breaking news
Dhanurmasa Utsavalu
-
నేటి నుంచి యాదగిరి క్షేత్రంలో ధనుర్మాస వేడుకలు
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలకు సిద్ధమైంది. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథుని కొలుస్తూ నెల రోజులపాటు నిర్వహించే పాశుర పఠనాలను ఆలయ అర్చకులు, పారాయణీకులు ప్రత్యేకంగా జరిపిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కైంకర్యాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర భాగం హాల్లో తిరుప్పావై వేడుకధనుర్మాస ఉత్సవ కార్యక్రమం ఆలయంలో ప్రతిరోజూ వేకువజామున 4.30 గంటల నుంచి 5 గంటల వరకు జరిపిస్తారు. శ్రీస్వామి వారి ఆలయ ముఖ మండపంపై ఉత్తర భాగంలోని హాల్లో గోదాదేవి అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం, మార్గళి నివేదన వంటి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 14వ తేదీ రాత్రి 7గంటలకు ఆలయ ముఖ మండపంలో గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణం, 15న ఉదయం 11.30గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహిస్తారు.కైంకర్యాల్లో మార్పులు..ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఆలయ కైంకర్యాల వేళల్లో అధికారులు మార్పులు చేశారు. మంగళవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు వేకువజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహిస్తారు. అనంతరం తెల్లవారు జామున 4గంటల నుంచి 4.30 వరకు తిరువారాధన, 4.30గంటల నుంచి 5గంటల వరకు తిరుప్పావై సేవాకాలం జరిపిస్తారు. ఉదయం 5గంటల నుంచి 6గంటల వరకు నివేదన, చాత్మర, 6గంటల నుంచి 7గంటల వరకు నిజాభిషేకం, 7గంటల నుంచి 7.45 గంటల వరకు సహస్రనామార్చన వంటి పూజలు ఉంటాయని అధికారులు వివరించారు. ఉదయం 7.45 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. నిత్య కైంకర్యాలు యథావిధిగా ఉండనున్నాయి. -
ధనుర్మాసోత్సవాలు ప్రారంభం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మంగళవారం ధనుర్మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ అర్చకులు తీసుకొచ్చిన బిందెను అంతరాలయంలో ఉంచారు. ఆ తరువాత స్వామి వారి మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు, యాగబేరమూర్తులకు, నిత్య కల్యాణ మూర్తులకు గోదావరి జలాలతో అభిషేకం చేశారు. స్వామి వారి కి నివేదన అనంతరం తిరుప్పావై పాశుర విన్నపం ఆచరించారు. ఉత్సవాల్లో భాగం గా బుధవారం ఆండాళమ్మ వారిని తాతగు డి వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. చిత్తా నక్షత్రం సందర్భంగా యాగశాలలో సుదర్శన హోమం, అష్టోత్తర శతనామార్చన పూజలు జరిపించి మహా పూర్ణాహుతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, స్థానాచార్యులు కెఇస్థల శాయి, వేద పండితులు గుదిమళ్ల మురళీ కృష్ణమాచార్యులు, ఏఈవో శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీఆర్వో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.


