breaking news
Government General Secretary
-
సంయమనమే మన విధి
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీస్ అధికారులు(సివిల్ సర్వెంట్లు) ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు రెచ్చగొట్టినా సంయమనంతో, ప్రశాంతతతో ముందుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. అవతలి వాళ్లు రెచ్చగొట్టారని నోరుజారితే ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఎవరెంత రెచ్చగొట్టినా సంయమనం పాటిద్దామని అన్నారు. జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదని, ఒక్క బంతి సరిగ్గా ఆడకపోయినా ఔట్ అయినట్లేనని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్‌లో అయితే ఒక బంతి అడటంలో విఫలమైనా మరోసారి సర్వీస్ చేసే అవకాశం ఉంటుందని, క్రికెట్లో అలా ఉండదని గుర్తుచేశారు. సివిల్ సర్వెంట్ ఉద్యోగం లాంగ్‌టర్మ్ క్రికెట్ మ్యాచ్ లాంటిదని, వివాదాలకు, తప్పులకు తావివ్వకుండా పని చేయాలని సూచించారు. సివిల్ సర్వెంట్ డే సందర్బంగా శనివారం తాత్కాలిక సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత సర్వీస్ అధికారులను ఉద్దేశించి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. అధికారులు ఎలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలో ఉద్బోధించారు. ఏం చేయాలో? ఏం చేయకూడదో విశదీకరించారు. విలువలను కాపాడడంలో సివిల్ సర్వెంట్లు కీలకపాత్ర పోషించాలని, సీనియర్ అధికారులు మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, సంక్షేమ పాలనే అంతిమ లక్ష్యాలు దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ స్థానంలో నిలిపేలా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. ‘‘మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సంయమనంతో, ప్రశాంతతతో ముందుకెళ్లాలి. అవతలి వాళ్లు రెచ్చగొట్టారని నోరుజారి ఉద్యోగాలు పోగొట్టుకున్న అధికారులు నాకు తెలుసు. ఒకటో బ్లాక్‌లో చేసినా, రెండో బ్లాక్‌లో చేసినా తేడా ఏమీ ఉండదు.(స్పెషల్ సీఎస్‌గా ఉన్నా, సీఎస్‌గా పనిచేసినా అని పరోక్షంగా చెప్పారు) ప్రజల ఆశయాలకు అనుగుణంగా సమాజ సర్వతోముఖాభివృద్ధికి, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అఖిల భారత సర్వీస్ అధికారులు చురుకైన పాత్ర పోషించాలి. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకుని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. రాజ్యాంగ పరిరక్షణ, మానవత్వం, సంక్షేమ పాలనే అంతిమ లక్ష్యాలుగా పని చేయాలి. వారసత్వ సంపద, సంస్కృతీ సంప్రదాయాలు, భాషా పరిరక్షణ, ప్రోత్సాహానికి సివిల్ సర్వెంట్లు అన్ని విధాలా కృషి చేయాలి. విలువలను కాపాడడంలో కీలకపాత్ర పోషించాలి. జూనియర్లకు సీనియర్లు ఆదర్శంగా నిలవాలి’’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరారు. చైనాలో సివిల్ సర్వెంట్ల విధానం మనకంటే ముందుగానే అమల్లోకి వచ్చిందని హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పూర్వపు డైరెక్టర్ జనరల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.ప్రశాంత మహాపాత్ర తెలిపారు. మానవ వనరుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. అవినీతి నియంత్రణకు కృషి చేయాలి సివిల్ సర్వెంట్లు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని గుజరాత్ రాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్ డైరెక్టర్ జనరల్ పి.కె.తనేజ సూచించారు. శాంతి భద్రతలను కాపాడడంలో న్యాయబద్ధమైన నియమాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. అవినీతిని నియంత్రించేందుకు ధైర్యంగా కృషి చేయాలన్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డి.చక్రపాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
‘కృష్ణా’ సమస్య నాలుగు రాష్ట్రాలది
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే సంబంధించినది కాదనే విషయం కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని ఆంధ్రప్రదేశ్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కృష్ణా పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలనూ భాగస్వాములు చేసి జలాల పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తమకు న్యాయం చేయలేదని, జలాల పంపిణీ ప్రక్రియకు మళ్లీ ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే. దానిపై ఏపీ అభిప్రాయాన్ని కోరుతూ కేంద్రం ఇటీవల లేఖ రాసింది. కేంద్రానికి జవాబు చెప్పే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సోమవారం జలసౌధలో ‘సాంకేతిక సలహా సంఘం’ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సాగునీటి శాఖ ఇంజనీర్లతో పాటు అదనపు అడ్వొకేట్ జనరల్ డి.శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు ఇవీ.. * కృష్ణా జలాల కేటాయింపు సమస్య కేవలం ఏపీ, తెలంగాణకు సంబంధించిందే కాదు. మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా భాగస్వాములను చేయాలి. * బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి ఎగువన తెలంగాణ ఏర్పాటైంది. దిగువ రాష్ట్రంగా ఏపీ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. తాజా వాదనలూ వినాలి. * బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను పొడిగించిన నేపథ్యంలో.. మళ్లీ అన్ని రాష్ట్రాల వాదనలు విని నీటి పంపిణీ మీద కొత్తగా నిర్ణయం తీసుకొనేలా కేంద్రం ఆదేశించాలి. లేదంటే.. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. కేంద్రానికి సీఎస్ ద్వారా లేఖ సాంకేతిక సలహా సంఘంలో వ్యక్తమైన అభిప్రాయాలను అదనపు అడ్వొకేట్ జనరల్ ద్వారా సీనియర్ న్యాయవాది గంగూలీకి పంపించనున్నారు.మార్పులు అవసరమని భావిస్తే మరోసారి ఈ సంఘం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ద్వారా కేంద్రానికి పంపిస్తారు.