breaking news
fanancialtroubles
-
కూతురిని చంపి.. తల్లి ఆత్మహత్య
కొత్తకోట రూరల్: బ్రెయిన్ స్ట్రోక్‌తో భర్త మరణం.. చుట్టిముట్టిన ఆర్థిక ఇబ్బందులు.. వెరసి ఓ తల్లి తన కూతురికి కూల్‌డ్రింక్‌లో విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన మండలంలోని పాలెంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆత్మకూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ, సవరయ్య దంపతుల కూతురు నిర్మల(30)ని పాలెం గ్రామానికి చెందిన నర్సింహకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కూతురు సింధూ(8) ఉంది. అయితే, రెండేళ్ల కిందట భర్త నర్సింహ బ్రేన్ స్ట్రోక్‌తో చనిపోయాడు. అప్పటి నుంచి నిర్మల, ఆమె కూతురు ఇద్దరూ తల్లిగారి ఊరు ఆరేపల్లిలో ఉంటున్నారు. అయితే, ఉగాది పండుగ కావడంతో అత్తగారి ఊరైన పాలెంకు వచ్చారు. కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపి.. ఏమైందో తెలియదు కానీ, ఆదివారం రాత్రి పురుగుల మందును కూల్‌డ్రింక్‌లో కలిపి మొదట కూతురు సింధూకు ఇచ్చి, అనంతరం తల్లి నిర్మల తాగి ఇంట్లోనే నిద్రించారు. రాత్రి 10గంటల సమయంలో కూతురు సింధూ కడుపునొప్పిగా ఉందని చెప్పగా.. ఏంకాదులే ఉదయం ఆస్పత్రికి వెళ్దామని చెప్పి తల్లి నిద్రపుచ్చింది. అనంతరం గాడనిద్రలో ఉన్న పాప మృతిచెందిందో లేదోనన్న అనుమానంతో తల్లి కత్తితో రెండు సార్లు పొడిచినట్లు గాట్లు కూడా ఉన్నాయి. తెల్లవారుజామున 4గంటల సమయంలో నిర్మల అత్త సవరమ్మ లేచి చూసేసరికి మంచంపై సింధూ ఒక్కతే కనపడడంతో నిర్మల ఎక్కడ ఉందోనని బయటికి వచ్చి చూసింది. అప్పటికే నిర్మల అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. గ్రామస్తులు మొదట నిర్మలను ఆటోలో ఎక్కించుకుంటుండగా.. నిద్రలో ఉన్న సింధూ లేస్తే తల్లికోసం ఏడుస్తదేమోనన్న ఉద్దేశంతో తనను లేపేందుకు వెళ్లి చూడగా సింధూ అప్పటికే మృతిచెంది ఉంది. వెంటనే తల్లి కూతుళ్లను ఆటోలో వనపర్తి ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లి నిర్మల కూడా మార్గమధ్యంలోనే మృతిచెందిందని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్ఐ రవికాంత్‌రావు గ్రామస్తులతో ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. ఇదిలాఉండగా, భర్త చనిపోయాక నిర్మలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండేవని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్రావు తెలిపారు. -
కోట్లలో అప్పులు
అనకాపల్లి:తుమ్మపాల చక్కెర కర్మాగారంలో అప్పుల గోల, బ్యాంకు డిపాజిట్ల యుద్ధం తారాస్థాయికి చేరింది. 1957లో సహకార రంగంలోకి వచ్చిన తుమ్మపాల చక్కెర కర్మాగారంలో గత సీజన్లో గానుగాటను నిలిపివేయడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికీ అధికారపార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తామని «ఢాంబికాలు పలికి తాజాగా కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. 2011–12 ఆర్థిక సంవత్సరం వరకు జరిగిన ఆడిట్ నివేదికలో 49.50 కోట్ల నష్టం కర్మాగారానికి ఏర్పడిందని తేలింది. తదుపరి నాలుగు ఆర్థిక సంవత్సరాల నష్టాన్ని లెక్కిస్తే కర్మాగారం ఇపుడు 60 కోట్లపైబడి నష్టంలో కొనసాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో కర్మాగారాన్ని ఆధునీకరిస్తే కనీసం 185 కోట్ల నిధులు అవసరమని తేలుస్తున్నారు. అదే సమయంలో కర్మాగారానికి వున్న అన్ని రకాల ఆస్తులను లెక్కిస్తే 100 కోట్లుపైబడి తేలుతోంది. ఇలా ఎటు చూసినా ఆర్థిక నష్టాలు, అవసరాలు కోట్లను దాటితే ఇప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పైసా కూడా విదల్చలేని దుస్థితిలో ఉంది. ఇంకా అందని బకాయిలు... తుమ్మపాల చక్కెర కర్మాగారానికి 2014–15 సీజన్లో చెరకును తరలించిన రైతులకు ఇంకా కోటి 98 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కర్మాగారంలో వున్న 31 మంది రెగ్యులర్ ఉద్యోగులతోపాటు సీజన్లో పని చేసే ఎన్ఎంఆర్ ఉద్యోగులకు 3.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు రిటైర్ అయిన 160 మంది కార్మికుల గ్రాడ్యూటీ 2010 మార్చి వరకు రెండుకోట్లు చెల్లించాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుల పీఎఫ్, దానిపై పెనాల్టీ కలిపి 2.50 కోట్లు బకాయి ఉంది. ఈ క్రమంలోనే కర్మాగారానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను పీఎఫ్ అధికారులు సీజ్ చేశారు. కోటక్ మహేంద్రలో వున్న 4.50 లక్షలు, అనకాపల్లి డీïసీసీబీ బ్రాంచ్‌లో వున్న 30 వేల రూపాయలు సీజ్ చేయగా ఐసీఐసీఐ బ్యాంకులో వున్న 12 లక్షల రూపాయలను ఇటీవల కర్మాగార అధికారులు విత్‌డ్రా చేసి కర్మాగార అవసరాల కోసం దాచారు. ఇది తెలుసుకున్న పీఎఫ్ టాస్క్‌ఫోర్స్ అధికారి సదరు నిధులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా కొద్దిపాటి యుద్ద వాతావరణ ఏర్పడింది. ఈక్రమంలో రాజకీయ నాయకుల జోక్యంతో 12 లక్షలను కర్మాగారంలో ఉంచినప్పటికీ ఏ సమయంలోనైనా వాటిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. అప్పుల కుప్ప... ఇప్పటికే కార్మికులకు సంబంధించిన బకాయిలు, రైతుల బకాయిలు, పీఎఫ్, గ్రాడ్యూటీతోపాటు ఆప్కాబ్‌కు కర్మాగారం ఏడున్నర కోట్లు అప్పు ఉంది. డీసీసీబీ బ్రాంచ్‌కు రెండు కోట్లు, ఐవోసీకి 54లక్షలు, మెటిరీయల్ సప్లయ్ చేసిన సంస్థలకు కోటి 80 లక్షలు, ఇంద్రాణీ ట్రేడింగ్ ద్వారా తెచ్చుకున్న బాయిలర్ ట్యూబ్‌కు 24 లక్షలు, ట్రాన్స్‌పోర్టు సబ్సిడీ 25 లక్షలు ఇలా లక్షలు, కోట్లలో కర్మాగారంలో ఆర్థికంగా చితికిపోయి ఉంది. ఆగస్ట్ మూడోవారం రైతులకు నేరుగా చెల్లింపులు... ప్రస్తుతం కర్మాగారం పరిధిలో ఆర్థిక వివాదాలు, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ప్రభుత్వం నుంచి కర్మాగారానికి ఆర్థిక ఆసరా లభించే అవకాశంలేదు. ఈ క్రమంలో రైతులకు చెల్లించాల్సిన కోటి 98 లక్షలను ఆప్కాబ్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనికిగానూ కర్మాగారానికి ఎటువంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించి డ్రాప్ట్ జీవో రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో ఆగస్ట్ మూడోవారంలో రైతుల ఖాతాలోకి నేరుగా పాతబకాయిలను చెల్లించేందుకు రంగం సిద్ధమైంది.