breaking news
Gas Users
-
‘ఆధార్’కు ఒత్తిడి తేవద్దు
సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్ సిలిండర్ పొందేందుకు ‘ఆధార్’ తప్పనిసరిగా సమర్పించాల్సిందేనంటూ తామెప్పుడూ ఎటువంటి నోటిఫికేషన్‌నూ జారీ చేయలేదన్న కేంద్ర ప్రభుత్వం నివేదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాలంటూ వినియోగదారులను ఒత్తిడి చేయరాదని ఆదేశిస్తూ గురువారం అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించింది. ఆధార్ కార్డు కోసం బయో మెట్రిక్ విధానం ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారని, ఇలా చేయడం పౌరుల వ్యక్తిగత గోపత్యను భగ్నం చేయడమేనని పేర్కొంటూ హైదరాబాద్, సరూర్‌నగర్‌కు చెందిన టి.ఎస్.ఆర్.శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చల్లా సీతారామయ్య వాదనలు వినిపిస్తూ... బయోమెట్రిక్ ద్వారా పౌరుల వివరాలను సేకరించడంపై పలు దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. మన ప్రభుత్వం మాత్రం చట్టవిరుద్ధంగా ఆధార్ పేరుతో పౌరుల వివరాలను బయోమెట్రిక్ ద్వారా సేకరిస్తోందన్నారు. పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు, అధికారం ప్రభుత్వానికి లేవని వివరించారు. అసలు ఆధార్‌కు సంబంధించిన బిల్లు ఇంతవరకు చట్టరూపం దాల్చలేదని, కాబట్టి ఆధార్ కార్డుకు చట్టబద్ధత లేదని నివేదించారు. ఆయన వాదనలు పూర్తి చేసిన తరువాత ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. అసలు ఏ చట్టం ప్రకారం ఆధార్ కార్డుల కోసం పౌరుల వివరాలను బయో మెట్రిక్ ద్వారా సేకరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్‌ను ప్రశ్నించారు. దీనికి అశోక్‌గౌడ్ సమాధానమిస్తూ, అసలు పిటిషనర్ ఆధార్ కార్డుల వ్యవహారానికి సంబంధించిన ప్రణాళిక మంత్రిత్వశాఖను ప్రతివాదిగా చేర్చలేదని తెలిపారు. ఆధార్‌తో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఎటువంటి సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేసే బాధ్యత మాత్రమే ఆ శాఖదని వివరించారు. ఇంతలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘‘ఇవన్నీ ఎవరికి కావాలి. ఈ వివరాలు పక్కనపెట్టి, ఏ చట్టం ప్రకారం వివరాలు సేకరిస్తున్నారో ముందు చెప్పండి’’ అని అన్నారు. దీనిపై అశోక్‌గౌడ్ స్పందిస్తూ, గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎటువంటి నోటిఫికేషన్‌నూ జారీ చేయలేదని చెప్పారు. దీనికి జస్టిస్ సేన్‌గుప్తా వెంటనే స్పందిస్తూ.. ‘‘ఇంకేం, మీకు సంతోషమే కదా. కౌంటర్లో కూడా ఇదే విషయం చెప్పారని చెబుతున్నారు. దీనిపై మేం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తాం’’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అశోక్‌గౌడ్ చెప్పిన వివరణను రికార్డ్ చేసుకున్న ధర్మాసనం... గ్యాస్ పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాలని ఏ ఒక్క వినియోగదారుడినీ ఒత్తిడి చేయవద్దంటూ గ్యాస్ ఏజెన్సీలను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
అక్టోబర్ నుంచి నగదు బదిలీ
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: జిల్లాలో నగదు బదిలీ పథకం అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని పౌరసరఫరాల జిల్లా అధికారి ఎం.గౌరీశంకర్ తెలిపారు. అశ్వరావుపేట తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 85శాతం ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తయిందన్నారు. నగదు బదిలీని అక్టోబర్ నెలలో జిల్లాలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. గ్యాస్ వినియోగదారులు అక్టోబర్ కల్లా ఆధార్ నంబరును ఎల్పీజీ డీలర్‌కు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయించుకోవాలన్నారు. ఆధార్ సంఖ్యను నమోదు చేయించుకోకున్నా మూడు నెలలపాటు సబ్సిడీ అందుతుందని, ఆతర్వాత బహిరంగ మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. రచ్చబండ రెండో దశలో వచ్చి రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిందన్నారు. రేషన్‌కార్డుల నంబర్లు జారీ అయ్యాయని, లబ్ధిదారుల ఫొటోలు సేకరించి వెబ్సైట్లో అప్లోడ్ చేయగానే కార్డులు జారీ చేస్తామని తెలిపారు. రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారు తహశీల్దార్ కార్యాలయాల్లోని జాబితాను చూసుకోవాలన్నారు. కార్డు మంజూరైన వారు ఫొటోలను కార్యాలయంలో అందించాలని సూచించారు. జిల్లాలో 29,800 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. అశ్వారావుపేట మండలంలో 261 కార్డులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఫొటోలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని వీర్వోలను ఆదేశించామన్నారు. దీపం పథకం ద్వారా 34 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. 9,331 కనెక్షన్లకు ప్రతిపాదనలు రావాల్సి ఉందని, 13,189 కనెక్షన్లకు పంపిణీ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. విలేకరుల సమావేశంలో తహశీల్దార్ వెంకారెడ్డి పాల్గొన్నారు.