breaking news
cooking competitions
-
అమెరికాలో తెలుగు వంటల పోటీలు..!
డల్హాస్ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకు డల్హాస్ వేదిక కావడంతో నాట్స్ ఈ సంబరాల కోసం పలు పోటీలు సన్నద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్హాస్ విభాగం ఆధ్వర్యంలో తెలుగు మహిళలకు వంటల పోటీలు నిర్వహించింది. మహిళలు రకరకాల వంటలతో ఆహా అనిపించారు. కమ్మనైన వంటలతో తమ పాకశాస్త్ర ప్రావిణ్యాన్ని చాటిచెప్పారు. సంజన కలిదిండి మొదటి స్థానం, రంజని రావినూతల రెండవ స్థానం, శ్రీవాణి హనుమంతు మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతీ మహిళను విజేతగా గుర్తిస్తున్నట్లు న్యాయ నిర్ణేతలు జ్యోతి వనం, శ్రీలక్ష్మి మండిగ ప్రకటించారు. ఆపిల్, కొబ్బరి బర్ఫీ, కిళ్లీ కేక్, ఇండియన్ డోనట్ (బెల్లం గారె), జున్నుతో ప్రత్యేకమైన వంటలు తయారు చేశారు. చివరగా న్యాయనిర్ణేతలు శ్రేష్ఠ విజేతగా స్వాతి మంచికంటిని ప్రకటించారు. తెలుగు సంబరాల్లో మహిళలు మెచ్చే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు ‘నారీ సదస్సు’ సమన్వయకర్త రాజేశ్వరీ ఉదయగిరి తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు నారీ సదస్సు సభ్య బృందం రాధ బండారు, గాయత్రి గ్రిరి, లావణ్య ఇంగువ, వాణి ఐద, ప్రత్యూష మండువ, పద్మశ్రీ తోట తదితరులు సహకారం అందించారు. నాట్స్ సంబరాల కమిటీ ఈ పోటీల్లో విజేతలను ప్రత్యేకంగా అభినందించింది. మే 24 నుండి 26 వరకు డల్హాస్‌లోని అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించే తెలుగు సంబరాలకు తెలుగువారంతా తరలిరావాలని నాట్స్ జాతీయ కమిటీ, సంబరాల కమిటీ ఆహ్వానించింది. -
వంట..నోరూరెనంట
విజయవాడ (మొగల్రాజపురం) : మన సంస్కృతీ సంప్రదాయాలతో పాటు ఆహార రుచులను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని పర్యాటక శాఖ కమిషనర్ డాక్టర్ ఆర్పీ కుజారియా అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గాయత్రీనగర్‌లోని మెట్రోపాలిటన్ హోటల్లో వంటల పోటీలు జరిగాయి. విజేతలకు కుజారియా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎన్నో పర్యాటక, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని, మన ఆహారానికి మంచి పేరు ఉందన్నారు. దీనిద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో అపారంగా ఉపాధి అవకాశాలున్నాయని చెప్పారు. టూరిజం శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.సుధాకుమార్‡మాట్లాడుతూ వంటల పోటీలను తమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించామన్నారు. పోటీలను నిర్వహించిన వెస్టిన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కె.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీల్లో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల విద్యార్థులతో పాటు స్టార్స్ హోటల్స్ చెఫ్‌లు, గృహిణులు పాల్గొన్నారన్నారు.