breaking news
Depti Saran
-
'నన్ను కిడ్నాప్ చేసి, విడిచిపెట్టారు'
న్యూఢిల్లీ: అదృశ్యమైన స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా.. తనను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి, అనంతరం వదిలిపెట్టారని చెప్పింది. ఘజియాబాద్ పోలీసులకు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చింది. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్‌లో దీప్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. 40 గంటల తర్వాత హర్యానాలోని పానిపట్ వద్ద ఆమెను పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి ఘజియాబాద్ నుంచి ఇంటికి ఆటోలో వెళ్తుండగా తనను కిడ్నాప్ చేశారని దీప్తి పోలీసులకు చెప్పింది. తన కళ్లకు గంతలు కట్లి, గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని తెలిపింది. తనను 24 గంటల పాటు బందించారని, అనంతరం శుక్రవారం ఉదయం రైల్వే స్టేషన్ సమీపంలో తనను వదిలివెళ్లారని చెప్పింది. దుండగులు తనకు ఎలాంటి హాని తలపెట్టలేదని, భోజనం కూడా పెట్టారని తెలిపింది. ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. కాగా దుండగులు దీప్తిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సివుంది. దీప్తి కిడ్నాప్ ఉదంతాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సీరియస్‌గా తీసుకుని ఆచూకీ కనుగొనాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. -
దీప్తి దొరికింది
న్యూఢిల్లీ: కనిపించకుండా పోయిన స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా సురక్షితంగా ఉంది. తాను సురక్షితంగానే ఉన్నానని తన కుటుంబానికి ఫోన్ చేసి చెప్పిన ఆమె ఢిల్లీకి చేరుకుని తల్లిదండ్రులను కలిసింది. హర్యానాలోని పానిపట్ వద్ద ఆమెను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో తన విధులను ముగించుకొని తిరిగొస్తున్న క్రమంలో ఘజియాబాద్‌లో ఆటో ఎక్కిన అనంతరం ఆమె ఆచూకీ కనుమరుగైంది. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. స్నాప్ డీల్ సంస్థ కూడా వేగంగా స్పందించి పోలీసులకు సమాచారం అందించింది. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యక్తిగతంగా తీసుకొని పోలీసు ఉన్నతాధికారులకు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు. క్షణక్షణం ఉత్కంఠే దీప్తి సర్నా కనిపించకుండా పోయినప్పటి నుంచి అటు ఆమె కుటుంబంలో స్నాప్ డీల్ సంస్థలో పోలీసుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఆమె సోదరి చెప్పిన వివరాలు పోలీసుల్లో కంగారు పుట్టించాయి. దీప్తి చివరిసారి తన తండ్రితో రాత్రి 8.20గంటల ప్రాంతంలో మాట్లాడిందని, ఆ తర్వాత చివరిసారి ఫోన్ కాల్ బెంగళూరులోని ఆమె స్నేహితుడితో మాట్లాడిందని చెప్పింది. అంతే కాకుండా అతడితో మాట్లాడుతున్న క్రమంలో ఆటో డ్రైవర్ దారి మళ్లిస్తుండగా తన సోదరి అరుస్తుండటం గమనించానని, ఆ తర్వాత కొద్ది సేపటికే ఫోన్ కాల్ కట్ అయిందని వివరించింది. గతంలోని సంఘటనలు దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఆమెను ఆటో డ్రైవర్ ఏదైన చేసి ఉంటారా అనే కంగారుతో అణువణువు శోధించారు. ఆమెతో చివరిసారి కాల్ కట్ అయిన ప్రాంతం రాజనగర్ లోని అటవీ ప్రాంతంలో గాలింపులు జరిపారు. కాగా, ఆ ప్రాంతంలో సిమ్ కార్డును పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించడానికి అవి పనిచేయడం లేదు. దీంతో మరింత టెన్షన్ నెలకొంది. చివరికి ఆమె పానిపట్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చివరకు ఆమె సురక్షితంగా ఢిల్లీకి చేరుకుంది. ఆమెను ఎవరైన కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారా, లేక ఆమె తన స్నేహితుల ఇంటికి వెళ్లిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.