breaking news
General Counting
-
ఓటరు దేవుని తీర్పు నేడే
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉత్కంఠకు నేటితో తెరపడనుంది....సార్వత్రిక ఫలితం కోసం పదహారు రోజుల నిరీక్షణ ముగియనుంది....అయితే, జాతకాలు తేలేసమయం రోజుల నుంచి గంటల్లోకి రావడంతో రాజకీయవర్గాల్లో అంతులేని టెన్షన్ నెలకొంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుండడంతో ఫలితం ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ప్రజలు పట్టం కడతారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణలోనే జిల్లా ఫలితంపై జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడి ఫలితంపైనే అందరి అంచనాలు ఉన్నాయి... బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. మొత్తంమీద ఖమ్మం జిల్లా భావి పాలకులెవరనేది నేడు ఓటరుదేవుడు తేల్చనున్నాడు. ఉదయం 8 నుంచి కౌంటింగ్.... గత నెల 30న జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరగడంతో మధ్యాహ్నానికి పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాలతో పాటే పార్లమెంటు కౌంటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లపై లెక్కించిన ఈవీఎంలన్నింటిలో ఎంపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి ఒక్కో రౌండ్‌గా పరిగణించనున్నారు. మొత్తం మీద ఖమ్మం పార్లమెంటు ఫలితం అసెంబ్లీలయిపోయిన తర్వాత అర్ధగంటలోపు ఇచ్చేస్తామని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి మాత్రం ఫలితం అక్కడే ప్రకటించనున్నారు. అన్ని పార్టీలకు కీలకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో జరిగిన ఎన్నికల ఫలితాలు జిల్లాలో వివిధ ప్రధాన పార్టీలకు కీలకం కానున్నాయి. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐలు భవిష్యత్‌పై గంపెడాశతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ ముగిసిన 16 రోజుల తర్వాత ఫలితం వస్తుండడంతో ప్రధాన పార్టీల తరఫున పోటీచేసిన అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. మొన్నటి వరకు గుంభనంగా ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులు ఫలితాలొచ్చే సమయం దగ్గరపడుతున్న కొద్దీ గాభరాకు లోనయ్యారు. శుక్రవారం ఉదయం ఫలితాలు రానుండడంతో గురువారం రాత్రి వారికి కాళరాత్రిగానే మిగిలిపోయింది. చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రంగా బరిలో ఉన్న వారు కూడా తమకు ఎన్ని ఓట్లు వస్తాయోనని అంచనాల్లో మునిగిపోయారు. అన్ని పార్టీల శ్రేణులు కూడా విజయంపై ఓ వైపు ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నాయి. మొత్తంమీద వీరి టెన్షన్‌కు శుక్రవారం మధ్యాహ్నం కల్లా తెరపడనుంది. -
పైన గాంభీర్యం.. లోన భయం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎన్నికలు ముగియడంతో రాజకీయ నాయకులకు హడావుడి తగ్గి గుబులు మొదలైంది. ఫలితాల లెక్కింపునకు సమయం సమీపిస్తుండడంతో ఘడియ ఘడియకూ వారిలో ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా పురపాలక సంఘాలు, స్థానిక సంస్థలు ఆ తర్వాత సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ముందుగా సోమవారం పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు, మంగళవారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శుక్రవారం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో గెలుపోటములు ఎలా ఉంటాయనే అంశం అభ్యర్థుల్లో, పార్టీ వర్గాల్లో కలవరం రేపుతోంది. ధీమా ఉన్నా తగ్గని దడ.. సుదీర్ఘ విరామం తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం పురపాలక సంఘాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగడంతో రాజకీయ పార్టీలు సైతం ప్రత్యేక దృష్టి సారించి కుర్చీ దక్కించుకునేందుకు వ్యూహరచనలు చేశాయి. ఇంతలో సార్వత్రిక పోరు తరుముకురావడంతో కొంత గందరగోళం నెలకొన్నప్పటికీ స్థానిక ఎన్నికలనూ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన తీరును పరిశీలించి ఇప్పటికే అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చారు. పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని వివిధ పార్టీల అభ్యర్థులు బాహాటంగా ప్రకటిస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చే స్తూ గాంభీర్యాన్ని చాటుతున్నారు. ఇంత ధీమాతో ఉన్న అభ్యర్థులకు కౌంటింగ్ సమయం ముంచుకొస్తుండడంతో వణుకు పుడుతోంది. తమ అంచనాలు నిజమవుతాయా.. లేక ప్రత్యర్థికి అవకాశాలు మెండుగా ఉన్నాయా అనే సందిగ్ధంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. బలం తగ్గితే.. స్థానిక సంస్థలకు చైర్మన్ ఎన్నికలు నేరుగా కాకుండా గెలుపొందిన సభ్యులే ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకీ ఎక్కువ మెజార్టీ వస్తుందో వారికే చైర్మన్‌గిరీ దక్కే అవకాశం ఉంది. అయితే మేజిక్ సంఖ్య రాకుంటే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో అవగాహణ కుదిరితే చైర్మన్ సీటు చేజిక్కుతుంది. కానీ రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఎన్నికల పోరులో నిలవడంతో బహిరంగ పొత్తులు ఎక్కడా జరగలేదు. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన అనంతరం రంగంలోకి దిగేందుకు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. సంఖ్యాబలం తగ్గితే నేరుగా క్యాంపులు నడిపి చైర్మన్ సీటు కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.