breaking news
cities to villages
-
వెలిసిపోతున్న వలస బతుకులు
-
‘హామీ’లేని ఉపాధి!
పట్నం కార్మికుని పల్లెబాట - వెలిసిపోతున్న వలస బతుకులు - పేదల పొట్ట కొట్టిన ‘నోట్ల రద్దు’ - నగరాల్లో కుదేలైన నిర్మాణ రంగం - ఆగమాగమైన కూలీలు - పనుల కోసం సొంతూళ్లకు పయనం - అక్కడా ఉపాధి దొరక్క తిప్పలు సాక్షి, నెట్వర్క్: పెద్దనోట్ల రద్దుతో వలస బతుకులు వెతల పాలవుతున్నాయి. బడుగుల బతుకు బండి గాడి తప్పుతోంది. రాజధాని ‘అడ్డా’పై ఇన్నాళ్లూ ఉపాధి పొందుతూ ఉన్నంతలో సర్దుకొని బతికినవారంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పట్నంలో పనులు కరువై పొట్ట చేతబట్టుకుని సొంతూళ్లకు పయనమవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, రాయచూర్, చెన్నై, ముంబై, పుణే నగరాల్లో భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. దీంతో భవననిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. వారంతా ఉపాధి హామీ పనులపై గంపెడాశలతో సొంతూళ్లకు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతున్న తీరు.. నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్న కూలీలు, కార్మికుల పరిస్థితిపై ‘సాక్షి’ తొమ్మిది జిల్లాల్లోని తొమ్మిది గ్రామాల్లో అధ్యయనం చేసింది. జాబ్ కార్డుంటేనే ఉపాధి నగరాలు, పట్టణాల్లో ఆదరువు కోల్పోయి ఊళ్లకు చేరుకుంటున్నవారికి ప్రస్తుతం వెంటనే పని దొరికే పరిస్థితి ఎక్కడా లేదు. ఉపాధి హామీ పనులు సాధారణంగా ఏటా జనవరి–జూలై మధ్యలో జరుగుతాయని, ఆ తర్వాత వ్యవసాయ పనులు ఉంటాయనే ఉద్దేశంతో పనులను నిలిపివేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఉపాధి పనులు చేపట్టే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఏ జిల్లాలోనూ ప్రత్యేక కార్యాచరణ కనిపించడం లేదు. పెద్దనోట్లు రద్దయి నెలన్నర అవుతున్నా.. ఒక్క జిల్లాలోనూ కొత్తగా పనులు చేపట్టలేదు. మరోపక్క వ్యవసాయ పనులూ కరువైపోయాయి. ఫలితంగా పల్లెబాట పట్టిన వారికేగాక స్థానికంగా ఉంటున్న వారికీ పనులు దొరకడం లేదు. రోజూ 70 దరఖాస్తులు ఉపాధి హామీ కింద ఏదో విధంగా పని చేసుకుని బతికేందుకు, జాబ్ కార్డు పొందేందుకు నగరం నుంచి పల్లెలకు వెళ్తున్న భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇతర వలస కూలీలు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి పనులు దక్కించుకోవాలంటే జాబ్‌కార్డు ఉండాలి. పెద్దనోట్ల రద్దు తర్వాత జాబ్‌కార్డుల కోసం తెలంగాణవ్యాప్తంగా ఒక్కో మండలంలో సగటున రోజూ 70 నుంచి వంద వరకు దరఖాస్తులు అందుతున్నాయని అంచనా. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కేశవరావుపల్లిలో 97 మంది పట్నం నుంచి వచ్చి జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన వారం–15 రోజులకు జాబ్ కార్డులు వస్తాయని కొందరు అధికారులు చెబుతుంటే, ప్రస్తుతం కార్డుల జారీ ఆపేశారని, కొత్త కార్డులు ప్రస్తుతం ప్రింట్ అవుతున్నందున ఇప్పట్లో ఇవ్వలేమని మరికొందరు పేర్కొంటున్నారు. పెరుగుతున్న వలసలు పెద్దనోట్ల రద్దుతో పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో 1,700 మంది ఉపాధి పనులు చేసేవారు. పెద్దనోట్ల రద్దు తర్వాత వీరితోపాటు కొత్తగా ఉపాధి పనులు అడుగుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా 2800కి పెరిగింది! దీని పొరుగునే ఉన్న గద్వాల జోగులాంబ జిల్లాలోని గట్టు గ్రామానికి కూడా నగరం నుంచి వలసలు పెరిగాయి. హైదరాబాద్, రాయచూర్, బెంగళూరులో భవన నిర్మాణ పనులు చేసే వారిలో దాదాపు 70 మంది తిరిగి వచ్చేశారు. ఇక నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,700 మంది కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఉపాధి కూలీలకూ భరోసా లేదు భవన నిర్మాణ రంగ కార్మికులు, వలస కూలీల పరిస్థితి ఇలా ఉంటే.. గ్రామాల్లోనే ఉండి ఇన్నాళ్లూ ఉపాధి పనులతో పొట్టపోసుకున్న వారికి కూడా భరోసా కరువైంది. ఇప్పుడు వారంతా అడ్డాలపై నిలబడి రోజువారీ పనుల కోసం దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే పలు జిలాల్లో ఉపాధి హామీ చెల్లింపులు ఆరు నెలలుగా నిలిచిపోయాయి. ‘సాక్షి’పరిశీలించిన తొమ్మిది గ్రామాల్లో కూలీలకు గత ఆరు నెలలుగా రూ.37.85 లక్షల మేర చెల్లించాల్సి ఉంది. గోరు చుట్టుపై రోకటి పోటులా పెద్దనోట్ల రద్దుతో ఇప్పట్లో ఆ డబ్బులు వస్తాయనే ఆశ కూడా లేకుండాపోయింది. చెన్నై నుంచి సొంతూరికి: తాడూరి మురళి, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి మండలం, సూర్యాపేట జిల్లా తొమ్మిదేళ్ల క్రితం తల్లిదండ్రులు, భార్య, చెల్లెలుతో కలిసి చెన్నై వెళ్లా. నాన్న వాచ్‌మన్‌గా, అమ్మ ఇళ్లలో పనికి కుదిరింది. నేను కిరాణా షాపులో గుమస్తాగా చేస్తున్నాను. పెద్ద నోట్ల రద్దుతో యజమాని జీతం తగ్గించాడు. దీంతో స్వగ్రామంలోనే పని చేసుకుని బతుకుదామని వచ్చా. ఇక్కడా ఏ పనీ దొరకట్లేదు. వచ్చే ఫిబ్రవరిలో చెల్లి పెళ్లి ఉంది. బ్యాంకులో రూ.3 లక్షలు దాచి ఉంచా. అవి బయటికొచ్చే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకూ పని కరువే: వెంకటరెడ్డి, భనవ నిర్మాణ మేస్త్రి, జామ్, నిర్మల్ నిర్మల్‌లో రెండు భవన నిర్మాణాలకు ఒప్పందం కుదుర్చుకున్నా. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇప్పుడు డబ్బులు ఇవ్వలేం.. ముందు పని కానివ్వు.. తర్వాత సర్దుబాటు చేస్తామని భవన యజమానులు షరతు పెట్టారు. నా కింద 18 మంది కూలీలు ఉన్నారు. నేను ఏదోలా సర్దుకున్నా కూలీలకు రోజువారీ చెల్లింపులు లేకుంటే నడవదు కదా! అందుకే కాంట్రాక్టు వదులుకున్నా. ప్రస్తుతం నాకు, 18 మంది కూలీలకు పని లేదు. ఊళ్లోనైనా ఏమైనా పనులు దొరుకుతాయని ప్రయత్నిస్తున్నా. సెల్‌ఫోన్ అమ్ముకుని ఊరికొచ్చా: నగేశ్, భవన నిర్మాణ కార్మికుడు, గట్టు, జోగులాంబ గద్వాల జిల్లా హైదరాబాద్‌లో భవన నిర్మాణ పనులతో క్షణం తీరిక లేకుండా ఉండేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత పనులు ఆగిపోయాయి. వేరే చిన్నా చితకా పనులు చేసుకుందామన్నా.. నగదు ఇబ్బందులతో ఎవరూ పని ఇవ్వడం లేదు. అక్కడ ఉండలేక, చార్జీలకు డబ్బుల్లేక నా సెల్‌ఫోన్ అమ్ముకుని ఊరికి వచ్చేశాను. ఉపాధి హామీ పని కల్పించాలని అడిగితే.. ఇప్పుడు లేవని అధికారులు అంటున్నారు. పని దొరకడం లేదు: బోయిని బుగ్గయ్య, బడెంపల్లి, వికారాబాద్ జిల్లా నెల నుంచి ముంబైలో పని దొరకడం లేదు. గతంలో చేసిన కూలీ డబ్బులు ఇంకా చేతికి రాలేదు. నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకూ కుటుంబ పోషణ భారంగా మారింది. చేసేదేమీ లేక సొంత గ్రామానికి వచ్చాం. ఉపాధి పనులడిగితే జాబ్‌కార్డు ఉందా అంటున్నారు. జాబ్‌కార్డు ఉంటేనే: గొల్ల గంగారాం, కిచ్చన్నపల్లి, సంగారెడ్డి జిల్లా నేను మెహిదీపట్నంలో అడ్డా కూలీని. నా భార్య భవన నిర్మాణ పనులు చేసేది. అక్కడ పనుల్లేక ఊరికొచ్చినం. ఉపాధి పనులు అడిగితే జాబ్‌కార్డు ఉండాలంటున్నారు. దరఖాస్తు చేసిన 15 రోజులకు వస్తదని చెప్పారు. వ్యవసాయ పనులైనా దొరుకుతాయని చూస్తున్నాం. పని దొరక్క వచ్చిన: వల్లెపు సంపత్, కొత్తకొండ, వరంగల్ అర్బన్ జిల్లా హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతంలో భవన నిర్మాణ పనులతో పొట్టబోసుకునేవాడిని. కానీ పెద్దనోట్ల రద్దుతో యజమానులు నిర్మాణాలు ఆపేశారు. భార్య, కొడుకుతో కలిసి సొంతూరికి వచ్చేశాను. ఇక్కడ ఉపాధి పనులు లేవు. వ్యవసాయ పనులూ లేవు. రోజు గడుసుడే కష్టంగా ఉంది. ఇప్పుడు పనుల్లేవంటున్నారు: లక్ష్మణ్, కడ్తాల, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌లో సెంట్రింగ్ పని చేసేవాడిని. ఇప్పుడు నిర్మాణ పనులు ఆపేశారు. పాత నోట్లకే పనులు చేస్తావా అని అడుగుతున్నారు. ఏం చేసుకోవాలి? సొంతూరికి వస్తే.. ఇక్కడ ఉపాధి పనులకు ఇది సీజన్ కాదంటున్నారు.


