విధిని మోసం చెయ్యగలరా?

విధిని మోసం చెయ్యగలరా?


హాలీవుడ్ సినిమా / ఫైనల్ డెస్టినేషన్

 


హారర్ సినిమాలు చూస్తే చాలామందికి నిద్ర పట్టకపోవచ్చు. పద్నాలుగేళ్ల జెఫ్రీ రెడిక్‌కి ‘ఎ నైట్‌మేర్ ఆన్ ఈలమ్ స్ట్రీట్’ సినిమా చూశాక నిద్రపట్టలేదు. వెంటనే ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా పది పేజీల్లో కథ రాసి న్యూ లైన్ సినిమా నిర్మాణ సంస్థకి పంపించాడు. పసిపిల్లాడి సినిమా కథ స్టూడియో వాళ్లకి నచ్చలేదు కాని ఆ కుర్రాడి ఉత్సాహం, ఆసక్తి నచ్చింది. జెఫ్రీ రెడిక్‌కి - స్టూడియో అధినేత రాబర్ట్ షాయ్‌కి స్నేహం ప్రారంభమైంది. ఉత్తరాల్లో, ఫోనుల్లో కథల గురించి చర్చలు, విశ్లేషణలు కొనసాగాయి.



జెఫ్రీ ఒకసారి విమానంలో ప్రయాణిస్తుండగా ఓ కథ చదివాడు. ఫ్లైట్‌లో ప్రయాణించబోతున్న తన కూతురికి ఓ తల్లి ఫోన్ చేసి, ‘ఆ విమానం ఎక్కొద్దు. అది కూలిపోతుందని నాకేదో పీడకల వచ్చింది’ అని చెబుతుంది. కూతురు ఆ ఫ్లైట్ బదులు వేరే ఫ్లైట్ ఎక్కుతుంది. ఆ వేరే ఫ్లైట్ కూలిపోతుంది. ‘చావుని వాయిదా వేయగలరు - కాని తప్పించుకోలేరు’ అనే ఆలోచన జెఫ్రీకి మెరుపులా మెరిసింది. అదే ‘ఫైనల్ డెస్టినేషన్’.



అప్పట్లో ‘ఎక్స్-ఫైల్స్’ అనేది ఓ పాపులర్ టీవీ సీరియల్. దానికోసం ఈ కథని రాశాడు జెఫ్రీ. ఆ సీరియల్‌కి దర్శక రచయిత జేమ్స్‌వాంగ్. తన మిత్రుడు గ్లెన్ మోర్గాన్‌తో కలిసి ‘ఎక్స్-ఫైల్స్’ని మరింత పాపులర్ చేశాడు. న్యూ లైన్ సినిమా ‘ఫైనల్ డెస్టినేషన్’ స్క్రిప్ట్‌ని జేమ్స్‌వాంగ్ దృష్టికి తీసుకెళ్లింది. ‘మృత్యువను మించిన భయంకరమైన శత్రువు మరొకరు లేరు. ఎవరూ జయించలేరు’ అనే ఆలోచన జేమ్స్‌వాంగ్‌ని ఉర్రూతలూగించింది. జెఫ్రీ కథని - జేమ్స్‌వాంగ్ తన సహ రచయిత గ్లెన్ మోర్గాన్‌తో కలిసి తిరగ రాశాడు. ‘ఫైనల్ డెస్టినేషన్’ ప్రభంజనం ప్రారంభమైంది.

   

హైస్కూల్లో చదువుకుంటున్న అలెక్స్ బ్రౌనింగ్ తన క్లాస్‌మేట్స్‌తో కలిసి, ప్యారిస్ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఫ్లైట్ నంబర్ 180. టేకాఫ్ తీసుకునే సమయంలో అలెక్స్‌కి జరగబోయే దారుణం ఓ కలగా స్ఫురించింది. లెక్స్ భయపడినట్లుగానే ఫ్లైట్ నంబర్ 180 మధ్యలోనే కూలిపోయింది. మొత్తం ప్రయాణికుల్లో నుంచి బయటపడింది అలెక్స్, అతడి ఫ్రెండ్సే. అలెక్స్‌కి జరగబోయే ప్రమాదం ముందే ఎలా తెలుసు? విమాన ప్రమాదానికి, అతనికి సంబంధం ఉందా అని ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభమైంది. ఈ ప్రమాదం జరిగిన 39 రోజుల తర్వాత  మృతులకి నివాళి ఘటిస్తూ, ఈ కుర్రాళ్లందరూ కలుసుకున్నారు. అదే రోజు రాత్రి అలెక్స్ ఫ్రెండ్ టాడ్ బాత్‌టబ్‌లో ఊపిరాడక చనిపోయాడు. అందరూ ఆత్మహత్య అనుకున్నారు. టాడ్ అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు కలిసిన విలియమ్ అనే వ్యక్తి వాళ్లందరూ తప్పు చేశారని, మరణ శాసనాన్ని ఎదిరించే ప్రయత్నం చేశారని, మృత్యువు ఆగ్రహానికి వాళ్లందరూ గురయ్యారని చెప్పాడు. ఎవరు ఎలా చావాలో, ఆ వరుస ప్రకారమే చనిపోతారని విలియమ్ చెప్పాడు.



అలెక్స్ టెన్షన్ ప్రారంభమైంది. గతంలో లాగే తనకి ప్రమాదం జరిగే ముందు సూచనలు కనబడతాయని, వాటి ఆధారంగా తప్పించుకోవచ్చని చెప్పాడు. అలెక్స్ మాటలు నమ్మని కార్టర్, అతని గాళ్ ఫ్రెండ్ టెర్రీ అలెక్స్‌తో తీవ్రంగా వాదించారు. అనుకోకుండా ఓ బస్సు వచ్చి గుద్దేయడంతో టెర్రీ చనిపోయింది. ఆ తర్వాతి వంతు తమ టీచర్ ల్యూటన్ అని తెలుసుకున్న అలెక్స్, ఆమెని హెచ్చరించడానికి ఇంటికెళ్లాడు. అలెక్స్ మాటలు నమ్మని ల్యూటన్ అతడ్ని ఎఫ్‌బీఐ ఏజెంట్లకి అప్పగించింది. అయితే పొరబాటున ఓ కత్తి దిగబడటంతో ల్యూటన్ చనిపోయింది. ఆమె ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయ్యింది.



 ఇప్పుడు అలెక్స్ చెబుతుంది నిజమని కార్టర్ కూడా నమ్మాడు. టీచర్ తర్వాత చనిపోబోతుంది తనేనని కార్టర్ తెలుసుకున్నాడు. ఆ భయం, ఆ ఒత్తిడి భరించలేని కార్టర్ తనంతట తానే చనిపోవాలనుకుని, రైలు పట్టాల మీద తన కారు పార్క్ చేశాడు. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడు. బయటపడదామని చూస్తే సీటు బెల్టు బిగుసుకుంది. అలెక్స్ అతి కష్టం మీద కార్టర్‌ని కాపాడాడు. కాని ట్రైన్ కార్టర్ కారుని తుక్కుతుక్కు చేసింది. ఆ కారులోని ఓ భాగం వచ్చి బిల్లీకి తగలడంతో చావు బిల్లీని వరించింది.



 ఆ తర్వాత అలెక్స్, క్లియర్ కొద్దిలో చావు నుంచి తప్పించుకుంటారు. ఆరు నెలల తర్వాత అలెక్స్, క్లియర్, కార్టర్ ప్యారిస్ బయల్దేరారు. చావు భయం తప్పినట్లే అని అందరూ సంతోషపడుతుంటే - తను మాత్రం ఇంకా లిస్ట్‌లోనే ఉన్నానని అలెక్స్ అన్నాడు. అతనికి రకరకాల సూచనలు కనబడుతున్నాయి. ఓ బస్సు వచ్చి, నియాన్ సైన్‌ని కొట్టింది. ఆ సైన్ అలెక్స్ వైపు తిరిగింది. అలెక్స్‌కి చావు తప్పదు అనే క్షణంలో అలెక్స్‌ని కార్టర్ కాపాడాడు. ఇక చావు నుంచి తప్పించుకున్నట్లే అని అలెక్స్ సంతోషపడుతుంటే - ఆ సైన్ కార్టర్ వైపు తిరగడంతో ‘ఫైనల్ డెస్టినేషన్’ మొదటి భాగం పూర్తవుతుంది.


ఓ టీనేజ్ హారర్ థ్రిల్లర్‌గా   రూపొందిన (2000) ఈ సినిమాకి 4 సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ సూపర్‌హిట్ కావడం విశేషం.  23 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 112 మిలియన్ల పైగా వసూలు చేసింది.




 

- తోట ప్రసాద్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top