breaking news
Fisherman killed
-
చేప దాడి.. మత్స్యకారుడి మృతి!
పరవాడ (పెందుర్తి): వినడానికి కొంత ఆశ్చర్యంగానూ, మరికొంత వింతగానూ ఉన్నప్పటికీ.. సముద్రం సాక్షిగా ఇది నిజం. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ మత్స్యకారుడు.. భారీ చేప చేసిన దాడిలో మృత్యువాత పడ్డాడనే వార్త బుధవారం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.. పోలీసులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం శివారు జాలారీపేట గ్రామానికి చెందిన నొల్లి జోగన్న (45).. కంబాల చినదేముడు, కంబాల కొర్లయ్య, కంబాల మహేష్, ఓలిశెట్టి అప్పలరాజు, ఓలిశెట్టి ముత్తురాజుతో కలిసి ఆదివారం రాత్రి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు. కొమ్ము కోనాం చేప దాడిలో మృతి చెందిన మత్స్యకారుడు జోగన్న బుధవారం తెల్లవారుజామున తీరానికి చేరే క్రమంలో జోగన్న భారీ చేపకు గేలం వేశాడు. జోగన్న వేసిన గేలానికి 100 కిలోల బరువు కలిగిన కొమ్ము కోనాం అనే భారీ చేప చిక్కింది. గేలానికి చిక్కిన కొమ్ము కోనాం చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో భాగంగా నీటిలో దిగిన జోగన్నపై భారీ చేప దాడి చేసి తన కొమ్ముతో కడుపులో పొడిచింది. ఈ దాడిలో జోగన్న తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో జరగడం వల్ల గాయపడిన జోగన్నకు సకాలంలో వైద్య సేవలు అందించడం సాధ్యపడలేదని, తీరానికి చేరడానికి తమకు 8 గంటల సమయం పట్టిందని తోటి మిత్రులు వాపోయారు. మృతుడికి భార్య లక్ష్మి, నరేష్, అరవింద్ అనే ఇద్దరు కుమారులున్నారు. పోషించే యజమాని మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ఓ భారీ చేప దాడి చేసిన ఘటనలో మత్స్యకారుడు మృతి చెందడం ముత్యాలమ్మపాలెం తీరంలో ఇదే ప్రథమమని మత్స్యకారులు చెబుతున్నారు. జోగన్న మృతి కేసును విశాఖ మెరైన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పరవాడ ఎస్ఐ పి.రమేష్ తెలిపారు. -
నదిలో పిడుగుపాటు: జాలరి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున పిడుగులు పడ్డాయి. తాడేపల్లి మండలం సీతానగరం సమీపంలోని కృష్ణానదిలో పిడుగు పడింది. ఈ ఘటనలో నదిలో చేపల పడుతున్న జాలరి మరదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే నాదెండ్ల మండలం అప్పాపురంలో పొలాల్లో కూడా పిడుగులు పడ్డాయి. దీంతో 7 ఏకరాల్లోని గడ్డివాము కూడా దగ్ధమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు పట్టణాల్లో గత అర్థరాత్రి నుంచి ఎడతేరపి లేకుండా వర్షం కురుస్తుంది. నెల్లూరు నగరం, కావలి, గూడూరు పట్టణాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. దాంతో పట్టణవాసులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రకాశం జిల్లాలో వివిధ ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అద్దంకి, కోరసిపాడు, బల్లికురవ, టంగుటూరు, సంతమాగులూరు మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దాంతో ఆయా మండలాల్లోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు