breaking news
Eligible cards
-
ఆ జాబితా పరిగణించం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్లీ పేచీ నెలకొంది. గ్రామీణ ప్రాంత ఇళ్లకోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి, జాబితా సిద్ధం చేసింది. ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని.. తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చిచెప్పింది. దీనితో కంగుతినడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అయింది. అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్‌తో మళ్లీ సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే.. లబ్ధి దారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. అలాంటిది కేంద్రం పెట్టిన మెలికతో గందరగోళం మొదలైంది. కేంద్రం నుంచి అందే నిధుల కోసం.. దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది.ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని, కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచి్చంది. కేంద్రం రూపొందించిన యాప్‌తో మళ్లీ సర్వే.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి.. 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారుకాగా.. మూడున్నర లక్షల మంది సొంత భూమి లేనివారు.రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది. అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణనలోకి తీసుకోబోమని, ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్లీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని.. దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్‌తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.అయినా కేంద్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది. కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నా... కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కేంద్ర నిధులు రాకుంటే పథకం భారమే! పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్‌ను రూ.లక్షన్నరగా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4 శాతాన్ని తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చాలా తక్కువని, సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.కానీ స్పష్టత రావాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ రూ.73 వేలుగా ఉంది. ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మెలిక కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘అర్హత’ ఎంత మందికో?
మళ్లీ రుణం కార్డుల పంపిణీ హడావుడి స్పష్టంగా తేలని కౌలు రౌతుల సంఖ్య క్షేత్రస్థాయిలో పరిశీలనలో లోపాలు ఏటా అన్యాయమైపోతున్న అర్హులు అనకాపల్లి : జిల్లాలో మళ్లీ కౌలు రైతుల మాట వినిపిస్తోంది. వీరికి రుణ అర్హత కార్డులు మంజూరు చేసేందుకు అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించాక అర్హులకు కార్డులు మంజూరు చేస్తారు. చెప్పుకోవడానికి ఇదంతా బాగున్నా వాస్తవంగా కౌలు రైతులకు కార్డులు దక్కుతున్నాయా? అసలు ఎవరు కౌలు రైతు అని నిర్థారించే యంత్రాంగం మనకు ఉందా? అంటే సమాధానం కరువవుతుంది. జిల్లాలో 2.96 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఏటా 2.16 లక్షల హెక్టార్లలో పంటలు వేస్తుంటారు. అది కూడా ఖరీఫ్‌లోనే. రబీలో 40 వేల హెక్టార్లలోపే పంట సాగవుతుంది. భూస్వామ్య, సన్న, చిన్నకారు, కౌలు రైతులు ఆరుగాలం శ్రమిస్తేనే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయంలో కౌలు రైతులు, రైతు కూలీల పాత్ర అత్యంత కీలకం. కూలీలు రోజూ వేతనంపై పనిచేస్తారు కావున వారికి లాభనష్టాలతో పనిలేదు. ఇక మిగిలింది కౌలు రైతులే. వీరి పరిస్థితే దీనాతిదీనం. సెంటు భూమిలేకపోయినా వ్యవసాయమే జీవనాధారం కావడంతో యజమానుల నుంచి భూమి కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు. వీరి సంఖ్యపై సరియైన గణాం కాలు లేవు. అసలు భూ యజమానులెంతంటే కూడా లెక్కల్లేవు. కాకిలెక్కల మేరకు జిల్లాలో లక్ష మంది వ్యవసాయం చేసేవారున్నారని అంచనా. వీరిలో 30 వేల మంది కౌలురైతులంట. కానీ గత ఏడాది 3,143 మందికే రుణ అర్హత కార్డులు పంపిణీ చేశారు. ఈ సంఖ్య వాస్తవమైతే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? కౌలు రైతుకు రుణ అర్హత కార్డు ఇవ్వాలంటే యజమాని అనుమతితోపాటు భూమిపై ఎటువంటి రుణం ఉండకూడదు. రుణమాఫీ వంటి పథకం పొందాలంటే రుణ అర్హత కార్డులోనైనా కౌలు రైతు పేరుండాలి. రుణాలు తీసుకున్న నిజమైన రైతులకే మాఫీపై ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఏ ఆధారంలేని కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? అంటే సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో నిజమైన కౌలు రైతులు ఎంతమందికి కార్డులందుతాయన్నది అనుమానమే. గతంలో తుఫాన్లు, భారీ వర్షాలు సంభవించినప్పుడు పరిహారం పంపిణీలో ఎన్నోలోపాలు వెలుగు చూశాయి. ఎంతోమంది కౌలు రైతులకు న్యాయం జరగలేదు. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయంతో క్షేత్ర స్థాయిలో సాగుచేసే భూయజమానులు, కౌలు రైతులను గుర్తించేందుకు స్పష్టమైన యంత్రాం గం ఉంటేనే ప్రభుత్వ పథకాల వల్ల అర్హులకు న్యాయం జరుగుతుంది. రాజకీయ సిఫారసులు, సిబ్బంది కొరత నేపథ్యంలో కౌలు అధీకృత చట్టం లక్ష్యాలు నెరవేరాలంటే ఎటువంటి ఒత్తిడులకు లొంగని ప్రభుత్వ యంత్రాంగం ఉండాలి. అప్పుడే నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు ఓదార్పు లభిస్తుంది.