breaking news
DCP v.satyanarayana
-
సినిమాల స్ఫూర్తితో చోరీలు
పోలీసులకు చిక్కిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ చాంద్రాయణగుట్ట: సినిమాల్లో వచ్చే దొంగతనం సన్నివేశాలు చూసి చోరీల బాటపట్టాడో ఎంబీఏ పట్టభద్రుడు. సదరు ప్రబుద్ధుడిని హుస్సేనీఆలం పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శనివారం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట నషీబ్నగర్కు చెందిన మహ్మద్ అవేజ్ అహ్మద్ (34) ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సినిమాల్లో వచ్చే చోరీ సన్నివేశాలు, పత్రికలలో వచ్చే దొంగతనాల వార్తలు చూసి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకున్న తెలివితో పోలీసులు తిరగని బస్తీలలో గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలు చేయసాగాడు. ఈ క్రమంలోనే హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు దొంగతనాలు చేశాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న హుస్సేనీఆలం అదనపు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ సాంకేతిక ఆధారాలతో అవేజ్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 10 తులాల బంగారం, రూ. 12,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా అవేజ్ దొంగతనం చేసే తీరును బట్టి భవిష్యత్‌లో గజదొంగ అయ్యేలా ఉన్నాడని, అలాంటి దొంగను ఆదిలోనే పట్టుకున్నందుకు అదనపు ఇన్స్పెక్టర్కు నగదు రివార్డును అందించనున్నామని డీసీపీ చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కె.బాబురావు, చార్మినార్ ఏసీపీ అశోక చక్రవర్తి, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదనలు పంపామన్నారు. -
పాతబస్తీలో ‘ఆపరేషన్ లేట్‌నైట్’
- 282 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు - తల్లిదండ్రులకు డీసీపీ కౌన్సెలింగ్ చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో ఇటీవల జరిగిన స్ట్రీట్ ఫైట్ ఘటనలో ఓ యువకుడు మృతి చెందడంతో పోలీసులు మేల్కొన్నారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో శుక్రవారం రాత్రి 10 ప్రత్యేక బృందాలు 17 పోలీస్స్టేషన్ల పరిధిలో ‘ఆపరేషన్ లేట్ నైట్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అర్ధరాత్రి రోడ్లపై ఆవారాగా తిరిగే యువకులతో పాటు హుక్కా సెంటర్లు, స్విమ్మింగ్ పూళ్లు, స్మోకింగ్ ఏరియాలు, టిఫిన్ సెంటర్లు, బస్తీ చబుత్రాల్లో మంతనాలు చేస్తున్న 282 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీగలకుంట, తలాబ్‌కట్ట, చాంద్రాయణగుట్ట, బాబానగర్, సంతోష్‌నగర్ బస్తీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పట్టుబడ్డారు. కాగా పట్టుబడిన వారిలో 30 మంది 16-17 ఏళ్ల వయసున్న మైనర్లు కాగా మిగతా వారు 18-25 ఏళ్ల వయసున్న వారు. వారి తల్లిదండ్రులను పిలిపించి దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నెలలోపు పిల్లలు ప్రవర్తన మార్చుకోకపోతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమాజంలో మంచిగా మెలుగుతామని పట్టుబడిన యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. క్రమశిక్షణ అలవర్చేందుకే : డీసీపీ సత్యనారాయణ ఆవారాగా తిరుగుతున్న యువకుల్లోక్రమశిక్షణ అలవర్చేందుకు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశానుసారం ఆపరేషన్ లేట్‌నైట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపంతో స్ట్రీట్ ఫైట్ ఘటన జరిగి నబీల్ అనే విద్యార్థి మృతి చెందాడని అన్నారు. చాంద్రాయణగుట్ట పరిసరాల్లో అర్ధరాత్రి స్విమ్మింగ్ పూళ్ల వద్ద బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. కొందరు యువకులు రౌడీషీటర్లతో కూడా స్నేహాన్ని పెంచుకుంటున్నారని తెలిపారు.