breaking news
evenings
-
ఇకపై రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం
న్యూఢిల్లీ: సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో సాయంత్రం తర్వాత కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ సోమవారం ట్విట్టర్లో ప్రకటించారు. ‘బ్రిటిష్ కాలం నుంచి ఉన్న విధానానికి ఇప్పుడు తెరపడింది. పోస్టుమార్టం ఇకపై 24 గంటల పాటు నిర్వహించవచ్చు. గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా.. సరైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో రాత్రి వేళ కూడా పోస్టుమార్టం చేసుకునేందుకు ఆరోగ్య శాఖ అనుమతిచ్చింది’అని ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి రానుందని పేర్కొంది. అయితే హత్య, ఆత్మహత్య, అత్యాచారం, కుళ్లిపోయిన మృతదేహాలు, అనుమానాస్పద మృతి వంటి కేసుల్లో మాత్రం అనుమతివ్వలేదు. ఈ నిర్ణయంతో మరణించిన వారి కుటుంబసభ్యులు, స్నేహితులకు మేలు కలుగుతుందన్నారు. అలాగే అవయవదానం చేయాలనుకునే వారి నుంచి అవయవాలు తీసుకునే వీలు కలుగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో నిర్వహించే పోస్టుమార్టం ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని, దీంతో ఎలాంటి అనుమానాలు ఉన్నా భవిష్యత్తులో నివృత్తి చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. -
సంధ్యా వేళ.. విహంగాల హేల
ఆత్మకూరురూరల్ : సాయం సంధ్యా వేళ పచ్చటి పొలాలపై విహంగాల విహారం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసింది. వేసవి తాపంతో పలు రకాల పక్షిజాతులు మధ్యాహ్నం వేళ నీడపట్టున తలదాచుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆహార అన్వేషణ చేస్తూ విహరిస్తున్నాయి. మండలంలోని కరటంపాడులో పచ్చని పంట పొలాలపై ఆదివారం సూర్యాస్తమయ వేళలో పలు రకాల విహంగాలు, గుంపులు, గుంపులుగా విహారం చేస్తూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి. -
మా మంచి చెత్తబుట్ట
తపాలా వేసవి సెలవలు వచ్చాయంటే మేము, మా పిల్లలు ఇష్టపడే ఊరు మా రెండో అక్కగారి ఊరు. మిగిలిన అక్క, వాళ్ల పిల్లలతో, మా అన్నలు, వారి పిల్లలతో సహా దాదాపు పదిహేను మంది దాకా అందరమూ అక్కడ కలుస్తాం. వారిది పెద్ద భవంతి. పదిహేను సెంట్ల ఖాళీ స్థలం. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. రంగురంగుల పూల మొక్కలు, లాన్, ఊగే ఉయ్యాల, జారే నిచ్చెనలు, విశాలమైన ఆట స్థలాలు అబ్బురపరిచేలా ఉంటుంది. ఆ ఇంట్లో తిరగడానికి ఓపిక ఉండాలే తప్ప, కాళ్ల నొప్పులు సాయంకాలానికి ఖాయం. సాయంకాలం పూలమొక్కల మధ్య స్నాక్స్, రాత్రిళ్లు చెట్ల కింద టేబుళ్ల మీద రుచికరమైన భోజనాలు పిల్లల ఆటపాటలతో, రాత్రేదో పగలేదో అనేట్టు అంతా గడుపుతున్నాం. వారం రోజులు గడిచాయి. ఒకరోజు ముప్పైవేల రూపాయల విలువ గల అక్క సెల్ కనిపించకుండా పోయింది. తలా ఒకవైపు వెతికేవాళ్లు, ఆలోచించేవాళ్లు. పెద్ద సెన్సేషన్ అయింది. ఇంట్లో పరాయివాళ్లు ఇద్దరే. వాచ్మెన్, పనావిడ. వాచ్మెన్ డ్యూటీ అంతా బయట కాంపౌండ్లోనే ముగించుకొని, పొద్దున్నే ఇంటికి వెళ్తాడు. పనావిడ తన పని ముగించుకుని, ఇచ్చిన పదార్థాలు తీసుకొని, బుట్టలో పెట్టుకువెళ్లటం ఆమె నిత్య కృత్యం. వెళ్తూ తన చీరను విదిలించి నిజాయితీని రుజువు చేసుకునేది. మా రెండో అబ్బాయి రాఘవతేజకు పదేళ్లు. ఏదైనా విషయాన్ని ఆలోచిస్తున్నాడంటే ఎడమ కన్ను సన్నగా చేస్తాడు. ‘‘ఏంరా! ఏదో ఆలోచిస్తున్నావే?’’ అన్నాను. ‘‘ఇప్పుడే వస్తా’’నని చేతిలో ఉన్న బ్యాట్‌తో సహా బయటికి పరుగు తీశాడు. పది నిమిషాల తర్వాత, సెల్ భద్రంగా చుట్టిన కవరుతో వచ్చి, ‘‘దీన్ని దాచండి. తర్వాత విషయం చెబుతా’’ అని సైగ చేశాడు. బీబీ పని ముగించుకుని, ‘‘వెళ్లొస్తా’’నని, దూరంగా ఉన్న పెద్ద గుంత దగ్గర తారాడుతూ ఉంది. వీడు నక్కలా వెళ్లి, ‘‘ఏంటి బీబక్కా వెతుకుతున్నావు?’’ అన్నాడు. ‘‘చిల్లర పడిపోయింది బాబూ’’ అంటూ గాబరాగా ఇంటిదారి మళ్లింది. ‘‘ఎలా కనుక్కున్నావురా?’’ అని ప్రశ్నలు కురిపించారు అందరూ. అంతా హాలులో సమావేశమయ్యాం. వాడు చెప్పే విషయాలు యాక్షన్‌తో సహా ఉంటాయి. బయట క్రికెట్ ఆడుతూ ఉండగా, బంతి గోతి దగ్గర పడింది. ఆమె ఇంట్లో నుండి తెచ్చిన చెత్తను గుంతలో సర్దుతూ కనిపించింది. ‘‘ఈ చెత్త దిబ్బ దగ్గర ఆడవద్దు, దూరంగా వెళ్లి ఆడుకోండి’’ అంటూ గదమాయించింది. ఆటలో వాళ్లకేం తెలీలేదు. తర్వాత సెల్ సంఘటన గుర్తుకు రావటం, దర్యాప్తు ముగించటం జరిగింది. ఆమెను వద్దంటే పనికి కష్టమని భావించి, జాగ్రత్తగా ఉండి, గమనించడమే ప్రస్తుత కర్తవ్యం అని మిన్నకుండిపోయాం. బహుమానంగా అన్నయ్య వాడికి రెండు వేలు ఇచ్చి, ‘‘మంచి డ్రెస్ తీసుకోరా’’ అన్నాడు. ‘‘మిగిలిన ఇరవై ఎనిమిది వేలు ఎప్పుడిస్తావ్?’’ అన్నాడు వాడు. అంతా గొల్లున నవ్వాం. - బి.పరిమళ, కడప