breaking news
dalit issue
-
ఇంత దారుణమా చంద్రబాబూ..!
సాక్షి, అమరావతి: దళితుల విషయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్న కపట ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి దళితుల గురించి చంద్రబాబు గతంలో చులకనగా మాట్లాడారని, దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ నాడు సీఎం హోదాలో చంద్రబాబు పేర్కొన్నారని, ఒక సీఎం స్థాయి వ్యక్తులే ఈరకంగా మాట్లాడితే ఇక కిందిస్థాయి వ్యక్తులు ఎలా దళితులను గౌరవిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. బాబు కేబినెట్లోని మంత్రే దళితులు స్నానం చేయరు, వారి వద్ద వాసన వస్తుందని అనుచితంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని విషయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చంద్రబాబు ఏరకంగా అన్యాయం చేశారో గణాంకాల సాక్షిగా సీఎం వైఎస్ జగన్ సభకు వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు రెండు ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేసే బిల్లుపై సభా నాయకుడిగా, సీఎంగా వైఎస్ జగన్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. అయితే, ఈ సమయంలో టీడీపీ సభ్యులు అల్లరి చేస్తూ.. సీఎం ప్రసంగిస్తుండగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. తన మాటలు ప్రజల వద్దకు వెళ్లవద్దనే దురుద్దేశంతోనే టీడీపీ సభ్యులు అరుస్తున్నారని, ఇటువంటి దారుణమైన పనులు చేయిస్తున్న వ్యక్తి చంద్రబాబు తప్ప ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండబోరేమోనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప వేరే మాటలు రావని, ఏపీ స్టేట్ కమిషన్ గురించి బాబు మాట్లాడుతూ.. 2003లోనే తాము ఎస్సీ కమిషన్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీస్ 1992లోనే వచ్చిందని, 1994-95 మధ్యకాలంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2004 ఎన్నికలకు ముందు రాజకీయ ఆలోచనతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను తీసుకొచ్చారని, 1992లో జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ వస్తే.. 200 3దాకా రాష్ట్రంలో అలాంటి కమిషన్ తీసుకురావాలన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు అప్పట్లో పరిపాలించారని మండిపడ్డారు. ‘ఎంచి చూడగా మనుషులందున మంచిచెడులు రెండే కులములు మంచి అన్నది మాల అయితే నేను ఆ మాలనవుతాను’ అని వంద సంవత్సరాల కిందట గురజాడ అప్పరావు అంటే.. దళితులుగా పుట్టాలని ఎవరునుకుంటారంటూ ఇప్పడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు సీఎం అయిన తర్వాత పేర్కొన్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా లేదని దుయ్యబట్టారు. రాజధాని కోసం సీఆర్డీఏ సేకరించిన భూముల విషయంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులకు చంద్రబాబు దారుణమైన అన్యాయం చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఓసీలకు సంబంధించిన పట్టా భూములకు ఎక్కువ భూమి కేటాయించి.. దళిత, బీసీ, మైనారిటీలకు సంబంధించిన అసైన్డ్‌భూములకు మాత్రం తక్కువ భూమి పరిహారంగా కేటాయించిన విషయాన్ని వివరించారు. దళిత, బీసీ, మైనారిటీలపై ఇంత దారుణమైన వివక్ష చూపించడం వల్లే.. రాష్ట్రంలో 36 ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. అందులో ఒక్కటి మాత్రమే టీడీపీ గెలుచుకుందని తెలిపారు. రెండు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీల కోసం తమ ప్రభుత్వం మరో విప్లవాత్మక బిల్లును తీసుకొచ్చిందని సీఎం జగన్ వివరించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యల మీద సమగ్ర అధ్యయనం చేసి.. పరిష్కారం దిశగా కృషిచేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. రాష్ట్ర కేబినెట్లో 60శాతం మంత్రి పదవుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీలే ఉన్నారని, రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటే.. అందులో నలుగురు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీ వర్గాలకు చెందిన వారని, ఇది తమ ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రిగా ఒక దళిత మహిళ ఉందని, గత హయాంలో ఎన్నికలు వచ్చే వరకు కనీసం ఒక్క ఎస్టీకి మంత్రి పదవి కూడా చంద్రబాబు ఇవ్వలేదని, ఇప్పుడు ఒక ఎస్టీ మహిళను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశామని సీఎం జగన్ అన్నారు. నామినేటెడ్ పదవులు, నామినెటెడ్ పనుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. గ్రామ సెక్రటేరియట్లలో లక్షా28వేలకుపైగా శాశ్వత ఉద్యోగాలు కల్పించగా.. అందులో 82.5శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు,మైనారిటీ ఉద్యోగులే ఉన్నారని వివరించారు. ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు విప్లవాత్మక అడుగులు వేస్తున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలు, ఎస్టీల కోసం ఇంకొక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు దిక్కుమాలిన రీతిలో, సిగ్గులేనిరీతిలో ప్రవర్తిస్తున్నారని, వారిని సస్పెండ్ చేసినా తప్పులేదని అన్నారు. -
హనుమంతుడి కులపత్రం ఇవ్వండి
వారణాసి: హనుమంతుడు దళితుడంటూ మొదలైన చర్చ కొత్త మలుపు తిరిగింది. అంజనీపుత్రుడి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత శివపాల్ యాదవ్‌కు చెందిన పార్టీ నేతలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారంలోగా సర్టిఫికెట్ ఇవ్వకుంటే ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో విభేదాల కారణంగా ములాయం సోదరుడైన శివపాల్ యాదవ్ అక్టోబర్‌లో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(పీఎస్‌పీఎల్)(లోహియా) స్థాపించారు. ఆ పార్టీ వారణాసి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హరీశ్ మిశ్రా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘దైవ స్వరూపుడైన ఆంజనేయుడి కుల ధ్రువీకరణ పత్రం కోసం వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో దరఖాస్తు చేశాం. హనుమంతుడు దళితుడంటూ సీఎం యోగి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన్ను స్వార్థపూరిత కుల రాజకీయాల్లోకి లాగారు. అందుకే హనుమంతుడి కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాం’ అని తెలిపారు. దరఖాస్తులో హనుమాన్ తల్లిదండ్రులను మహారాజ్ కేసరి, అంజనాదేవీగాను ఆయన నివాసం ప్రముఖ సంకట్ మోచన్ ఆలయంగాను పేర్కొన్నారు. కులానికి సంబంధించిన కాలమ్‌లో దళితుడిగా, పుట్టిన తేదీని అనంతుడనీ, వయస్సును అమరుడు అని పేర్కొన్నారు. హనుమంతుడు దళితుడైనందున దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలను స్వాధీనం చేసుకుని, దళితులనే పూజారులుగా నియమించుకోవాలంటూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ దళితులకు శుక్రవారం పిలుపునిచ్చారు. -
చలో గరగపర్రు భగ్నం
పాలకోడేరు: దళిత సంఘాల చలో గరగపర్రు కార్యక్రమాన్ని పోలీసులు శనివారం భగ్నం చేశారు. గరగపర్రు గ్రామానికి వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు తమ వలయంలోకి తీసుకుని నిర్బంధించారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్‌ను గ్రామంలోకి రాకుండా మండలంలోని వేండ్ర రైల్వే గేటు వద్ద అరెస్ట్ చేసి భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో గరగపర్రు గ్రామంలోని దళితులంతా ర్యాలీగా గ్రామ సెంటర్లోకి చేరుకుని నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన ముగ్గురు దళిత యువకులు వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకేశారు. దీంతో ఒక దశలో గ్రామ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒక దశలో ఏమవుతుందో ఏంటో అని అందరూ కంగారు పడ్డారు. డీఎస్పీ పూర్ణచంద్రరావు వస్తున్నారు.. మీతో మాట్లాడతారు వెనక్కి పదండి అని పోలీసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రాంతానికి తీసుకువచ్చారు. మంత్రులు ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాలని వారు కోరగా అందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని నర్సాపురం డీఎస్పీ పూర్ణచంద్రరావు హామీ ఇచ్చారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న దళిత నేతలతో చర్చించి కొంత మంది ప్రతినిధులు నరసాపురం కార్యాలయానికి వస్తే చర్చించి సమస్య పరిష్కారానికి దారి చూపుతామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను దళితులు విరమించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు కారుమంచి క్రాంతి, ఎరిచర్ల రాజేష్ తదితర దళిత నాయకులు మాట్లాడుతూ డీఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని, ఒకవేళ కాకపోతే చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దళితుల చలో గరగపర్రుకు పిలువు ఇవ్వడంతో గరగపర్రు వెళ్లే ప్రతి వ్యక్తిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి వారి గుర్తింపు కార్డులు చూసి నిర్ధారించి గ్రామంలోకి పంపించారు.