breaking news
ESI Dispensary
-
రోగుల అందం.. అదిరిందయ్యా చంద్రం!
సాక్షి, అమరావతి: ఆసుపత్రిలో చేరిన కార్మికులకు నాలుగు మందు బిళ్లలివ్వండి మహాప్రభో అని మొత్తుకుంటే.. నిర్దాక్షిణ్యంగా నిధుల్లేవని చెప్పిన గత పాలకులు తైల సంస్కారం పేరుతో కోట్ల రూపాయలు నొక్కేసిన వైనం నివ్వెరపరుస్తోంది. జబ్బు చేస్తే మందులు కొనడానికి డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్న కార్మికులను కనీసం పట్టించుకోకుండా వారి జుట్టుకు, ఒంటికి నూనె రాయాలని కోట్లకు కోట్లు వెచ్చించి రకరకాల నూనెలు కాగితాలపై మాత్రమే కొనుగోలు చేసి, సరికొత్త కుంభకోణానికి పాల్పడటం వారికే చెల్లింది. ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో స్పెషాలిటీ వైద్యం లేక కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని బిలులు పెడితే ఏళ్లతరబడి చెల్లించకుండా, వచ్చిన నిధులను ఇలా దిగమింగిన ఘటన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికతో బట్టబయలైంది. రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఈఎస్ఐ అవినీతి అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. జుట్టు నూనెలకు రూ. 54 కోట్లు పైనే .. ‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’అన్నట్లు ఓవైపు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందులు లేకపోయినా మరోవైపు రకరకాల క్రీములు, నూనెల పేరిట నాలుగేళ్లలో రూ.54 కోట్ల విలువైనవి కొన్నారు. హెయిర్ సొల్యూషన్, స్కిన్ క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్, టూత్ పేస్ట్‌లు ఇలా ఒకటేమిటి రకరకాల తైలాలు, క్రీముల పేరిట కోట్లాది రూపాయలు వ్యయం చేశారు. పోనీ ఆ నూనెలు, క్రీములు వాడారా అంటే అదీ లేదు. ఏ ఆస్పత్రి నుంచి కూడా తమకు నూనెలు, క్రీములు కావాలని ఒక్క చిన్న లెటర్ కూడా లేదు. ఈఎస్ఐ కార్యాలయం నుంచే ఇండెంట్లు సృష్టించి తమకు కావాల్సిన కంపెనీకి ఆర్డరు ఇచ్చారు. ఒక్క జుట్టుకు రాసుకునే నూనెకు రూ.42 కోట్లు చెల్లించినట్టు తేలింది. టూత్‌పేస్ట్‌కు రూ.2 కోట్లు, షాంపూలకు రూ.2.5 కోట్లు చెల్లించారు. ఒంటికి రాసుకునే క్రీములకు రూ.8 కోట్లు పైనే వ్యయం చేశారు. ఓవైపు క్యాన్సర్, కిడ్నీ జబ్బులకు మందులు లేవంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కమీషన్ల కోసం అమాత్యుల నుంచి అధికారుల వరకు అందరూ ఈ అవినీతి సొమ్ముకు ఎగబడినట్టు విజిలెన్స్ నివేదిక బట్టబయలు చేసింది. ఇలా ఇండెంట్లు పెట్టిన అధికారుల్లో డా.చంద్రశేఖర్, డా.జగదీప్గాంధీలు ప్రధానంగా ఉన్నారు. వీరిద్దరూ లెజెండ్, ఓమినిమెడి కంపెనీలకు ఈ ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. మందులు మురిగిపోతున్నా .. ఓవైపు మందులు మురిగిపోయాతున్నా, మరోవైపు కమీషన్ల కోసం మందులకు ఆర్డర్లే ఆర్డర్లు. ఒక్క కడప రీజియన్‌లోనే రూ.15 కోట్ల విలువైన మందులు మురిగిపోయాయి. ఆయా ఆస్పత్రుల నుంచి పదే పదే మందులు మాకొద్దు అన్నా కూడా ఈఎస్ఐ కార్యాలయంలో పనిచేస్తున్న సంయుక్త సంచాలకులు కమీషన్ల కోసం ఆర్డర్లు పెట్టారు. 2019 అక్టోబర్ 1న కడప జేడీగా పనిచేస్తున్న డా.రవికుమార్ మందులు మురిగిపోతున్నాయని, వీటిని ఇతర ఆస్పత్రులకైనా తరలించి వాడుకోవాలని లేఖ రాశారు. ఇలా వరుసపెట్టి నాలుగైదు దఫాలుగా లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇలాంటి లేఖలు పలు జిల్లాల నుంచి వచ్చినా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మందులు సరఫరా చేయడంతో ఇప్పుడా మందులన్నీ మురిగిపోయాయి. ఆ మందుల విలువ కనీసం రూ.40కోట్ల వరకు ఉంటుందని అంచనా. విజయవాడ గుణదలలోని కార్మిక ప్రభుత్వ భీమా వైద్యశాల ఆ రెండు ఏజెన్సీల హవా అధికారులను, కొంతమంది నేతలను అడ్డుపెట్టుకుని ఇప్పటికీ తిరుమల ఏజెన్సీ, సాయి సుదర్శన ఏజెన్సీ ప్రతినిధులు హవా కొనసాగిస్తున్నట్టు తేలింది. తాజాగా ఓడీసీఎస్ (ఒరిస్సా డ్రగ్స్ అండ్ కెమికల్స్) నుంచి కొనుగోలు చేసిన పారాసెటిమాల్ మాత్రలు నాసిరకం అని తేలినా ఇప్పటికీ చర్యలు లేవు. ఈ రెండు ఏజెన్సీలకు సంబంధించిన ప్రతినిధులకు అటు అధికారుల్లో, ఇటు నేతల్లో బాగా లాబీ ఉండటంతో కింది స్థాయి సిబ్బంది భయపడుతున్నారు. అందుకే నాసిరకం అని తేలినా చర్యలకు వెనుకాడుతున్నట్టు తేలింది. ల్యాబ్ కిట్ల పేరుతో భారీ దోపిడీ షుగర్, థైరాయిడ్ పరీక్షలకు వాడే ల్యాబొరేటరీ కిట్ల పేరిట భారీ దోపిడీకి పాల్పడినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీటి సరఫరా బాధ్యత ఓమినీ మెడీ, ఎవెంటార్, లెజెండ్ కంపెనీలకు ఇచ్చారు. వీటి కోసం ఏకంగా రూ.237 కోట్లు ఈ మూడు కంపెనీలకు చెల్లించారు. హద్దూ పద్దూ లేకుండా వీటిని పదిరెట్లు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అంతేకాకుండా కొన్ని వస్తువులు ఆస్పత్రులకు వెళ్లకుండానే బిల్లులు చెల్లించారు. ఎక్స్‌పెయిరీ తేదీ దగ్గరకు వచ్చిన వాటిని సరఫరా చేసినా కూడా కిమ్మనకుండా నిధులు చెల్లించినట్టు తేలింది. రకరకాల ల్యాబ్ కిట్ల వాస్తవ ధర, ఈఎస్ఐ కొనుగోలు చేసిన ధర ఇలా ఉంది. రికార్డులు తారుమారు చేసే అవకాశం ఈఎస్ఐలో జరిగిన అక్రమాల్లో ఎవరైతే అధికారులు బాధ్యులుగా ఉన్నారో వారిని అలాగే కొనసాగిస్తే రికార్డులు తారుమారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రులు, కొంత మంది రాజకీయ నేతలు ఉండటంతో అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారిని తక్షణమే సస్పెండ్ చేస్తేనే రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉండదని, లేదంటే ఇప్పటికే దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈఎస్ఐ కార్యాలయంలో కొంత మంది కింది స్థాయి సిబ్బంది ఇప్పటికే ఇదే పనిలో ఉన్నట్టు సమాచారం. -
ఇఎస్ఐ ఆసుపత్రుల్లో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, కర్నూలు : రాయలసీమ జోన్ జాయింట్ డైరెక్టర్ పరిధిలోని ఇఎస్ఐ ఆసుపత్రుల్లో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని వచ్చిన నివేదిక మేరకు విజిలెన్స్ అధికారులు తగిన చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాలలోని డిస్పెన్సరీల్లో మందులకు సంబంధించిన రికార్డులను శనివారం తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం సాయంత్రానికి పూర్తి నివేదికను ఇవ్వననున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
కార్మికులకు ఆధునిక వైద్యసేవలు
మాచర్ల టౌన్, న్యూస్‌లైన్: ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో ఆధునిక పరికరాలతో కార్మికులకు వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఎస్ఐ విజయవాడ రీజియన్ జాయింట్ డెరైక్టర్ డాక్టర్ జి.రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. విజయవాడ రీజియన్ పరిధిలోని 49 ఈఎస్ఐ డిస్పెన్సరీలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి కార్మికులకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. కార్మికులు ఎక్కువగా ఉన్న దాచేపల్లి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి ప్రాంతాల్లో శాశ్వత డిస్పెన్సరీలు లేకపోవడంతో అక్కడ ప్యానల్ వైద్యులతో సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో రూ.15 వేల లోపు వేతనం పొందే కార్మికులకే ఈఎస్ఐ డిస్పెన్సరీలలో వైద్యం పొందే అవకాశం ఉండగా.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసిందన్నారు. రూ.25 వేల లోపు వేతనం పొందే కార్మికులకు కూడా ఈఎస్ఐ ద్వారా వైద్యం పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న కార్మికులకు ఎక్కడ వైద్యం చేయించుకున్నా రూ.పది లక్షల వరకు మెడికల్ రీయింబర్స్‌మెంటు సౌకర్యం కల్పిస్తామన్నారు. డిస్పెన్సరీ సొంత భవనంపై చర్చ స్థానికంగా అద్దె భవనంలో ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించిన ఆర్జేడీ రవికుమార్ స్థానిక వైద్యుడు కె.రామకోటయ్యతో చర్చించారు. వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత భవనం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి గతంలోనే భూమి కేటాయించాలని అడిగినట్లు చెప్పారు. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చేంతవరకు కేసీపీ కాలనీలో ఓ గృహాన్ని ఆస్పత్రి నిర్వహణకు కేటాయించాలని కోరామన్నారు. సంబంధిత విషయమై కేసీపీ యాజమాన్యంతో చర్చించి సొంత భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈఎస్ఐ పానల్ క్లినిక్‌ను సందర్శించిన ఆర్జేడీ దాచేపల్లి: ఈఎస్ఐ ద్వారా కార్మికులకు కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నామని విజయవాడ ఆర్జేడీ డాక్టర్ జి.రవికుమార్ అన్నారు. నారాయణపురంలోని క్రాంతి నర్సింగ్ హోంలోని ఈఎస్ఐ పానల్ క్లినిక్‌లో అమలవుతున్న వైద్యసేవలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈఎస్ఐ పరిధిలో 1390 మంది కార్మికులు ఉన్నారని, రోజూ 15 నుంచి 20 మంది కార్మికులకు వైద్యం అందిస్తున్నామని డాక్టర్ క్రాంతికుమార్ వివరించారు. ఈఎస్ఐకి సంబంధించిన రికార్డులను పరిశీలించి ఆర్జేడీ సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ రీజియన్ పరిధిలో 3.50 లక్షల మంది కార్మికులు ఈఎస్ఐలో సభ్యత్వం పొందారని, ఒక్కో కుటుంబంలో నలుగురు వంతున సుమారు 12 లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. రీజియన్ పరిధిలోని గుంటూ రు, కృష్ణా, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో రోజుకు 5 వేల మంది ఈఎస్ఐ ద్వారా వైద్యసేవలు పొందుతున్నారని డాక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.