస్ అయ్యామనే భావన వ్యక్తమవుతోంది. మంత్రికి తెలియకుండానే ఎత్తేశారా? గ్రానైట్ చెక్‌పోస్టుల ఎత్తివేత అంశం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధానంగా మంత్రి ఈటెల రాజేందర్ సన్నిహితులు చెక్‌పోస్టుల ఎత్తివేతపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంత్రికి తెలియకుండానే చెక్‌పోస్టులను ఎత్తివేశారని చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాలో అధికారుల బదిలీలు, ఇతరత్రా ముఖ్యమైన వ్యవహారాలు మంత్రికి సంబంధం లేకుండా జరిగిపోతున్నాయని వాపోతున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సిఫారసు చేసిన వారికే పోస్టింగులివ్వడంతోపాటు పనులను కట్టబెట్టేవారని, ప్రస్తుతం మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటెల సైతం జరుగుతున్న పరిణామాలను లోలోపలే దిగమింగుకుంటున్నారే తప్ప పైకి మాట్లాడలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా, సీనియర్ నాయకుడిగా తానే అసంతృప్తి వ్యక్తం చేయడం సరికాదనే భావనతో ఈటెల ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీ సమావేశం నుంచి తీవ్రమైన పోరు గతంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం సందర్భంగా అధికార పార్టీ నేతల మధ్యనున్న గ్రానైట్ విబేధాలు బయటపడ్డాయి. ఆ సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేలు గ్రానైట్ వ్యాపారానికి అనుకూలంగా మాట్లాడగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావడంతో పార్టీలో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ సమయంలోనే గ్రానైట్ వ్యాపారుల అక్రమాలు పత్రికల ద్వారా వెలుగుచూస్తుండడం పార్టీని కుదిపేసింది. ఓవర్‌లోడ్, తదితర అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, తాజాగా ప్రభుత్వ ఁముఖ్య*నేత నుంచి గ్రానైట్ వ్యాపారులకు అనుకూలమైన నిర్ణయం రావడంతో గ్రానైట్ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. గ్రానైట్ అక్రమాలపై గొంతెత్తాలని ఉన్నా పెద్దల అండదండలు ఎదుటివారికే ఉండడంతో కిమ్మనడం లేదు. తమను పట్టించుకోకుండా గ్రానైట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల తీరుపై మాత్రం లోలోన మండిపడుతున్నారు. తాము కూడా ప్రజాప్రతినిధులమేనని, ఓవైపు తాము అభ్యంతరం చెబుతుంటే, తమను కాదని ఏకంగా పెద్దల స్థాయిలో ఒప్పందం కుదుర్చోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి చెక్‌పోస్టుల ఎత్తివేతపై బహిరంగంగా పెదవి విప్పకపోయినప్పటికీ అదను కోసం ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని ఆసక్తి సర్వత్రా నెలకొంది. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో నెలకొన్న విభేదాలు తమను ఎక్కడ ముంచుతాయోనని గ్రానైట్ వ్యాపారులు వాపోతున్నారు. -
గ్రానైట్ వార్
ఎమ్మెల్యేల పోరు.. అధికార పార్టీలో చిచ్చు సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ప్రజాప్రతినిధుల మధ్య గ్రానైట్ వార్ మొదలైంది. అధికార పార్టీ నేతల మధ్యనే చిచ్చు పెట్టింది. ఇటీవల జిల్లా పరిషత్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్రానైట్ పరిశ్రమపై రెండు వర్గాలుగా చీలిపోవటం చర్చనీయాంశంగా మారింది. పర్యావరణ విధ్వంసంతో పాటు రహదారులను ఛిద్రం చేస్తున్న గ్రానైట్ క్వారీలు.. రవాణాకు అడ్డుకట్ట వేయాలని మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట ఎమ్మెల్యేలు బొడిగె శోభ, రసమయి బాలకిషన్ తమ ఆవేదన వెళ్లగక్కారు. గ్రానైట్ లారీలు, క్వారీలతో ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని.. తమ సొంత నియోజకవర్గాల్లో రోడ్లన్నీ పాడైపోయాయని.. గ్రానైట్ రవాణా కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని ఆందోళన వెలిబుచ్చారు. అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు వారికి మద్దతు పలికారు. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే గ్రానైట్ పరిశ్రమపై ఏకపక్షంగా మాట్లాడటం సరైంది కాదని.. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి సైతం ఘాటుగానే స్పందించారు. అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయం తీసుకోవాలని కోరుతామని స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మైనింగ్ అధికారులను పిలిచి గ్రానైట్ ఓవర్‌లోడ్ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించినట్లు తెలిసింది. అదీ మొదలు.. జిల్లాలో గ్రానైట్ ఓవర్‌లోడ్ రవాణాపై అధికారులు కన్నెర్ర జేశారు. వరుసగా వారం రోజుల్లోనే 37 కేసులు నమోదు చేసి జరిమానా విధించటం వెనుక అసలు తతంగం ఇదేనని అర్థమవుతోంది. జిల్లాలో దాదాపు 350 గ్రానైట్ క్వారీలున్నాయి. ప్రతిరోజు దాదాపు 300 లారీల్లో గ్రానైట్ రవాణా అవుతోంది. జిల్లాలో ఉన్న క్వారీల్లో సగానికి పైగా రాజకీయ నేతలకు చెందినవే. కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు.. విపక్షాలకు చెందిన నేతలు సైతం ఈ వ్యాపారంలో పాతుకుపోయారు. దీంతో అధికారులు సైతం గ్రానైట్ క్వారీల నిబంధన ఉల్లంఘన.. అడ్డగోలు ఓవర్‌లోడ్ రవాణా.. సీనరేజీ ఎగవేతపై చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆరోపణలున్నాయి. గ్రానైట్ రాళ్ల రవాణాతో కరీంనగర్, హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, రామడుగు, చొప్పదండి, బోయినపల్లి, వేములవాడ, గంగాధర, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ మండలాల్లోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నిలిపివేసింది. గ్రానైట్ క్వారీల నుంచి తొలిగించిన మట్టి గుట్టలు కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిపై ప్రమాదాలకు నిలయంగా మారాయి. గ్రానైట్, ఇనుక లారీలతో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేసేందుకు కనీసం రూ.50 కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. కానీ.. ప్రభుత్వం నుంచి నిధులేవీ రాకపోవటంతో ఆర్అండ్బీ విభాగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఓవర్ లోడ్ రవాణాను అనుమతించాలని గ్రానైట్ క్వారీల యజ మానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మన జిల్లా కు ప్రత్యేకంగా జీవో తెచ్చుకోవటం గమనార్హం. ఇక్కడి రాజకీయాలను.. అధికారులను శాసించే స్థాయికి గ్రానైట్ పరిశ్రమ వేళ్లూనుకుందని వరుసగా జరిగిన ఎన్నికలు.. వాటి ఫలితాలు సైతం రూఢీ చేశాయి. గుట్టలు కనుమరుగవుతున్నాయని.. కొత్తగా క్వారీలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహించాయి. ఎన్నికల తర్వాత ఈ సంస్థలు పెదవి విప్పకముందే.. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగటం.. అందులోనూ అధికార పార్టీ నేతలే విరుచుకుపడుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.