breaking news
CM convai
-
పుష్కర మహా విషాదం.. అందువల్లనే..
పుష్కర ఘాట్ వద్ద ఆర్అండ్బీ ఏర్పాటు చేసిన బారికేడ్ల తొలగింపు సీఎం కాన్వాయ్ కోసమే ఈ నిర్వాకం ఫలితంగానే తొక్కిసలాట మరణాలు ఘటన జరిగిన గంట వరకూ అందని వైద్యం స.హ. చట్టం ద్వారా వెల్లడైన నిజాలు సాక్షి, రాజమహేంద్రవరం : అధికారులే స్వయంగా నిబంధనలను తుంగలో తొక్కడం.. పెద్ద సంఖ్యలో వస్తున్న యాత్రికులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడమే గోదావరి పుష్కర మహావిషాదానికి కారణమని మరోసారి వెల్లడైంది. పావన వాహిని పుష్కర పర్వం సందర్భంగా గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి, 29 మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు సేకరించిన సమాచారం.. పుష్కర ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని మరోమారు ఎత్తిచూపింది. పుష్కర ఘాట్ వద్ద నలువైపుల నుంచీ ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. ఇసుక ర్యాంపు నుంచి మూడో గేటు వరకూ 5 వరుసలు.. జెండా పంజా రోడ్డు నుంచి ఒకటో గేటుకు 4 వరుసలు.. గోదావరి రైల్వే స్టేషన్ నుంచి హేవలాక్ వంతెన వరకూ 4 వరుసలు.. గోకవరం బస్టాండ్ నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఘాట్‌లోకి 3 వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఆ శాఖ పేర్కొంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్, ఇతర వీఐపీల వాహనాలను ఘాట్ వద్దకు అనుమతించేందుకుగానూ అధికారులు వాటిని తొలగించారు. అంతేకాకుండా నిబంధలకు విరుద్ధంగా సీఎం కాన్వాయ్‌ను ఘాట్ వద్దకు అనుమతించారు. పుష్కర ఘాట్ ఎదుట వీఐపీ వాహనాలు నిలపడానికి అనుమతించడంతో ఆ ప్రాంతం ఇరుకుగా తయారైంది. సీఎం పుష్కరస్నానం చేసే వరకూ అన్ని గేట్లూ మూసివేశారు. ఘాట్ బయట తోపులాట జరుగుతున్నా పోలీసులు అదుపు చేయకుండా సీఎం, ఇతర వీఐసీల సేవల్లో ఉన్నారు. ఏదైనా ఆపద తలెత్తినప్పుడు వెళ్లేందుకు అత్యవసర మార్గం ఏర్పాటు చేసినట్లు మ్యాపులో చూపించినా క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఘటన జరిగిన గంట తర్వాత.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రాత్రికే పుష్కరఘాట్ వద్దకు చేరుకున్నారు. వారిలో ఉపవాసం ఉన్నవారు కూడా ఉన్నారు. మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేసినా అవి భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయి. నీర సించిపోయిన భక్తులకు తొక్కిసలాట జరగడంతో శ్వాస తీసుకోవడం కష్టమైంది. వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసినా సకాలంలో వైద్యం అందించలేకపోయారు. క్షతగాత్రులకు ఆక్సిజన్ అందించడానికి కూడా ఏర్పాట్లు చేయలేదు. సాధారణ మందులు మాత్రమే అందుబాటులో ఉంచారు. తొక్కిసలాట ఉదయం 8.30 గంటలకు జరిగితే మొదటి క్షతగాత్రుడిని 9.40 గంటలకు ఆస్పతికి తీసుకెళ్లినట్లు వైద్య శాఖ తెలిపింది. మధ్యాహ్నం 12:10 గంటల వరకూ క్షతగాత్రులను తరలిస్తూనే ఉన్నారు. అంబులెన్స్‌లు ఘాట్ వద్దకు రావడానికి, తిరిగి వెళ్లడానికి అధిక సమయం పట్టింది. ఇక్కడే ఏర్పాట్లలో లోపాలు ప్రస్ఫుటమవుతున్నాయి. తొక్కిసలాట జరిగిన వెంటనే బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి సరైన ఏర్పాట్లు చేయలేదని ఈ వివరాల ఆధారంగా స్పష్టమవుతోంది. నిబంధనలకు విరుద్ధం ఏదైనా ఓ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరైనప్పుడు నిబంధనల ప్రకారం వాహనాలను అనుమతించరాదు. కానీ పుష్కర ఘాట్ వరకూ సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీల వాహనాలను అనుమతించారు. ఇందుకోసం రోడ్లు, భవనాల శాఖ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. ఎవరి ఆదేశాలతో వీటిని తొలగించారో కమిషన్ విచారించాలి. ఘాట్ ఇన్చార్జికి ఈ సమాచారం ఉందో లేదో తేలాల్సి ఉంది. ఘాట్‌లో సీఎం చంద్రబాబు ఎంతసేపు ఉన్నారు? వీఐపీ ఘాట్‌కు వెళ్లాల్సిన సీఎం సామాన్య భక్తులు వచ్చే పుష్కర ఘాట్‌కు రావడానికి ఏ అధికారి అనుమతిచ్చారు? తదితర అంశాలన్నింటినీ కమిషన్ విచారించాలి. – ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు -
సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ..
* ఏసీపీ వాహనాన్ని ఢీకొన్న బైక్ * ఇద్దరికి తీవ్ర గాయాలు ఆటోనగర్: సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ బైకుపై వచ్చిన ఇద్దరు, ఏసీపీ వాహనాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం... హయత్‌నగర్ పద్మావతికాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన సూర్యప్రకాశ్‌లు బైక్‌పై హయత్‌నగర్ నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను వెంబడిస్తున్నారు. వనస్థలిపురం లెజెండ్ ఆసుపత్రి వద్ద ఎస్ఐ దేవేందర్ బైకును ఆపడానికి ప్రయత్నించిగా, వారు వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లి సీఎం కాన్వాయ్‌తో వెళ్తున్న వనస్థలిపురం ఏసీపీ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సూర్యప్రకాశ్ రెండుకాళ్లు విరిగిపోగా, శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అవుతూ బైక్‌ను వేగంగా నడిపిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హయత్‌నగర్ పోలీసుల నిర్లక్ష్యం... హయత్‌నగర్ శివారు లక్ష్మారెడ్డి పాలెం నుంచి సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ ఇద్దరు వ్యక్తులు దాదాపు 8 కిలోమీటర్ల వరకు బైకుపై వచ్చారు. సీఎం నగరానికి వచ్చే సమయంలో హయత్‌నగర్ పోలీసులు జాతీయ రహదారిపై భారీ బందోబస్తు నిర్వహించినప్పటికీ వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. తీవ్రవాదులు ఇలాంటి ఘటనకు పాల్పడితే పరిస్థితి ఎలా ఉండేదని స్థానికంగా చర్చ జరుగుతుంది.