breaking news
chennnai
-
అమానవీయం : ఆకలితో రోడ్డుపైనే మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరెంటు షాకు తగిలి ఒక కాకి కిందపడితే వందలాది కాకులు చుట్టుముడుతాయి. ఒక వానరం గాయపడితే లెక్కలేనన్ని కోతులు వచ్చి అది కోలుకునేదాకా సపర్యలు చేస్తుంటాయి. పశుపక్ష్యాదుల్లో ఉన్న జాలి, దయా గుణం సాటి మానవుల్లో కనిపించడంలేదు. చెన్నైలో ఒక వ్యక్తి అకారణంగా ప్రాణాలు కోల్పోయాడు. స్వయానా సోదరి సైతం కరోనా వ్యాధిగ్రస్తునిగా ముద్రవేసి రోడ్డు పాలుచేయగా అతడు నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక రూము తీసుకుని రవి (53) కూలీపనులు చేసేవాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రూమును ఖాళీచేసి చెన్నై కుమరన్ నగర్ సమీపం జాఫర్ఖాన్లోని తన సోదరి ఇంట్లో ఉండేవాడు. ఇటీవల అతడికి తీవ్రమైన దగ్గు రావడంతో వైరస్ లక్షణాలుగా అనుమానించి వైద్యపరీక్షలకు వెళ్లివచ్చాడు. సోదరి, పరిసరాల్లోని ప్రజలు అతడిని అనుమతించలేదు. ప్రజలు తీవ్రంగా అడ్డుకోవడంతో అదే ప్రాంతంలో సోదరి ఇంటికి వంద అడుగుల దూరంలో రోడ్డు వారగా ఉండిపోయాడు. కనీసం ఆకలి, దప్పులు తీర్చేందుకు సైతం ఎవ్వరూ అతడి వద్దకు రాలేదు. గమనించుకునేవారు లేక ఆకలితో అలమటించిపోయాడు. ఆరోగ్య కార్యకర్తలు ఇల్లిల్లూ తిరుగుతూ శుక్రవారం ఉదయం జాఫర్‌ఖాన్‌పేటకు వచ్చారు. రోడ్డు వారగా ఉన్న రవి వద్దకు వెళ్లి పరిశీలించగా ప్రాణాలు కోల్పోయి ఉండడంతో గగుర్పాటుకు గురయ్యారు. వెంటనే కార్పొషన్ అధికారలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ వచ్చింది. రోగి మరణించడంతో ఎక్కించుకోనని అంబులెన్స్ డ్రైవర్ నిరాకరించాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు రవి చనిపోగా సాయంత్రం 4.30 గంటల వరకు శవం రోడ్డుపైనే ఉండిపోయింది. ఆ తరువాత చెన్నై కార్పొరేషన్ కోడంబాక్కం మండలాధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తిచేసి రవి భౌతికకాయాన్ని అప్పగించేందుకు సిద్ధం కాగా అతడి సోదరి నిరాకరించారు. అంతేగాక సోదరి ఇంటి యజమాని కూడా అంత్యక్రియలు జరిపేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టం రిపోర్టు రాగా రవికి కరోనా వైరసే కాదు ఎలాంటి అనారోగ్యం లేదని తేలింది. కరోనా అనుమానంతో ఒక వ్యక్తి పట్ల అమానవీయంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోయేందుకు పరోక్షంగా కారకులైన స్థానికులను కొందరు దుయ్యబడుతున్నారు. -
బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా!
ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధం ఉపాధ్యక్షుడిగా గంగరాజు చెన్నైలో నేడు ఏజీఎం చెన్నై: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరోసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వాయిదా పడుతూ వస్తోన్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) చెన్నైలో నేడు (సోమవారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ పడేందుకు దాల్మియా ఒక్కరే నామినేషన్ వేశారు. ఈ పదవికి గట్టి పోటీదారుడిగా నిలిచిన మాజీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు ఈస్ట్ జోన్ నుంచి ఎవరూ మద్దతుగా నిలువలేదు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. గతంలో 2001 నుంచి 2004 వరకు దాల్మియా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు దశాబ్దకాలం అనంతరం ఆయన మరోసారి ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదు. దీంతో ఆయన తనకు అనుకూలమైన వ్యక్తిని ఈ పదవిలో కూర్చోబెట్టేందుకు వేగంగా పావులు కదిపారు. ఈ క్రమంలో ‘క్యాబ్’ అధ్యక్షుడు దాల్మియాను నిలబెట్టేందుకు తన మద్దతుదారుల్లో ఏకాభిప్రాయం సాధించారు. పోటీపడే అవకాశం లేకపోయినా ఈ ఎన్నికల్లో శ్రీనివాసన్ ఓటు వేస్తారు. 70 ఏళ్ల దాల్మియా ఈస్ట్ జోన్ నుంచి రెండు ఓట్లను ప్రభావితం చేయనున్నారు. ఈస్ట్ జోన్లో ఉన్న ఆరు యూనిట్లు శ్రీనికి అనుకూలంగా నిలిచాయి. ఆదివారం ఈ విషయంలో వారు సమావేశం కూడా జరిపారు. ప్రస్తుత కార్యదర్శి సంజయ్ పటేల్‌పై ఇదే పదవి కోసం పవార్ శిబిరం నుంచి హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పోటీ పడనున్నారు. సంయుక్త కార్యదర్శిగా అమితాబ్ చౌదరి (జార్ఖండ్), చేతన్ దేశాయ్ (గోవా) పోటీ పడుతున్నారు. కోశాధికారిగా అనిరుధ్ చౌదరి (హర్యానా), రాజీవ్ శుక్లా (యూపీ) పోటీలో ఉన్నారు. శ్రీనివాసన్ గ్రూపు నుంచి ఐదు ఉపాధ్యక్ష పదవుల కోసం ఎంఎల్ నెహ్రూ (నార్త్‌జోన్), ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు (సౌత్‌జోన్), గౌతమ్ రాయ్ (ఈస్ట్‌జోన్), సమర్జిత్ సింగ్ గైక్వాడ్ (వెస్ట్‌జోన్), సీకే ఖన్నా (సెంట్రల్) పోటీపడుతుండగా... ఇందులో తొలి ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పవార్ గ్రూపు నుంచి ఇవే పదవులకు జ్యోతిరాదిత్య సింధియా (సెంట్రల్), రవి సావంత్ (వెస్ట్) బరిలోకి దిగుతున్నారు. నార్త్ జోన్ నుంచి ఎంపీ పాండవ్ పోటీ చేసే ఆలోచన చేసినా నెహ్రూ కోసం తప్పుకున్నారు.