చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనం
సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే బత్తిని కుటుంబం ఆనవాయితీగా నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీకి ఈసారి కూడా భారీ స్పందన లభిస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు జనం పోటెత్తారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఆస్తమా రోగులు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో క్యూ కట్టారు. చేప ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి.నిన్న (సోమవారం) రాత్రి 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా చేప ప్రసాదం అందిస్తున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. చివరి గంటల్లోనూ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఉచితంగా ఆహారం, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. వీఐపీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.3 లక్షల చేప పిల్లలకు మించి..చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ (ఫిషరీస్ డిపార్ట్మెంట్) ఇప్పటికే సుమారు 3 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని చేప పిల్లలను సమకూర్చేందుకు కూడా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నిర్వాహకుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు సుమారు 50 వేల మందికి చేప ప్రసాదం పంపిణీ పూర్తైంది.చేప ప్రసాదం ప్రత్యేకత ఇదేమృగశిర కార్తె రోజున బత్తిని కుటుంబం ప్రత్యేకంగా తయారు చేసే ఔషధ మిశ్రమాన్ని చిన్న చేప నోట్లో ఉంచి రోగులకు అందిస్తారు. దీనిని ప్రజల్లో "చేప ప్రసాదం"గా పిలుస్తారు. ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని స్వీకరిస్తే ఉపశమనం లభిస్తుందని నమ్మకం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం కారణంగా దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు వస్తుంటారు.చేప ప్రసాదం ప్రభావంపై శాస్త్రీయంగా స్పష్టమైన ఆధారాలు లేవని వైద్య నిపుణులు చెబుతుంటే.. మరోవైపు దీనివల్ల తమ ఆరోగ్యం మెరుగుపడిందని వేలాది మంది రోగులు విశ్వసిస్తున్నారు. ఈ కారణంగానే ప్రతి ఏడాది భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.