breaking news
DGP Sharma
-
16న పోలీస్ రన్
♦ విజయవంతం చేయాలని డీజీపీ పిలుపు ♦ పీవీ సింధుతో కలసి టీషర్ట్, పతకాల ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ విభాగం ఈ నెల 16న హైదరాబాద్‌లో నిర్వహించనున్న తొలి భారతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ పరుగును విజయవంతం చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలసి గురువారం రన్‌కు సంబంధించిన టీషర్ట్లు, పతకాలను ఆవిష్కరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి కుటుంబాలకు ప్రజలు, ప్రభుత్వం అండగా ఉందని భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పరుగును నిర్వహిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. కేంద్ర పోలీస్ బలగాలు, పారామిలటరీ దళాలు, వివిధ రాష్ట్రాల పోలీసులతో పాటు ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఈ పరుగులో పాల్గొంటారని తెలిపారు. 2 కి.మీ., 5 కి.మీ., 10 కి.మీ విభాగాల్లో ఈ పరుగును నిర్వహిస్తున్నామని చెప్పారు. పరుగులో పాల్గొనాలంటే www.policerun.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. పరుగు నిర్వహించిన రోజునే పీపుల్స్‌ప్లాజాలో పోలీస్ ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీస్ ఆయుధాలు, వాహనాలు గుర్రాలు, జాగిలాలను ప్రదర్శనలో ఉంచు తామన్నారు. పోలీస్ వాహనాలు, గుర్రాలపై స్వారీ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, పోలీస్ ఉన్నతాధికారులు కృష్ణ ప్రసాద్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి జిల్లాలో షీ టీమ్స్ సేవలు
ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా వరంగల్ క్రైం: మహిళలను వేధించే పోకిరీలకు చెక్ పెట్టేందుకు వరంగల్ రూరల్, అర్బన్ పరిధిలో షీ టీమ్స్ గురువారం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో షీ టీమ్‌లు విజయవంతమైన నేపథ్యంలో డీజీపీ అనురాగ్ శర్మ ఈ కార్యక్రమాన్ని అన్నిజిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం నుంచి షీ టీంలు చురుగ్గా పనిచేస్తాయని ఎస్పీ పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి షీ టీమ్స్‌ను మోహరిస్తామని వివరించారు. వేధింపులకు గురయ్యే మహిళలు, విద్యార్థినులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు. వరంగల్ రూరల్, అర్బన్ పరిధిలో చురుకైన అధికారులు, సిబ్బందితో ఒక ఎస్ఐ సారధ్యంలో నాలుగు షీ టీమ్స్ బృందాలు పనిచేస్తాయని వెల్లడించారు. జిల్లా పరిధిలోని మహిళలు, విద్యార్థినుల సేవలు వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.