breaking news
Cheap rice
-
‘చౌక’ దోపిడీ
చౌక దుకాణాల్లో కిలో బియ్యం ధర రూపాయి. అవే బియ్యం బహిరంగ మార్కెట్లో రూ.15 పైమాటే. కిరోసిన్ ధర రూ.15 కాగా, బ్లాక్‌లో రూ.55పైగా పలుకుతోంది. కిలో చక్కెర రూ.13.50 కాగా, బయటి మార్కెట్లో రూ.35 కంటే ఎక్కువే. అంటే..బియ్యంలో రూ.14, కిరోసిన్‌కు రూ.40, చక్కెరలో రూ.31 వరకు అదనపు ఆదాయం. ఇలా అక్రమ వ్యాపారం లావాదేవీలు జిల్లాలో నెలకు రూ. 2 కోట్ల పైగా జరుగుతున్నాయి. అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరా, రెవెన్యూ, విజిలెన్స్, పోలీసు శాఖలు ఉన్నా ఫలితం శూన్యం. ఉదయగిరి, న్యూస్‌లైన్ : చౌక బియ్యం, కిరోసిన్, చక్కెర అక్రమ రవాణా ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకమూల జరుగుతూనే ఉంది. అడపాదడపా తనిఖీల్లో చిక్కుతున్నా గుట్టుచప్పుడు కాకుండా జరిగే వ్యాపారం ఎంతో ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పడంతో కోట్ల రూపాయల విలువైన సరుకులను డీలర్లు దారి మళ్లించి పెద్ద ఎత్తున ఆదాయం గడిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో కొందరు అధికారులకు కూడా భాగస్వామ్యం ఉండడంతో అడ్డే లేకుండా పోతోంది. అక్కడక్కడా పట్టుబడినా, నామమాత్రపు కేసులతో వదిలిపెడుతుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జిల్లాలోని 15 మండల స్టాక్ పాయింట్ల నుంచి 10,476 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,515 కిలో లీటర్ల కిరోసిన్, 3,55,494 కిలోల చక్కెర, 7,10,988 కిలోల పామోలిన్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం బియ్యం, కిరోసిన్, చక్కెర పామోలిన్‌కు గిరాకీ ఉండడంతో కొందరు వ్యాపారులు డీలర్లతో కుమ్మక్కై అధికారుల అండదండలతో సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కొన్ని సరుకులు స్టాక్ పాయింట్ నుంచి చౌక దుకాణాలకు చేరకుండానే దారిమళ్లుతున్నాయి. మరికొన్ని సరుకులు రేషన్ షాపుల నుంచి బయటకు తరలుతున్నాయి. యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా కొందరు డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై ప్రతి నెలా చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. 50 కిలోల బస్తా రూ.50 కాగా, దానిని వ్యాపారులకు రూ.600కు విక్రయిస్తున్నారు. దీనిని వ్యాపారులు మిల్లర్లకు తరలించి రూ.800కు అమ్ముతున్నారు. ఇదే బియ్యాన్ని మిల్లర్లు పాలిష్ చేసి బయట మార్కెట్లో వెయ్యి రూపాయలకుపైగా ధరకు వినియోగదారులకు అంటగడుతున్నారు. చక్కెర, కిరోసిన్దీ ఇదే బాట: రేషన్ షాపులో కిలో చక్కెర రూ.13.50 కాగా బయట మార్కెట్లో రూ.35 అమ్ముతోంది. దీంతో డీలర్లు అరకొరగా లబ్ధిదారులకు చక్కెర పంపిణీ చేసి మిగలిందంతా బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఒక లీటరు, లేనివారికి రెండు లీటర్లు కిరోసిన్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. దీనిని బహిరంగ మార్కెట్లో రూ.55 వరకు అమ్ముతున్నారు. కిరోసిన్ తీసుకునే వారు చాలా తక్కువమంది ఉండడంతో డీలర్లకు పంపిణీ చేసిన కిరోసిన్‌లో 50 శాతం పైగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కొండాపురం, వరికుంటపాడు, సీతారామపురం, వింజమూరు మండలాల్లో చౌక సరుకులను భారీ ఎత్తున డీలర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీనిపై కొండాపురంలో రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. అధికారుల తీరుకు నిదర్శనాలివే.. గతేడాది జూన్‌లో లారీలో అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల బియ్యాన్ని దుత్తలూరు మండలం నర్రవాడ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని, రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. బాధ్యులైన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సెప్టెంబరులో జలదంకి మండలం అన్నవరం వద్ద 125 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యం ఎక్కడివో ఇంత వరకు తేల్చలేదు. అక్టోబరులో కావలి మండలం మద్దూరుపాడు నుంచి అక్రమంగా తరలిస్తున్న 1,400 లీటర్ల కిరోసిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పజెప్పారు. అప్పటికప్పుడు దొంగ బిల్లు సృష్టించి ఆ కేసు మాఫీ చేశారు. కొండాపురం మండలంలో అక్టోబరులో 11 రేషన్ షాపులకు సంబంధించిన సరుకులు ఆయా షాపులకు చేరకుండానే మండల స్టాక్ పాయింట్ నుంచి మాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దానిపై ఇంతవరకు విచారణ జరగలేదు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో వరికుంటపాడు మండలంలో దాదాపు 20 షాపులకు సంబంధించిన బియ్యం, కిరోసిన్, చక్కెరను బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ముచేసుకున్నారు. దీనిపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. -
పేదల బియ్యం.. పెద్దల పరం
=శ్రీకాళహస్తి కేంద్రంగా చౌకబియ్యం అక్రమ వాప్యారం =గిడ్డంగి నుంచే నేరుగా కర్ణాటకకు తరలిస్తున్న వైనం =కమీషన్ల కక్కుర్తిలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మూడు పూటలా పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చౌకబియ్యాన్ని కొందరు పెద్దలు గద్దల్లా తన్నుకు పోతున్నారు. చాలా సంవత్సరాలుగా శ్రీకాళహస్తి కేంద్రంగా బడాబాబులు చౌకబియ్యాన్ని అక్రమంగా బొక్కేస్తూ లక్షలు గడిస్తున్నారు. దీనిపై గతంలో అనేక అక్రమాలు వెలుగుచూడడంతో 10 మందికి పైగా గిడ్డంగి అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. రెండేళ్లలో ఆరుగురు గిడ్డంగి డీటీలను మార్పు చేశారు. ఆరు నెలల క్రితం శ్రీకాళహస్తి ప్రాంతంలో వెయ్యి బస్తాలకు పైగా చౌకబియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు బడా వ్యాపారులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం ఆగినట్టు కనిపించినా తిరిగి 40 రోజులుగా చౌకబియ్యాన్ని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి బియ్యం తరలిపోతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కర్ణాటకకు తరలుతున్న చౌకబియ్యం శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్‌నగర్ కాలనీ కేంద్రంగా చౌకబియ్యం అక్రమ వ్యాపారం సాగుతోంది. చౌకదుకాణం డీలర్లు, గిడ్డంగి నుంచి కిలో బియ్యం రూ.13కు కొనుగోలు చేస్తున్నారు. రవాణా చార్జీలకు రూ.2 చెల్లిస్తున్నారు. కర్ణాటకలో కిలో రూ.25కు విక్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు కిలో బియ్యంపై రూ.10 ఆదాయం పొందుతున్నారు. ఒక్కసారి ఓ లారీలో 15 టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఒక లోడును గమ్యానికి చేరిస్తే ఖర్చులు పోగా రూ.1.5లక్షలు మిగులుతుంది. ఈ ప్రాంతం నుంచి నెలకు 40నుంచి 50 లోడ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు అదేస్థాయిలో కమీషన్లు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏరియా ఆస్పత్రి వద్ద 300 బస్తాలతో వెళుతున్న ఓ బియ్యంలారీని పోలీసులు పట్టుకుని రెవెన్యూ శాఖాధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరేలోపే కమీషన్లు తీసుకుని లారీని వదిలిపెట్టేశారు. గిడ్డంగి నుంచే నేరుగా.. కేవీబీపురం మండలంలోని పెరిందేశం సమీపంలో మరో స్టాక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసుకుని నకిలీ ఆర్వోలతో శ్రీకాళహస్తిలోని గిడ్డంగి నుంచే నేరుగా చౌకబియ్యాన్ని అక్కడకు తరలిస్తున్నారని సమాచారం. అక్కడి నుంచి పిచ్చాటూరు, నగరి మీదుగా కర్ణాటకకు బియ్యాన్ని తరలిస్తున్నారని తెలిసింది. ఇప్పటికైనా నిరుపేదల కడుపులు నింపే చౌకబియ్యం అక్రమార్కుల పరం కాకుండా జిల్లా అధికారులు కాపాడాల్సి ఉంది. వ్యాపారులతో సంబంధంలేదు చౌకబియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నకిలీ ఆర్వోలతో బియ్యాన్ని తరలించడం వాస్తవం కాదు. పట్టణంతోపాటు మా పరిధిలోని ఐదు మండలాల డీలర్లకు అందాల్సిన మొత్తం బియ్యాన్ని ఆర్వోల ద్వారానే పంపుతున్నాం. - రమేష్‌బాబు, గిడ్డంగి డీటీ, శ్రీకాళహస్తి చౌకబియ్యం తరలిస్తే ఊరుకోం పేదలకు అందాల్సిన చౌకబియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఊరుకోం. రెవెన్యూ అధికారులు వ్యాపారుల నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. బియ్యాన్ని కార్డుదారులకు ఇవ్వకుండా డీలర్లు వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. -వీరాస్వామి, తహశీల్దార్ సమాచారం అందితే చర్యలు చౌకబియాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. చిన్నచిన్న పొరబాట్లు ఉంటే సరిచేస్తాం. అక్రమ రవాణాపై ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు రహస్యంగా ఉంచుతాం. అక్రమ రవాణాను అడ్డుకుంటాం. -సంజీవ్‌కుమార్, రూరల్ ఎస్ఐ