breaking news
Central Department of Energy
-
నెలలోగా అపెక్స్ కౌన్సిల్ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెలలోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి.. అజెండాను సిద్ధంచేయాలని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ భేటీని నిర్వహించి.. వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రెండు బోర్డుల చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్‌లతో మంత్రి షెకావత్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బోర్డుల వర్కింగ్ మాన్యువల్, కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అజెండాను పంపాలని ఇరు రాష్ట్రాలను కోరామని.. కానీ, ఇప్పటిదాకా అవి స్పందించలేదని మంత్రికి బోర్డుల చైర్మన్లు వివరించారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. వారంలోగా అపెక్స్ కౌన్సిల్‌కు అజెండా పంపాలని కోరుతూ మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ స్పందించకపోతే ఇటీవల నిర్వహించిన బోర్డుల సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా అజెండా ఖరారుచేసి పంపాలని బోర్డుల చైర్మన్లను ఆదేశించారు. అలాగే, రెండు బోర్డుల పరిధి, వర్కింగ్ మాన్యువల్‌నూ ఖరారు చేస్తామన్నారు. అజెండాను పంపితే.. ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి నెలలోగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి షెకావత్ చెప్పినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. -
‘ఎల్పీజీ సబ్సిడీ’కి గిన్నిస్
ధ్రువపత్రం ప్రధానికి అందజేత న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ల నగదు బదిలీ పథకం గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. ఎల్పీజీ సబ్సిడీని ప్రపంచంలో అతిపెద్ద నగదు బదిలీ పథకంగా పేర్కొంటూ గిన్నిస్ బుక్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చారు. గృహ వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేసేలా గత యూపీఏ ప్రభుత్వం 2013, సెప్టెంబర్ 1న ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ పథకానికి అవాంతరాలు ఎదురవడంతో ఎన్డీఏ ప్రభుత్వం వాటిని పరిష్కరించి దాని పేరు మార్చి ‘పీఏహెచ్ఏఎల్ (ప్రత్యక్ష హస్తాంతరిత్ లాభ్-పహల్)’గా 2015, జనవరి 1 నుంచి అమలుచేసింది. గత జూన్ 30 నాటికి 12.57 కోట్ల మంది ఖాతాలకు నగదు బదిలీ చేస్తూ అతిపెద్ద నగదు బదిలీ పథకంగా ‘పహల్’ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తించిందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 2015, ఏప్రిల్ 1 నాటికి 18.19 కోట్ల మంది నమోదిత వినియోగదారులుండగా, 14.85 కోట్ల మంది క్రియాశీల వినియోగదారులున్నారని తెలిపింది. 3.34 కోట్ల మంది వినియోగదారులను నకిలీగా గుర్తించి వారి కనెక్షన్లను రద్దు చేశారని, దీంతో 2014-15లో రూ. 14,672 కోట్లు ఆదా అయిందని తెలిపింది.