breaking news
Fast and the Furious
-
'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10' మరింత ఆలస్యం.. వచ్చేది ఇక అప్పుడే
Fast And Furious 10 Movie Release Date Postponed: ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో 'జేమ్స్ బాండ్' సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. తర్వాత అంతటి ప్రేక్షాధరణ పొందిన యాక్షన్ చిత్రం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీ. ఇందులో రేసింగ్, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు 9 సినిమాలు వచ్చి యాక్షన్ ప్రేమికులను అలరించాయి. అయితే ఇప్పుడు ఈ యాక్షన్ చిత్రాల్లోని 10వ భాగాన్ని చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ 10వ చిత్రం విడుదలను ముందుకు నెట్టారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 7, 2023కి బదులు మే 19, 2023న విడుదల కానుందని సమాచారం. అయితే ఈ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10' చిత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ 2న రిలీజ్ కావాల్సింది. కరోనా మహమ్మారి కారణంగా 'ఎఫ్9' (ఫ్రాంచైజీలో 9వ చిత్రం) విడుదల ఆలస్యమైంది. అది కాస్త జూన్ 25, 2021న విడుదలైంది. దీంతో ఈ పదో చిత్రం విడుదలకు మరింత ఆలస్యమేర్పడింది. ఈ ఫ్రాంచైజీ చిత్రాల్లో విన్ డీజిల్, టైరీస్ గిబ్సన్, సంగ్ కాంగ్, క్రిస్ బ్రిడ్జెస్, జోర్డానా బ్రూస్టర్, మైఖెల్ రోడ్రిగ్జ్ నటించారు. ఈ ఫ్రాంచైజీకి డ్వేన్ జాన్సన్ ఇప్పటికే వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' చిత్రంలోని జాన్ సెనా పాత్న జాకోబ్ టోరెట్టోగా డ్వేన్ జాన్సన్ మళ్లీ రీఎంట్రీ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫ్రాంచైజీలో చివరి రెండో చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు క్రిస్ మోర్గాన్ కథ అందించగా, జస్టిన్ లిన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరిస్‌లో 10, 11 చిత్రాల తర్వాత ఈ ఫ్రాంఛైజీకి ముగింపు పలకబోతున్నట్లు హీరో విన్ డీజిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. -
‘రాక్’ ఈజ్ రాకింగ్!
రయ్.... మంటూ ఓ బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌లోకి దూసుకెళ్లిపోయే స్పోర్ట్స్ కార్లు... రోమాలు నిక్కబొడుచుకునే పోరాట సన్నివేశాలు... ఇవన్నీ హాలీవుడ్ సూపర్‌హిట్ సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లో ఉండే హైలైట్ సీన్స్. గత ఏడాది ఈ సిరీస్‌లోని ఏడో భాగం కలెక్షన్ల సునామీ సృష్టించడంతో తదుపరి సీక్వెల్ ‘ఫాస్ట్ 8’పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న డ్వేన్ జాన్సన్, విన్ డీజిల్ గెటప్స్ ఎలా ఉంటాయా? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. ఈ చిత్రంలోని ఏజెంట్ హాబ్స్ పాత్రధారి డ్వేన్ జాన్సన్ లుక్ ఒకటి బయటికొచ్చింది. ‘‘ఏజెంట్ హాబ్స్ పాత్రకు కొత్త వెర్షన్ ఇది. ఫ్యాన్స్‌కు ఈ లుక్ నచ్చేయడం గ్యారెంటీ’’ అని సోషల్ మీడియాలో డ్వేన్ జాన్సన్ పేర్కొన్నారు. ఆయన అనుకున్నట్లుగానే ఈ లుక్ చూసినవాళ్లు ‘రాక్ (డ్వేన్ జాన్సన్‌కు మరో పేరు) ఈజ్ రాకింగ్’ అంటున్నారు. ఎఫ్. గ్యారీ గ్రే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటి చార్లెస్ థెరాన్ కూడా ఎంటరయ్యారు. భారీ స్టార్ కాస్టింగ్.... హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం చూడాలంటే వచ్చే సమ్మర్ వరకూ ఆగాల్సిందే.