breaking news
Fearless Girl
-
నిర్భయ!భయం ఆమె ‘మెదడు’లోనే లేదు
పొట్టలో ఏదో సీతాకోక చిలుకలు ఎగురుతున్న ఫీలింగ్ మనందరికీ తరచూ కలిగేదే. కదా! భయం తాలూకు అనేకానేక సంకేతాల్లో అదొకటి. అలాంటి భయమంటే అసలేమిటో, అదెలా ఉంటుందో ఏమాత్రమూ తెలియని మహిళ ఒకరున్నారు. అందుకు కారణం ఫక్తు వైద్యపరమైనది కావడం విశేషం...!చాలాకాలం కింది సంగతి. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఆమె అలా నడిచి వెళ్తోంది. ఉన్నట్టుండి ఓ సాయుధుడు అటకాయించి ఏకంగా గొంతుపైనే కత్తి పెట్టాడు. కానీ ఆమె కళ్లలో భయం ఛాయలైనా కన్పించలేదు. ‘ఊ, కానీ. ఆలస్యమెందుకు?’అంటూ గొంతు కోయమని ఆహ్వానించింది! దాంతో దొంగ కాస్తా బిత్తరపోయి ఉన్నపళాన కాలికి బుద్ధి చెప్పాల్సి వచి్చంది. మనమైతే దీన్ని సాహసం అంటాం కదా! కానీ సైంటిస్టులు మాత్రం మరేదో అంటున్నారు. ఆ మహిళ తాలూకు ప్రత్యేకతే అందుకు కారణం. ఏమంటే, ఆమె మెదడులో భయాన్ని ప్రాసెస్ చేసి మనసుకు అర్థమయ్యేలా చేసే అమిగ్డాలా అనే వ్యవస్థే పూర్తిగా లోపించింది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా కేవలం కొన్ని వందలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రస్తతమైతే ఇలాంటి లక్షణాలున్న ఏకైక వ్యక్తి భూ మండలం అంతటా ఆమె మాత్రమే కావడం విశేషం. వారిలోనూ ఇలా అమిగ్డాలా లోపించిన కేసు ఇది రెండోది మాత్రమే. అందుకే ఆమె వ్యక్తిగత వివరాలను సైంటిస్టులు అతి గోప్యంగా ఉంచారు. మనిషి భయం, ఆందోళన, అసంకల్పిత ఆత్మరక్షణ ప్రతిచర్య వంటివాటిని ఎలా అనుభూతి చెందుతాడో తెలుసుకునేందుకు ఆమెపై పలు పరిశోధనలు జరుపుతున్నారు. తనను కేవలం ఎస్ఎంగా వ్యవహరిస్తున్నారు. అరుదైన వ్యాధి ఎస్‌ఎంకు అర్బాక్ వీత్ అనే అత్యంత అరుదైన వ్యాధి ఉంది. ఇది తన మెదడులోని అమిగ్డాలాను క్రమంగా మటుమాయం చేస్తూ వచ్చింది. ఇదంతా ఓ పాతికేళ్ల కింది సంగతి. దాంతో ‘ఫియర్లెస్ షీ’గా అప్పట్లో ఆమె ప్రపంచమంతటా ఫేమస్ అయిపోయింది. తనకు నిజంగానే వీసమెత్తు కూడా భయం వేయదా అన్నది తేల్చుకునేందుకు ఎందరో ఎన్నెన్నో రకాల పరీక్షలు పెట్టి చూశారు. అన్నింట్లోనూ విజయం ఆమెదే. పరాజయం... భయానిదీ, పరీక్షకులదీ! ఆమెను దెయ్యల కొంపల్లో ఉంచి తాళం వేశారు. హఠాత్తుగా పాములను మెళ్లో వేశారు. భయంకరమైన హారర్ సినిమాలు ఒంటరిగా కూచోబెట్టి మరీ చూపించారు. ఆమె గత జీవితంలోనే అత్యంత భయానకమని చెప్పదగ్గ ఉదంతాలను పదేపదే పనిగట్టుకుని గుర్తు చేశారు. ఎన్ని చేసినా ఆమెకు భయమన్నదే కలగలేదు. సరికదా, అన్ని సందర్భాల్లోనూ ఎస్ఎం అత్యంత ఆసక్తిగా, ఉత్సాహంగా కన్పించి పరీక్షకులకే పరీక్ష పెట్టింది! పుట్టి బుద్ధెరిగిన నాటినుంచీ అసలు భయమంటే ఎలా ఉంటుందో కూడా ఎరగదట తను. 2009–11 మధ్య ఆమెపై పలుమార్లు ప్రాణాంతక దాడులు జరిగాయి. దోపిడీ యత్నాలకూ గురైంది. బెదిరింపులకైతే లెక్కే లేదు! కానీ ఒక్కటంటే ఒక్క ఉదంతంలో కూడా ఆమెలో భయం అణుమాత్రమైనా కన్పించలేదట. ఆమె భయపడ్డ క్షణం... ఇక ఇలా కాదని సైంటిస్టులు ఎస్‌ఎంను ఓ చిత్రమైన పరీక్షకు గురిచేసి చూశారు. తనతో పాటు తన మాదిరిగానే అమిగ్డాలా కాస్తో కూస్తో పాడైన మరో ఇద్దరిని ప్రయోగశాలలో కూచోబెట్టారు. 35 శాతం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) పీల్చేలా చేశారు. నియంత్రిత పద్ధతిలో చేయగలిగితే దీనివల్ల అవతలి వ్యక్తి ఊపిరాడని పరిస్థితికి లోనవుతాడు. అలా సీఓటూ పీల్చగానే జరిగింది చూసి సైంటిస్టులే అవాక్కయ్యారు. జీవితంలోనే తొలిసారిగా ఎస్ఎం ‘పానిక్’అయింది. అంటే, భయపడిందన్నమాట! సీఓటూ మాస్క్‌ను ముఖంపై నుంచి ఒక్కసారిగా పీకిపారేసింది. శ్వాస కోసం పెనుగులాడింది. ఇప్పటికి గుర్తు చేసినా సరే, ‘అదో భయానక అనుభూతి’అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మిగతా ఇద్దరు రోగులు కూడా ఎస్ఎం మాదిరిగానే బెదిరిపోయారు.కీలక స్పష్టత ఎస్ఎం బృందంపై చేసిన పరీక్ష ఫలితాన్ని బట్టి సైంటిస్టులు ఒక కీలక స్పష్టతకు వచ్చారు. బయటి ప్రమాదాలను గుర్తించి శరీరానికి, మనసుకు అర్థమయేలా చేసేందుకు అమిగ్డాలా అవసరం. కానీ శరీరం లోపలి నుంచే పుట్టుకొచ్చే భయం మాత్రం దానితో నిమిత్తం లేకుండానే వణుకు పుట్టించేస్తుంది! అంతేకాదు, ‘‘భయానికి మెదడులో మూలం అమిగ్డాలా ఒక్కటే కాదు. అందుకు పలు దారులున్నాయి. అసలు భయం బలహీనత కానే కాదు. మనుగడకు అవసరమైన అత్యంత కీలకమైన సాధనం. ఎందుకంటే భయం ఏ కోశానా లేకపోబట్టే అర్ధరాత్రి, అపరాత్రి అనే లేకుండా ఎస్ఎం ఎటు పడితే అటు తిరిగి ప్రమాదాలను కొనితెచ్చుకుంది. భయముంటే ఇలాంటి పనులు ఎన్నటికీ చేయరు. అంతేకాదు, భయం లేకపోతే ఒంట్లో రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. కొసమెరుపుఅయితే, అమిగ్డాలాతో నిమిత్తం లేకుండా ఒంటికి, మనసుకు భయాన్ని అనుభూతం చేసే అంతర్గత సర్క్యూట్లు ఏమిటి, అవెలా పని చేస్తాయి అన్నది మాత్రం సైంటిస్టులకు ఇంకా అంతు చిక్కాల్సే ఉంది! -
రఫ్ఫాడించి...జుట్టుపట్టి ఈడ్చుకెళ్లింది...
ముంబై: తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ తాగుబోతును జుట్టుపట్టి లాక్కెళ్లి మరీ పోలీస్ స్టేషన్లో అప్పగించిందో యువతి. చుట్టూ ఉన్న జనం గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డా... ఆ తాగుబోతును ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఇది అర్థరాత్రో, అపరాత్రో జరగలేదు... పట్టపగలు...జరిగింది. బుధవారం మధ్నాహ్నం కాండివ్లి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని బోర్విలికి చెందిన మంధరే విలే పార్లే లోని కాలేజీలో మాస్ మీడియా మూడవ సంవత్సరం చదువుతోంది. కాలేజీ నుంచి తిరిగి వస్తూ లోకల్ ట్రైన్ కోసం స్టేషన్లో ఎదురు చూస్తుండగా...ఎక్కడినుంచో వచ్చాడో ఒక తాగుబోతు ఆమె మీద చేయివేశాడు. భయంతో పక్కకు జరిగింది. దీంతో మరింత ముందుకు వచ్చాడా దుండగుడు. షాక్ నుంచి తేరుకున్న ఆమె వెంటనే తన దగ్గరున్న కాలేజీ బ్యాగ్‌తో అతగాడిని నాలుగు ఉతుకులు ఉతికింది. అయినా గురువుగారు దారికి రాలేదు. పైగా ఎదురు దాడికి దిగాడు. అంతే మంధరే కోపం కట్టలు తెంచుకుంది. జుట్టు దొరక బుచ్చుకొని గవర్నమెంటు రైల్వే పోలీస్ స్టేషన్ దాకా ఈడ్చుకొచ్చి పోలీసులుకు అప్పగించేదాకా ఆ కోపం చల్లార లేదు. ఇంత జరుగుతున్నా చుట్టపక్కల ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప, ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయినా ఆమె ఒంటరిగానే పోరాడింది. రకరకాల ప్రశ్నలతో విసిగించిన రైల్వే పోలీసు అధికారులు చివరికి మంధరే ఫిర్యాదు స్వీకరించి, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాడు తాగి మత్తులో ఊగుతున్నాడు... పైగా కనీసం తాకడానికి భయపడేంత మురికి కంపు కొడుతున్నాడు.. నామీద దాడి చేస్తాడేమోనని భయం వేసింది కాసేపు. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నాను.. అంటూ చెప్పుకొచ్చింది మంధరే. ప్రతి అమ్మాయి ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండకూడదు.. ధైర్యంగా ఎదుర్కోవాలి..కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంటూ సందేశమిచ్చిందీ ఈ ధీశాలి.


