పెళ్లి పీటలు ఎక్కుతున్న మరో హీరోయిన్
మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. హీరోయిన్ గజాలా తన స్నేహితుడు ఫైజల్ రజా ఖాన్ ను ఈనెల 24న(బుధవారం) పెళ్లాడబోతోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ గా పేరుగాంచిన ఫైజల్ పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. నిరాడంబరంగా తమ వివాహం జరగనుందని ఫైజల్ తెలిపాడు. ఫొటోగ్రాఫర్ గా తాను నిలదొక్కుకోవడానికి గజాలా ఎంతో సహకరించిందని చెప్పాడు. తనను ఎంతగానో ప్రేమిస్తుందని వెల్లడించాడు. లోనావాలాలో 2012లో ఫ్రెండ్స్ పార్టీలో కలుసుకున్న వీరిద్దరూ తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నామని ఫైజల్ తెలిపాడు.
2001లో 'నాలో ఉన్న ప్రేమ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గజాలా తర్వాత తమిళం, మలయాళం చిత్రాల్లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన 'స్టూడెంట్ నంబర్ 1'లో నటించి తొలి విజయాన్ని అందుకుంది. కలుసుకోవాలని, అదృష్టం, అల్లరి రాముడు, తొట్టి గ్యాంగ్, పూల్స్, విజయం, జానకీ వెడ్స్ శ్రీరామ్, శ్రావణమాసం, నువ్వేంటే నాకిష్టం, భద్రాద్రి, రాంబాబు గాడి పెళ్లాం తదితర సినిమాల్లో నటించింది. 2011లో 'మనీ మనీ మోర్ మనీ' సినిమాలో ఆమె చివరిసారిగా కనిపించింది.