breaking news
Final Destination
-
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా
మరో క్రేజీ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకు తగ్గట్లే చాలా ఏళ్ల తర్వాత చివరి భాగాన్ని రిలీజ్ చేయగా, యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)సీక్వెల్స్, ఫ్రాంచైజీల ట్రెండ్ మన దగ్గర రీసెంట్ టైంలో బాగా పాపులర్ అయింది. కానీ హాలీవుడ్లో మాత్రం చాలా ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. అలా 'ఫైనల్ డెస్టినేషన్' అనే భయానక చిత్రాల ఫ్రాంచైజీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చావులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తారు. 2000లో తొలి భాగం రిలీజ్ కాగా.. 2003, 2006, 2009, 2011లో వరసగా నాలుగు చిత్రాలు రిలీజయ్యాయి. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.ఈ ఫ్రాంచైజీలో భాగంగా చివరిదైన 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' మూవీ.. గత నెల అంటే మే 16న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఇంకా ఆడుతోంది. అదే టైంలో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికాలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే అద్దె విధానంలో చూడొచ్చు. జూన్ 17 నుంచి అంటే ఈ మంగళవారం ఉదయం నుంచి మన దేశంలో రెంట్ విధానంలో స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ హారర్, భయానక చిత్రాలంటే ఇష్టముంటే దీన్ని ఓసారి ప్రయత్నించండి. వీలైతే ఒంటరిగానే చూడండి.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) -
చూస్తుంటేనే భయానకం... 14 ఏళ్ల తర్వాత ఆరో భాగం రిలీజ్
ఫైనల్ డెస్టినేషన్.. హాలీవుడ్ లో ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే చావు ఎన్ని రకాలుగా ఉంటుందో ఈ సినిమాల్లో చూపించారు. మన చుట్టూ ఉండే చిన్న చిన్న వస్తువులే మన ప్రాణాలు తీస్తాయి అని భయపెట్టారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలోని ఆరో భాగం విడుదలకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే) 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్' పేరుతో ఆరో భాగమైన చివరి పార్ట్ ని తీశారు. మే 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ముందురోజు 15వ తేదీనే మన దేశంలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ చేస్తుండటం విశేషం. 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా పార్ట్స్ వచ్చాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరోది రిలీజ్ అవుతోంది. ఇదే చివరిది కూడా.కొన్నాళ్ల క్రితమే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది కూడా భయపెట్టేసింది. ఇంటి పెరటిలో ఓ ఫ్యామిలీ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్లని చావు వెంటాడుతుంది. బీర్ గ్లాస్ ముక్క, వాక్యూమ్ క్లీనర్.. ఇలా అక్కడున్న ప్రతి వస్తువు వీళ్ల చావుకు కారణమయ్యేలా ఉంటుంది. మరి చావు నుంచి తప్పించుకున్నారా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ట్విన్స్ కి జన్మనిచ్చిన హాలీవుడ్ ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?) -
విధిని మోసం చెయ్యగలరా?
హాలీవుడ్ సినిమా / ఫైనల్ డెస్టినేషన్ హారర్ సినిమాలు చూస్తే చాలామందికి నిద్ర పట్టకపోవచ్చు. పద్నాలుగేళ్ల జెఫ్రీ రెడిక్కి ‘ఎ నైట్మేర్ ఆన్ ఈలమ్ స్ట్రీట్’ సినిమా చూశాక నిద్రపట్టలేదు. వెంటనే ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా పది పేజీల్లో కథ రాసి న్యూ లైన్ సినిమా నిర్మాణ సంస్థకి పంపించాడు. పసిపిల్లాడి సినిమా కథ స్టూడియో వాళ్లకి నచ్చలేదు కాని ఆ కుర్రాడి ఉత్సాహం, ఆసక్తి నచ్చింది. జెఫ్రీ రెడిక్కి - స్టూడియో అధినేత రాబర్ట్ షాయ్‌కి స్నేహం ప్రారంభమైంది. ఉత్తరాల్లో, ఫోనుల్లో కథల గురించి చర్చలు, విశ్లేషణలు కొనసాగాయి. జెఫ్రీ ఒకసారి విమానంలో ప్రయాణిస్తుండగా ఓ కథ చదివాడు. ఫ్లైట్‌లో ప్రయాణించబోతున్న తన కూతురికి ఓ తల్లి ఫోన్ చేసి, ‘ఆ విమానం ఎక్కొద్దు. అది కూలిపోతుందని నాకేదో పీడకల వచ్చింది’ అని చెబుతుంది. కూతురు ఆ ఫ్లైట్ బదులు వేరే ఫ్లైట్ ఎక్కుతుంది. ఆ వేరే ఫ్లైట్ కూలిపోతుంది. ‘చావుని వాయిదా వేయగలరు - కాని తప్పించుకోలేరు’ అనే ఆలోచన జెఫ్రీకి మెరుపులా మెరిసింది. అదే ‘ఫైనల్ డెస్టినేషన్’. అప్పట్లో ‘ఎక్స్-ఫైల్స్’ అనేది ఓ పాపులర్ టీవీ సీరియల్. దానికోసం ఈ కథని రాశాడు జెఫ్రీ. ఆ సీరియల్‌కి దర్శక రచయిత జేమ్స్‌వాంగ్. తన మిత్రుడు గ్లెన్ మోర్గాన్‌తో కలిసి ‘ఎక్స్-ఫైల్స్’ని మరింత పాపులర్ చేశాడు. న్యూ లైన్ సినిమా ‘ఫైనల్ డెస్టినేషన్’ స్క్రిప్ట్‌ని జేమ్స్‌వాంగ్ దృష్టికి తీసుకెళ్లింది. ‘మృత్యువను మించిన భయంకరమైన శత్రువు మరొకరు లేరు. ఎవరూ జయించలేరు’ అనే ఆలోచన జేమ్స్వాంగ్ని ఉర్రూతలూగించింది. జెఫ్రీ కథని - జేమ్స్‌వాంగ్ తన సహ రచయిత గ్లెన్ మోర్గాన్‌తో కలిసి తిరగ రాశాడు. ‘ఫైనల్ డెస్టినేషన్’ ప్రభంజనం ప్రారంభమైంది. హైస్కూల్లో చదువుకుంటున్న అలెక్స్ బ్రౌనింగ్ తన క్లాస్‌మేట్స్‌తో కలిసి, ప్యారిస్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఫ్లైట్ నంబర్ 180. టేకాఫ్ తీసుకునే సమయంలో అలెక్స్‌కి జరగబోయే దారుణం ఓ కలగా స్ఫురించింది. లెక్స్ భయపడినట్లుగానే ఫ్లైట్ నంబర్ 180 మధ్యలోనే కూలిపోయింది. మొత్తం ప్రయాణికుల్లో నుంచి బయటపడింది అలెక్స్, అతడి ఫ్రెండ్సే. అలెక్స్‌కి జరగబోయే ప్రమాదం ముందే ఎలా తెలుసు? విమాన ప్రమాదానికి, అతనికి సంబంధం ఉందా అని ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభమైంది. ఈ ప్రమాదం జరిగిన 39 రోజుల తర్వాత మృతులకి నివాళి ఘటిస్తూ, ఈ కుర్రాళ్లందరూ కలుసుకున్నారు. అదే రోజు రాత్రి అలెక్స్ ఫ్రెండ్ టాడ్ బాత్‌టబ్‌లో ఊపిరాడక చనిపోయాడు. అందరూ ఆత్మహత్య అనుకున్నారు. టాడ్ అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు కలిసిన విలియమ్ అనే వ్యక్తి వాళ్లందరూ తప్పు చేశారని, మరణ శాసనాన్ని ఎదిరించే ప్రయత్నం చేశారని, మృత్యువు ఆగ్రహానికి వాళ్లందరూ గురయ్యారని చెప్పాడు. ఎవరు ఎలా చావాలో, ఆ వరుస ప్రకారమే చనిపోతారని విలియమ్ చెప్పాడు. అలెక్స్ టెన్షన్ ప్రారంభమైంది. గతంలో లాగే తనకి ప్రమాదం జరిగే ముందు సూచనలు కనబడతాయని, వాటి ఆధారంగా తప్పించుకోవచ్చని చెప్పాడు. అలెక్స్ మాటలు నమ్మని కార్టర్, అతని గాళ్ ఫ్రెండ్ టెర్రీ అలెక్స్‌తో తీవ్రంగా వాదించారు. అనుకోకుండా ఓ బస్సు వచ్చి గుద్దేయడంతో టెర్రీ చనిపోయింది. ఆ తర్వాతి వంతు తమ టీచర్ ల్యూటన్ అని తెలుసుకున్న అలెక్స్, ఆమెని హెచ్చరించడానికి ఇంటికెళ్లాడు. అలెక్స్ మాటలు నమ్మని ల్యూటన్ అతడ్ని ఎఫ్‌బీఐ ఏజెంట్లకి అప్పగించింది. అయితే పొరబాటున ఓ కత్తి దిగబడటంతో ల్యూటన్ చనిపోయింది. ఆమె ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఇప్పుడు అలెక్స్ చెబుతుంది నిజమని కార్టర్ కూడా నమ్మాడు. టీచర్ తర్వాత చనిపోబోతుంది తనేనని కార్టర్ తెలుసుకున్నాడు. ఆ భయం, ఆ ఒత్తిడి భరించలేని కార్టర్ తనంతట తానే చనిపోవాలనుకుని, రైలు పట్టాల మీద తన కారు పార్క్ చేశాడు. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. బయటపడదామని చూస్తే సీటు బెల్టు బిగుసుకుంది. అలెక్స్ అతి కష్టం మీద కార్టర్‌ని కాపాడాడు. కాని ట్రైన్ కార్టర్ కారుని తుక్కుతుక్కు చేసింది. ఆ కారులోని ఓ భాగం వచ్చి బిల్లీకి తగలడంతో చావు బిల్లీని వరించింది. ఆ తర్వాత అలెక్స్, క్లియర్ కొద్దిలో చావు నుంచి తప్పించుకుంటారు. ఆరు నెలల తర్వాత అలెక్స్, క్లియర్, కార్టర్ ప్యారిస్ బయల్దేరారు. చావు భయం తప్పినట్లే అని అందరూ సంతోషపడుతుంటే - తను మాత్రం ఇంకా లిస్ట్‌లోనే ఉన్నానని అలెక్స్ అన్నాడు. అతనికి రకరకాల సూచనలు కనబడుతున్నాయి. ఓ బస్సు వచ్చి, నియాన్ సైన్‌ని కొట్టింది. ఆ సైన్ అలెక్స్ వైపు తిరిగింది. అలెక్స్‌కి చావు తప్పదు అనే క్షణంలో అలెక్స్‌ని కార్టర్ కాపాడాడు. ఇక చావు నుంచి తప్పించుకున్నట్లే అని అలెక్స్ సంతోషపడుతుంటే - ఆ సైన్ కార్టర్ వైపు తిరగడంతో ‘ఫైనల్ డెస్టినేషన్’ మొదటి భాగం పూర్తవుతుంది. ఓ టీనేజ్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన (2000) ఈ సినిమాకి 4 సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ సూపర్‌హిట్ కావడం విశేషం. 23 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 112 మిలియన్ల పైగా వసూలు చేసింది. - తోట ప్రసాద్ -
జరగబోయేది చెబుతుంది!
సైన్స్... ఫిక్షన్... హారర్... టై... సిక్త్స్‌సెన్స్... ఏది చూసినా... అంతకుముందే జరిగినట్టు అనిపించడం... జరగబోయేదాన్ని కలగనడం... ‘ఫైనల్ డెస్టినేషన్’ వంటి ఎన్నో సినిమాలు ఈ అంశం ఆధారంగానే వచ్చాయి. ఆ ప్రభావంతో నామాల రవీందర్సూరి తీసిన లఘుచిత్రమే సిక్త్స్‌సెన్స్... డెరైక్టర్స్ వాయిస్: మాది నల్గొండ జిల్లా జాల్పకుంట్ల. ఉస్మానియా యూనివ ర్శిటీలో తెలుగు సాహిత్యంలో ఎంఫిల్ చేశాను. ఆలూరి సాంబశివరావు నిర్మించిన సిక్త్స్‌సెన్స్ అనే ఈ లఘుచిత్రాన్ని ఆలూని క్రియేషన్స్ బ్యానర్‌పై తీశాను. చిన్నచిన్న కవితలతో మొదలైన నా రచన... కథలు, నవలలు టీవీ ప్రోగ్రామ్స్ నుండి సినిమాలకు కథ అందించేంతవరకూ సాగింది. నాలుగు సినిమాలకి కథ, మాటలు అందించాను. అన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఏడ్చేవాడిని... కంటికి చుక్క కారకుండా కసితీరా ఏడ్చేవాడిని. ఓడిపోతానేమోనని ఏడ్చేవాడిని. కానీ ఓడిపోయాననుకున్న ప్రతిసారీ మా సూరన్న ఎప్పటికైనా నేను గెలుస్తానని ధైర్యం చెప్పేవాడు. పోతే, నేను రచయితగా పరిచయమవుతాననుకుంటే, డెరైక్టర్ని అవుతున్నాను. నా చిన్ననాటి మిత్రుడు బిజినెస్ పార్ట్నర్ అయిన నిర్మాత సాంబశివరావుగారికి కాన్సెప్ట్ చెప్పడం అత నికి నచ్చడం చకచకా జరిగిపోయాయి. ఇదే నిర్మాతతో ఇప్పుడు బిగ్ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాను. ఈ షార్ట్ ఫిలిమ్‌కి నాకు నా మిత్రులు బాగా సహకరించారు. షార్ట్ స్టోరీ: జరగబోయేది ముందుగానే తెలియడం, కల రూపంలో సాక్షాత్కరించడం... కామెంట్: ఫిక్షన్ కథను బాగా తయారుచేసుకున్నాడు. కెమెరా యాంగిల్స్ బావున్నాయి. భయానక రసాన్ని బాగా చూపించాడు. సస్పెన్స్‌ను ఎంతో ఉత్కంఠభరితంగా చూపాడు. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్... అన్నీ బావున్నాయి. ముఖ్యంగా డైలాగులు చాలా బావున్నాయి. కలలు నిజాలు... కలలు అబద్ధాలు... ఆకారంలో కలలు ఎలాగైనా ఉండొచ్చు... వంటి మాటలు బాగా రాశాడు. ‘ఏడుపును బయటకు రానీయకుండా... నవ్వును బయటకు తీసుకుని రారా...’ ‘నవ్వు నలిగిపోకుండా... ఏడుపు ఎగరగొట్టకుండా... రెండింటినీ మిక్స్ చేయరా...’ వంటి సంభాషణలు ఆర్సిఎం రాజు గళంలో పలకడం ఈ లఘుచిత్రానికి ప్లస్ అయ్యింది. రూమ్ డెకొరేషన్ చాలా బావుంది. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చూపించడంలో దర్శకుడికి ఉన్న అభిరుచి కనపడుతోంది. ప్రధానపాత్రలో వేసిన వ్యక్తి డైలాగ్ డెలివరీ బాగాలేదు. భావాలను ముఖంలో బాగానే వ్యక్తీకరించాడు కాని, డైలాగ్ డెలివరీ మాత్రం చాలా పూర్‌గా ఉంది. ఇటువంటి సస్పెన్స్ చిత్రాలలో డైలాగ్‌లో ఎక్స్ప్రెషన్, ముఖంలో భయం... వంటివి పూర్తిశాతం ప్రదర్శించలేకపోతే చిత్రం రక్తికట్టదు. నటనలో టైమింగ్, ఇంకా ఎడిటింగ్ బావుండాలి. చిత్రంలో అన్ని హంగులూ పూర్తిస్థాయిలో ఉంటేనే ఆ చిత్రం కలకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. సినిమాలలో దర్శకులుగా స్థిరపడాలనుకునేవారు పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. - డా.వైజయంతి కలలు నిజాలు... కలలు అబద్ధాలు... ఆకారంలో కలలు ఎలాగైనా ఉండొచ్చు... వంటి మాటలు బాగా రాశాడు. ‘ఏడుపును బయటకు రానీయకుండా... నవ్వును బయటకు తీసుకుని రారా...’ ‘నవ్వు నలిగిపోకుండా... ఏడుపు ఎగరగొట్టకుండా... రెండింటినీ మిక్స్ చేయరా...’ వంటి సంభాషణలు ఆర్సిఎం రాజు గళంలో పలకడం ఈ లఘుచిత్రానికి ప్లస్ అయ్యింది.