breaking news
chopper accident
-
పట్నాలకు వచ్చాడు, పది రోజులున్నాడు, పాపం అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు
బోయినపల్లి(చొప్పదండి): జమ్ముకాశ్మీర్‌లోని ఓ నదిలో హెలికాప్టర్ కూలిపోయి మండలంలోని మల్కాపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ (29) మృతిచెందాడన్న విషయం మండలంలో దావనంలా వ్యాపించింది. నిరుపేద కుటుంబానికి చెందిన పబ్బాల మల్లయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. అనిల్ పదో తరగతి గంగాధర ప్రైవేటు పాఠశాలలో.. ఇంటర్ కరీంనగర్లో పూర్తి చేశాడు. డిగ్రీ వరకు చదువుకున్న అనిల్ సుమారు 11 ఏళ్ల క్రితం ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొని తొలి ప్రయత్నంలోనే జాబ్ సాధించాడు. ఆయన ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ సీఎఫ్ఎన్ విభాగంలో ఏవీఎన్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు అయాన్ (6), అరయ్ (3) సంతానం. తన అత్తగారి ఊరైన కోరెంలో ఇటీవల బీరప్ప పట్నాలు వేసుకోగా.. ఆ కార్యక్రమానికి అనిల్ హాజరయ్యాడు. అందరితో కలిసి సుమారు పది రోజుల పాటు ఆనందంగా గడిపాడు. కుమారుడికి పుట్టిన రోజు వేడుకలు 40 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన అనిల్.. ఇటీవలే చిన్న కుమారుడు అరయ్ మూడో పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు. తండ్రి మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చూపించాడు. పదిరోజుల క్రితం తిరిగి విధులకు బయల్దేరాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇదే ఘటనలో హెలికాప్టర్లో ఉన్న మరో ఇద్దరు కూడా మృతిచెందినట్లు సమాచారం. అనిల్‌కు ఇద్దరు సోదరులు (శ్రీనివాస్, మహేందర్) ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. తల్లి లక్ష్మి గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. తండ్రి మల్లయ్య ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడు. అనిల్ మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. తల్లి ఏడుస్తుంటే ఏమీ తెలియని ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తుండడం పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్మీకి వెళ్లాలని అనిల్ కోరిక అనిల్‌కంటే ముందు గ్రామానికి చెందిన మెట్ట కుమార్ మొదట ఆర్మీలో చేరాడు. మరోవ్యక్తి అకెన అనిల్ కూడా ఆర్మీలో చేరడంతో ఎలాగైనా ఆర్మీలో చేరాలని అనిల్ భావించాడు. అనిల్‌కు చిన్నప్పటి నుంచే సైనికుడిని కావాలనే కోరిక ఉండేదని ఆయన సోదరుడు శ్రీనివాస్ చెప్పాడు. బాధిత కుటుంబానికి ‘బండి’, ‘బోయినపల్లి’ పరామర్శ అనిల్ మృతిచెందిన విషయం తెలుసుకున్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఫోన్లో మాట్లాడారు. అనిల్ కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతిమసంస్కారాలకు ఏర్పాట్లు చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. అలాగే అనిల్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం ప్రకటించారు. -
అఖిలేష్ దంపతులకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వాళ్లు వెళ్తున్న హెలికాప్టర్‌ను ఓ పక్షి ఢీకొంది. కనౌజ్ ఎంపీ అయిన తన భార్య డింపుల్ యాదవ్, ప్రజాపనుల శాఖ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ తదితరులతో కలిసి అఖిలేష్ హెలికాప్టర్లో వెళ్తున్నారు. తన సమీప బంధువు రతన్ సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భూమికి 3వేల అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా, లక్నోకు మరో 12 కిలోమీటర్ల దూరం ఉందనగా ఒక గద్ద వచ్చి హెలికాప్టర్ ముందు అద్దాన్ని ఢీకొంది. అయితే పైలట్లు ఎలాగోలా చాపర్‌ను సురక్షితంగా విమానావ్రయంలో ల్యాండ్ చేయగలిగారు. ముందుగానే విషయం తెలియడంతో పలు అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలతో అధికారులు విమానాశ్రయానికి వచ్చారు. గతవారంలో యూపీ మాజీ సీఎం మాయావతి ప్రపయాణిస్తున్న ప్రైవేటు విమానం వెనక చక్రం ల్యాండింగ్ సమయంలో ఇరుక్కుపోయి పెద్ద ప్రమాదం కొద్దిలో తప్పింది.