breaking news
Dasara Bullodu
-
ట్రెండ్ సెట్ చేసిన ‘బుల్లోడు’..ఆల్‌టైమ్ రికార్డు
‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని–హీరోయిన్ వాణిశ్రీ. 1971 జనవరి 13న రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. వాస్తవానికి ఈ సినిమా కోసం హీరోయిన్గా తొలుత అనుకున్నది జయలలితను. ఈమెతో నిర్మాతల సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ‘దసరా బుల్లోడు’లో నటించడానికి జయలలిత గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే అదే సమయంలో ఆమె ఎన్టీఆర్‌తో ‘శ్రీకృష్ణ విజయము’, ఎమ్జీఆర్తో మరో సినిమాలో నటిస్తున్నారు. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చివరి నిమిషంలో ఏఎన్నార్ ‘దసరా బుల్లోడు’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం అందించారు. కేవలం వారం రోజుల ముందు ఈ విషయం తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్గా అనుకున్నారట.ఏఎన్నార్ కంటే వాణిశ్రీకి డబుల్ రెమ్యునరేషన్ ఈ సినిమాకు అక్కినేని పారితోషికం పాతిక వేలైతే వాణిశ్రీకి యాభై వేలు చెల్లించాల్సి వచ్చిందట. అప్పటికి వాణిశ్రీకి పెద్ద హీరోయిన్గా గుర్తింపు కూడా లేదు. అయినా అంత మొత్తం చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అయితే... ‘దసరా బుల్లోడు’ హిట్‌తో వాణిశ్రీ కూడా స్టార్ హీరోయిన్గా మారి పోయారు. ఆ తర్వాత ‘ప్రేమ్‌నగర్’ లాంటి ఆల్‌టైమ్ బెస్ట్ రావడానికి దసరాబుల్లోడే పునాది వేసింది. దీంతో అక్కినేని–వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే పేరొచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో 20కి పైగా సినిమాలొచ్చాయంటే‘దసరాబుల్లోడు’ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.12 రోజుల రీ షూట్హీరా లాల్ డ్యాన్స్ డైరక్షన్లో ‘పచ్చగడ్డి కోసేటి...’ సాంగ్ షూటింగ్‌తో షూటింగ్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో పెద్ద పండగలా షూటింగ్ చేశారు. 12 రోజుల పాటు షూటింగయ్యాక మొదటి రోజు మినహా మిగతాది ఏదీ కెమేరాలో క్యాప్చర్ కాలేదని తెలిసి అంతా షాకయ్యారు. దీంతో చేసేది లేక మళ్లీ ఆ 12 రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది. ఇక ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనమనే చెప్పాలి. అప్పట్లో రేడియోలో ఈ పాటలు మోగని రోజు లేదు. ఏ గడప దగ్గర నించున్నా ఈ సినిమాలో పాటలు వినపడాల్సిందే. కేవీ మహదేవన్ మ్యూజిక్ ఓ వైపు... ఆత్రేయ సాహిత్యం మరోవైపు జనాల్ని ఓ ఊపు ఊపేశాయి. ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా...’, ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ ఇలా అన్ని పాటలూ బంపర్ హిట్. అప్పట్లో ‘దసరా బుల్లోడు’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రిలీజైన తొలి 4 వారాలకే 25 లక్షల గ్రాస్ వసూలు చేయడం తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకూ కనీవినీ ఎరుగని రికార్డు.హీరోగా సూపర్ హిట్ కెరీర్‌ని చూసి, ఇప్పుడు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ దూసుకెళుతున్న జగపతిబాబు తండ్రే ‘దసరా బుల్లోడు’ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అనే విషయం తెలిసిందే. జగపతిబాబు పేరుతోనే ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి సినిమాలు తీసేవారు. అప్పట్లో జగపతి పిక్చర్స్ అంటే టాలీవుడ్ నెంబర్ వన్. ‘దసరా బుల్లోడు’తోనే వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. ఈ సినిమా కథ కూడా ఆయనే తయారు చేసుకున్నారు. వాస్తవానికి జగపతి సంస్థకు విక్టరీ మధుసూదనరావు ఆస్థాన దర్శకుడు. అయితే ఆయన బిజీగా ఉండడం వల్ల దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారట వీబీ. ఆయనకూ వీలు కాలేదు. చివరికి అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారట. కానీ స్టేజ్ ఆర్టిస్ట్‌గా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా మంచి అనుభవమున్న వీబీనే డైరెక్ట్ చేయాల్సిందిగా ఏఎన్నార్ ప్రొత్సహించడంతో వీబీ దర్శకత్వం చేయక తప్పలేదు. అందుకే ఈ సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. తర్వాత వివిధ కారణాలవల్ల అన్నీ కోల్పోయినప్పుడు తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షర రూపమిస్తూ రాసిన పుస్తకానికి ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టుకున్నారు వీబీ రాజేంద్రప్రసాద్. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
ట్రెండ్ సెట్టింగ్ బుల్లోడు
ఒక్కో తరంలో ఒక్కో సినిమా ఉంటుంది. ఒక్కో యాక్టర్ కెరీర్ లో ఒక్కో సినిమా ఉంటుంది. కమర్షియల్ సినిమాలే అయినా... కాసులు కురిపించడంతో పాటు, పాపులర్ కల్చర్ పైనా ప్రభావం చూపెడతాయి. పేరు దగ్గర నుంచి పాటలు, దుస్తుల దాకా అనేక విషయాల్లో ఆ తరాన్నీ, ఆ తరువాతి సినిమాలనూ ప్రభావితం చేస్తాయి. అనేక తరాల పాటు గుర్తుండిపోతాయి. అక్కినేని నటించిన ‘దసరా బుల్లోడు’కి అలాంటి ప్రత్యేకతే ఉంది. ఇప్పటికి సరిగ్గా 50 ఏళ్ళ క్రితం 1971 జనవరి 13న రిలీజైన ‘దసరా బుల్లోడు’ అప్పట్లో ఓ సంచలనం. ఇప్పటికీ ఓ తరానికి తీపి జ్ఞాపకం. అది 1970ల నాటి మాట. తెలుగు తెరపై అప్పుడప్పుడే కలర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కంటే ఖర్చు ఎక్కువయ్యే కలర్ సినిమాలంటే పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ మోజు పెరుగుతున్న కాలం. అలా కలర్ సినిమాల శకం ప్రారంభంలో వచ్చిన చిత్రం ఏయన్నార్ ‘దసరా బుల్లోడు’. ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్ తొలిసారిగా కలర్లో తీసిన సినిమా అది. ఆ సినిమాకు ముందు అక్కినేని ప్రస్థానం వేరు. ‘దసరా బుల్లోడు’ తరువాత ఆ ప్రభావంతో ఆయన తన పంథా మార్చి, చేసిన ప్రయాణం వేరు. అదీ ‘దసరా బుల్లోడు’ స్పెషాలిటీ! జయలలిత లాస్... వాణిశ్రీకి గెయిన్! ‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది – అక్కినేని, ఆయనకు జంటగా నటించిన హీరోయిన్ వాణిశ్రీ. నిజానికి, ఈ చిత్రంలో వాణిశ్రీ కన్నా ముందు హీరోయిన్గా దర్శక, నిర్మాతలు ఎంచుకున్నది – తరువాతి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన జయలలితను! అయితే, అదే సమయంలో నిర్మాత ఎం.ఎస్. రెడ్డి నిర్మిస్తున్న ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ విజయము’లో, ఎమ్జీఆర్ హీరోగా చేస్తున్న చిత్రంలో జయలలిత నటిస్తున్నారు. ఏమైందో ఏమో ‘దసరా బుల్లోడు’ షూటింగ్ వారంలో ఉందనగా, జయలలితకు కుదరదంటూ ఆమె తల్లి లెటర్ పంపారు. దిక్కుతోచని వి.బి. అప్పటికే పేరు తెచ్చుకున్న వాణిశ్రీని అప్పటికప్పుడు హీరోయిన్గా అనుకున్నారు. ఎంత డబ్బయినా ఫరవాలేదని ఆమె డేట్లు ఎడ్జస్ట్ చేయించుకున్నారు. ఆ సినిమాకు ఏయన్నార్ పారితోషికం పాతిక వేలైతే, అర్జెంటుగా వాణిశ్రీ డేట్ల కోసం ఆమె బంధువుకు అడగకుండానే ఇచ్చింది యాభై వేలట! ఆ సంగతి వి.బి.నే స్వయంగా వెల్లడించారు. అలా ‘దసరా బుల్లోడు’ జోడీ అయ్యారు వాణిశ్రీ. అక్కడ నుంచి వాణిశ్రీ హవా మొదలైంది. ‘దసరా బుల్లోడు’ హిట్‌తో వాణిశ్రీకి స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ‘ప్రేమ్‌నగర్’ లాంటి కెరీర్ బెస్ట్‌లు రావడానికి ఈ సినిమా పునాది వేసింది. అక్కినేని, వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే ధోరణి పాకింది. వారిద్దరితో 20+ సినిమాలొచ్చాయి. కష్టాలు దాటిన కలర్ ఫుల్ సినిమా నృత్య దర్శకుడు హీరాలాల్ సారథ్యంలో ‘పచ్చగడ్డి కోసేటి...’ పాట చిత్రీకరణతోనే పచ్చనిచేలలో తొలి రోజు షూటింగ్ ఆరంభమైంది. ప్రముఖ నటీనటులందరూ పాల్గొనగా, రోజుకు 200 మంది యూనిట్‌తో, ఓ తిరణాల లాగా 12 రోజులు ఈ కలర్ చిత్రం షూటింగ్ చేశారు. తీరా అంతా అయ్యాక, మొదటి రోజు మినహా మిగతాదేదీ కెమెరాలో చిత్రీకరణ జరగలేదని తెలిసింది. తరువాత మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఆ రోజుల్లో కొత్తగా ఆరంభమైన ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కె.ఎల్.ఎన్. ప్రసాద్ లక్ష్మీఫిలిమ్స్ అండగా నిలిచింది. ఇలా ఎన్నో అవరోధాలు దాటి, ‘దసరా బుల్లోడు’ రిలీజై, జనాదరణ పొందాడు. పంచె కట్టులో, పసందైన పాటలు, స్టెప్పులతో అక్కినేని అలరించారు. తొలి ప్రయత్నంతోనే డైరెక్టర్‌గా వి.బి. హిట్టయ్యారు. వరసగా తెలుగు, తమిళ, హిందీల్లో చిత్రాలను రూపొందించారు. అన్నా వదినల సొంత బిడ్డలా తిరిగే ఓ పల్లెటూరి దసరా బుల్లోడి (అక్కినేని)ని పట్నంలో చదువుకున్న తన కూతురి (చంద్రకళ)కిచ్చి ఆస్తి కాజేయాలని అనుకొంటాడు ఓ దుష్టుడు (నాగభూషణం). కానీ, ఊళ్ళోనే మరో అమ్మాయిని (వాణిశ్రీ)ని ప్రేమిస్తాడు హీరో. ఈ ముగ్గురి ప్రేమకథలో జరిగే ట్విస్టులు, ఒకరి కోసం మరొకరు చేసే త్యాగాలు, విధి ఆడే వింత నాటకాలు ఈ చిత్రకథ. ఎస్వీఆర్, సూర్యకాంతం, గుమ్మడి, అంజలీదేవి, పద్మనాభం – ఇలా భారీ తారాగణం ఉన్న సినిమా ఇది. కలర్ సినిమాల్లో... తెరపై రంగుల్లో అందంగా కనిపించడం కోసం ఆ రోజుల్లో నటీనటులు కాస్తంత మందంగానే మేకప్ దట్టించేవారు. పెదాలు, నోరు ఎర్రగా కనిపించడం కోసం... రంగు గట్టిగానే వేసుకొనేవారు. ‘దసరా బుల్లోడు’ చిత్రాన్ని ఇవాళ బుల్లితెరపై చూస్తున్నా, ఆ సంగతి అర్థమవుతుంటుంది. కథలోని డ్రామా, శృంగారం పాలు, హుషారైన పాటలు, మనసును కదిలించే సన్నివేశాలు కలిసి ఆ రోజుల్లో ఈ చిత్రం జనాన్ని ఓ ఊపు ఊపేసింది. సినిమా మొదట్లోనే దసరా సందర్భంగా హీరోతో పులి వేషం డ్యాన్స్, నెమలి డ్యాన్స్, కోలాటాల లాంటివి చేయడం గ్రామీణ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పాట ప్రయాణదిశ మార్చిన ఆ(బూ)త్రేయ! అలాగే, యాభై ఏళ్ళ క్రితం ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనం. రేడియోలో ఆ పాటలు మోగని రోజు లేదు. వినపడని ఇల్లు లేదు. కె.వి. మహదేవన్ సంగీతం ఒక ఎత్తయితే, ఆత్రేయ సాహిత్యం మరో కొత్త ఎత్తు. ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ..’, అలాగే సంతోష, విషాద సందర్భాలు రెంటిలో వచ్చే ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా..’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ – ఇలా పాటలు సూపర్ హిట్. అన్నిటి కన్నా ముఖ్యంగా ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్...’ లాంటి పాపులర్ శృంగార సినీగీత సాహిత్యానికి ఈ సినిమాతోనే తెలుగు నేల స్వాగతం పలికింది. తెలుగు సినిమాకు ఆ రకంగా అది ఓ పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి సినీగీతం పూర్తి కమర్షియల్ దిశలోకి మలుపు తిరిగింది. బూతును కూడా పాటలో అందంగా చెప్పారంటూ సినీ గీత రచయిత ఆత్రేయను ‘‘బూత్రేయ’’ అనడం మొదలెట్టారు – గిట్టని జనం. ఎవరేమన్నా అప్పటి నుంచి మారిన కాలం, మారిపోయిన సామాన్యుల అభిరుచికి తగ్గట్టుగా ఆ సుడిగుండంలోనే ఇప్పటిదాకా మన సినీగీతాలు సుడులు తిరుగుతూ ఉండడం గమనార్హం. నాలుగు వారాలకు ఇండస్ట్రీ రికార్డ్! లేట్ రన్లో కూడా ‘దసరా బుల్లోడు’ మరో 3 కేంద్రాలలో (తుని, ప్రొద్దుటూరు, కరీంనగర్) వంద రోజులు ఆడడం విశేషం. అప్పట్లో వసూళ్ళలో ‘దసరా బుల్లోడు’ది ఓ ఇండస్ట్రీ రికార్డు. రిలీజైన తొలి 4 వారాలకే ఆ చిత్రం రూ. 25 లక్షల గ్రాస్ వసూళ్ళు సాధించడం తెలుగు సినీ పరిశ్రమలో అంతకు మునుపెన్నడూ కనివిని ఎరుగని విషయం. ‘దసరా బుల్లోడు’ తరువాత వచ్చిన ఏయన్నార్ ‘ప్రేమ్‌నగర్’ (1971) ఇంకా ఎక్కువ వసూళ్ళు తెచ్చుకొని, తొలి 50 రోజులకు రూ. 33 లక్షల గ్రాస్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. ‘దసరా బుల్లోడు’ మూలకథ ఆధారంగా, కొన్ని మార్పులు చేర్పులతో తరువాత తమిళంలో శ్రీధర్ దర్శకత్వంలో ఎమ్జీఆర్ హీరోగా ‘ఉరిమై కురళ్’ (1974) వచ్చింది. హిట్టయింది. ఇక, వి.బి.నే స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో జితేంద్ర, రేఖ, షబానా ఆజ్మీలతో ‘రాస్తే ప్యార్ కే’ (1982) పేరిట ‘దసరా బుల్లోడు’ను హిందీలో రీమేక్ చేశారు. డైరెక్షన్‌కు అక్కినేని నో! ఇవాళ్టి ప్రముఖ నటుడు జగపతిబాబు తండ్రి, ప్రముఖ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాతోనే దర్శకుడయ్యారు. అసలు ఈ కథ తయారు చేసిందీ ఆయనే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, బి.ఎస్సీ చదువుకొన్న ఆయన కృష్ణాజిల్లాలో తాను పుట్టి పెరిగిన పల్లెటూరు, మనుషుల మనస్తత్వాలు, ఇంట్లోని వ్యక్తులు, కళ్ళారా చూసిన వాస్తవ సంఘటనల ఆధారంగా స్వయంగా ఈ కథ సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాకు దర్శకత్వం వహిం చాల్సింది మాత్రం మొదట ఆయన కాదు – జగపతి సంస్థకు పర్మినెంట్ దర్శకుడైన ‘విక్టరీ’ మధుసూదనరావు! తీరా ఆయన బిజీ అన్నారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారు. ఆదుర్తికీ అవలేదు. ఇంతలో వి.బి. రాజేంద్రప్రసాద్ ‘అక్కా చెల్లెలు’ చిత్రాన్ని నిర్మించారు. కానీ, ఆ తరువాతా ఆ దర్శకులంతా బిజీనే! ఇంతలో అక్కినేని సినిమా ఒకటి అనుకోకుండా క్యాన్సిలైంది. ఆ కాల్షీట్లు ఖాళీ అయి, అర్జెంటుగా సినిమా నిర్మించాల్సి వచ్చింది. ‘దసరా బుల్లోడు’ స్క్రిప్టు సిద్ధం చేసి, అక్కి నేనికి వినిపించిన వి.బి చివరకు అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ రంగస్థల నటుడు, నిర్మాతగా అనుభవజ్ఞుడైన వి.బి. రాజేంద్ర ప్రసాద్‌నే డైరెక్ట్ చేయాల్సిందని ప్రోత్సహించారు ఏయన్నార్. తామంతా వెన్నంటి ఉంటామన్నారు. ‘‘కాదూ... కూడదంటే, ఇక నీ సినిమాల్లో నటించను’’ అని బెదిరించారు కూడా! దాంతో, రాజేంద్రప్రసాద్ సాహసించి దర్శకుడు కాక తప్పలేదు. అక్కినేనికి తొలి గోల్డెన్ జూబ్లీ హిట్! కమర్షియల్‌గా ‘దసరా బుల్లోడు’ పెద్ద హిట్. ఆ రోజుల్లో ఈ సినిమా 35 ప్రింట్లతో రిలీజైంది. 29 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 22 సెంటర్లలో (హాలు షిఫ్ట్ అయిన కర్నూలుతో కలిపి) శతదినోత్సవం చేసుకుంది. చిత్ర యూనిట్ తరలి రాగా, ట్రాక్టర్లో అక్కినేనిని ఊరేగిస్తూ, గుడివాడ నీలా మహల్ థియేటర్లో 1971 ఏప్రిల్ 24న వంద రోజుల వేడుక ఘనంగా జరిపారు. ఆ మరునాడే హైదరాబాద్ శాంతి థియేటర్లోనూ శతదినోత్సవం చేశారు. ‘దసరా బుల్లోడు’ రిలీజైన పదిహేను వారాలకు అక్కినేనిదే ‘సుపుత్రుడు’ వచ్చింది. ఆ కొత్త సినిమా రిలీజ్ కోసం అనేక కేంద్రాలలో పాత ‘దసరా బుల్లోడు’ను పక్కకు తప్పించారు. అయినా, 4 కేంద్రాలలో (విజయవాడ, తిరుపతి, హైదరాబాద్, షిఫ్టయిన గుంటూరుల్లో) 16వ వారం నుంచి కూడా ‘దసరా బుల్లోడు’ హవా కొనసాగింది. వాటిలో 200 రోజులు ఆడింది. తిరుపతిలో కొద్ది గ్యాప్ తరువాత 213వ రోజు నుంచి మరో 6 వారాలు సినిమా ఆడింది. ఇక, హైదరాబాద్‌లో షిప్టింగులు, గ్యాప్‌లతో ‘దసరా బుల్లోడు’ ఏకంగా 365 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. అలా అక్కినేని సినీకెరీర్ లో 50 వారాలు ఆడిన తొలి స్వర్ణోత్సవ (గోల్డెన్ జూబ్లీ) చిత్రంగా చరిత్ర కెక్కింది. తర్వాత మరో దశాబ్దికి ‘ప్రేమాభి షేకం’(1981)తో అక్కినేని మరో గోల్డెన్ జూబ్లీ హిట్ సాధించారు. అది దసరా బుల్లోడు కారు! ‘దసరా బుల్లోడు’ తెలుగులో అంత పేరు, వసూళ్ళు సాధించినా అతి మంచితనం వల్ల దర్శక, నిర్మాత రాజేంద్రప్రసాద్‌కు లాభాలు మిగల్లేదు. సాక్షాత్తూ ఆయనే ఆ తరువాతి కాలంలో ఆ సంగతి వెల్లడించారు. ‘దసరా బుల్లోడు’లో ప్రధానభాగం అమలాపురంలో, విజయవాడ చుట్టుపక్కల భట్లపెనుమర్రు తదితర గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం షూటింగులో వాడిన ఎర్రటి ‘బీచ్ బగ్గీ’ అనే ఫారిన్ కారు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్! దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తనకు విజయం అందించిన ‘దసరా బుల్లోడు’ అన్నా, ఆ చిన్న కారు అన్నా జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్‌కు పంచప్రాణాలు. అదే కారును నాగార్జున హీరోగా తీసిన ‘కెప్టెన్ నాగార్జున’లో కూడా వాడారు. అయితే, 1990లలో ఒకానొక దశలో జీవితంలో అన్నీ కోల్పోయి, ఆర్థికంగా నష్టపోయి రోడ్డున పడ్డారు వి.బి. ఆ పరిస్థితుల్లో ఆ కారును అమ్మేయాల్సి వచ్చింది. అపురూప జ్ఞాపకమైన ఆ కారును అలా అమ్మే యాల్సి వచ్చినందుకు ఆయన చాలా బాధ పడ్డారు. విశేషం ఏమిటంటే, వి.బి. రాజేంద్రప్రసాద్ తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షరరూపమిస్తూ, ఆ పుస్తకానికి కూడా ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టడం! – రెంటాల జయదేవ -
రెండు సినిమాలకు పచ్చజెండా
అందాలరాముడు, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలతో హీరోగా తన ‘తడాఖా’ ఏంటో చూపించారు సునీల్. ప్రస్తుతం ఆయన సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దసరాబుల్లోడు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు పచ్చజెండా ఊపేశారు సునీల్. అందులో మొదటిది భీమినేని శ్రీనివాసరావు సినిమా. ‘సుడిగాడు’ లాంటి భారీ విజయం తర్వాత సునీల్‌తో తన తర్వాతి సినిమాను ప్లాన్ చేశారు భీమినేని. రీమేక్‌ల స్పెషలిస్ట్ అయిన భీమినేని... సునీల్‌తో తెరకెక్కించే సినిమా కూడా రీమేకే కావడం విశేషం. తమిళ హిట్ ‘సుందరపాండ్యన్’ చిత్రాన్ని సునీల్ కథానాయకునిగా రీమేక్ చేయబోతున్నారాయన. ఇక రెండో సినిమా విషయానికొస్తే... ఈ సినిమా ద్వారా రచయిత గోపిమోహన్ దర్శకునిగా పరిచయం కానున్నారు. మళ్ల విజయప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌కి వెళ్లనుంది.