ఓటీటీలోకి ప్రియాంక చోప్రా యాక్షన్‌ కామెడీ ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’.. కథేంటంటే? | Heads Of State Movie Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Heads Of State Review: ఊహకందని యాక్షన్‌ కామెడీ

Jul 12 2025 10:58 AM | Updated on Jul 12 2025 12:05 PM

Heads Of State Movie Movie Review In Telugu

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. 

ఏదైనా సినిమా చూసే ప్రేక్షకులకు తాము చూసే ఆ సినిమా పై కొంత అవగాహన, కొంత ఊహ ఉంటాయి. ఆ ప్రేక్షకుల అవగాహనను, ఊహను పటాపంచలు చేస్తూ ఉత్కంఠభరితంగా సినిమాని తీసుకువెళ్లగలిగితే అప్పుడు ప్రతిభగల దర్శకుడు అనిపించుకుంటారు. ఆ విషయంలో ఈ సినిమా దర్శకుడు ఓ అయిదాకులు ఎక్కువే తిన్నారని చెప్పవచ్చు. నాయిషుల్లర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌’ ఓ ఊహకందని యాక్షన్‌ కామెడీ మూవీ అనొచ్చు. ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌ కామెడీ స్ట్రీమ్‌ అవుతోంది. 

ఈ సినిమా ప్రేక్షకుడి ఊహకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. కథ సింపుల్‌ అయినా ఆ స్టోరీ లైన్‌ విచిత్రంగా ఉంటుంది. అంతలా ఈ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ సినిమా కథ ప్రకారం యూఎస్, యూకె ప్రెసిడెంట్లు బద్ధ శత్రువులు. కానీ ఓ అనుకోని మీటింగ్‌లో ఇద్దరూ కలవాల్సి వస్తుంది. అయితే అదే మీటింగ్‌ నుండి ఈ ఇద్దరినీ ఓ ప్లాన్‌ ప్రకారం ఒకే ఫ్లైట్‌లో ఓ ఐల్యాండ్‌కు పంపుతాడు విలన్‌. ఎడమొహం అంటే పెడమొహం అనుకునే అత్తాకోడళ్ళలా కొట్టుకునే ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే నడుస్తుంది. ఇంతలో ఆ ఫ్లైట్‌ను విలన్‌ అనుచరులు దాడి చేసి, కూల్చేస్తారు. 

యూఎస్, యూకె ప్రెసిడెంట్లు ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ జెట్‌ ఎక్కడో మారుమూల చిట్టడివిలో కూలిపోతే ప్రపంచమంతా ఉలిక్కిపడుతుంది. దాదాపుగా అందరూ వీళ్ళిద్దరూ చనిపోయారనుకుంటారు. కానీ అక్కడి నుండి బయటపడి వీరిద్దరూ విలన్‌ని ఎలా కట్టడి చేస్తారనేది సినిమాలోనే చూడాలి. ప్రముఖ నటులు జాన్‌ సేనా, ఇడ్రిస్‌ ఎల్బా ప్రధాన పాత్రలలో నటించి తమ పాత్రలకు న్యాయం చేశారు. 

వీళ్ళకి తోడుగా ఏజెంట్‌ పాత్రలో మన భారతీయ బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా నటించడం విశేషం. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా లైన్‌తో పాటు ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఊహతో సంబంధం లేకుండా నడుస్తుంది. అంతేకాదు... సినిమా అంతా సరదా సరదాగా సాగిపోతుంది. మస్ట్‌ వాచ్‌ ఫర్‌ ది వీకెండ్‌.  
– హరికృష్ణ ఇంటూరు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement