breaking news
cake cut
-
కేక్ కట్ చేసి ఎంత పని చేశాడంటే.. ఊహించని ట్విస్ట్
మైసూరు(కర్ణాటక): పుట్టిన రోజు నాడు ఆ ఇంట విషాదం తాండవించింది. అన్న తమ్ముడు గొడవ పడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు నగరంలోని మండి మొహల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడు దర్శన్ (21). ఫ్లెక్సీ బ్యానర్ల సెంటర్లో పనిచేసే దర్శన్ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ చేస్తుంటాడు. ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా తాగి వచ్చి ఇంట్లో రగడ పడగా అతని తమ్ముడు మందలించాడు. నాకే బుద్ధిమాటలు చెబుతావా? అని అతనితో పోట్లాట పడ్డాడు. ఆ ఆగ్రహంలో దర్శన్ కేక్ తీసుకొని వచ్చి కట్ చేసి, తరువాత గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: భార్య వేధిస్తోంది.. భర్త ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే..? -
మంత్రి.. మర్కట ప్రేమ.. కొత్తబట్టలు తొడిగి.. కేక్ కట్ చేయించి
సాక్షి, శివమొగ్గ (కర్ణాటక): ఇళ్లల్లో పెంపుడు జంతువులకు పుట్టినరోజు, బారసాల, సీమంతాలు జరపడం నేటి రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారింది. ఆ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించాలని యజమానులు కూడా తపిస్తుంటారు. ఇదే కోవలో ఒక కోతికి పుట్టినరోజు నిర్వహించగా, ఒక సీనియర్ మంత్రి హాజరై దానిని ఆశీర్వదించారు. ఈ తతంగం కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్.టి.రోడ్డులో నివాసం ఉండే పార్వతమ్మ అనే మహిళ ఆరేళ్ల నుంచి ఒక వానరాన్ని పెంచుకుంటోంది. సోమవారం సాయంత్రం కోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప, మరో స్వామీజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోతికి కొత్తబట్టలు తొడిగి, దానితోనే కేక్ కట్ చేయించి, తినిపించి ముచ్చట పడ్డారు. రాజకీయ వ్యూహాలతో సొంత, ప్రతిపక్ష పార్టీల నేతలను ముప్పతిప్పలు పెట్టే మంత్రి ఈశ్వరప్పలో ఇంత జంతు ప్రేమ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో అలరిస్తోంది. -
అట్లాస్ కటింగ్స్
ఇది అందరి పండుగ. ఇంతకు మించిన, ఇంతకంటే అందమైన, అందరికీ నచ్చిన హ్యాపీబర్త్‌డే ఇంకొకటి ఉండదు. అందుకే ఈ బర్త్‌డేకి ప్రపంచమంతా కేక్ కట్ చేస్తుంది. మీరూ టేస్ట్ చేయండి. హ్యాపీ బర్త్‌డే 2019 ఇటాలియన్ క్రీమీ కేక్ కావలసినవి: బటర్‌మిల్క్ – ఒక కప్పు; బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; బటర్ – అర కప్పు; షార్టెనింగ్ – అర కప్పు; పంచదార – 2 కప్పులు; కోడిగుడ్లు – 5; కొబ్బరి ఫ్లేక్స్ – ఒక కప్పు; బేకింగ్ పౌడర్ – ఒక టీ స్పూను; మైదా పిండి – 2 కప్పులు; క్రీమ్ చీజ్ – 2 టేబుల్ స్పూన్లు; బటర్ – అర కప్పు; వెనిలా ఎసెన్స్ – ఒక టీ స్పూను; పంచదార పొడి – 4 కప్పులు; లైట్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; వాల్నట్స్ తరుగు – అర కప్పు; స్వీటెన్డ్ ఫ్లేక్డ్ కోకోనట్ – ఒక కప్పు. తయారీ: ∙అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ∙తొమ్మిది అంగుళాల ఎత్తులో గుండ్రంగా ఉన్న మూడు పాన్లకు కొద్దిగా బటర్ పూసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో బటర్ మిల్క్, బేకింగ్ పౌడర్ వేసి బాగా గిలకొట్టి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో క్రీమ్, అర కప్పు బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు గిలకొట్టాలి ∙కోడి గుడ్లు జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙బటర్ మిల్క్ మిశ్రమం, ఒక టీ స్పూను వెనిలా ఎసెన్స్, ఒక కప్పు కొబ్బరి ఫ్లేక్స్, బేకింగ్ పౌడర్, మైదా పిండి జత చేసి అన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు సుమారు పావు గంట సేపు గిలకొట్టాలి ∙ ముందుగా సిద్ధం చేసుకున్న మూడు పాన్లలో సమానంగా పోసి, అవెన్‌లో సుమారు అరగంటసేపు ఉంచాలి ∙ఒక పాత్రలో క్రీమ్, చీజ్, అర కప్పు బటర్, ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, పంచదార పొడి వేసి అన్నీ కలిసి, బాగా క్రీమీగా వచ్చేవరకు గిలకొట్టాలి ∙కొద్దిగా క్రీమ్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙వాల్నట్స్ తరుగు, కొబ్బరి ఫ్లేక్స్ జత చేసి బాగా కలియబెట్టాలి ∙తయారుచేసి ఉంచుకున్న కేక్‌లను అవెన్‌లో నుంచి బయటకు తీయాలి ∙క్రీమ్ మిశ్రమాన్ని ఒక పొరలా సమానంగా పరవాలి, ఆ పైన మరొక కేక్ అమర్చాక, క్రీమ్ మిశ్రమం మళ్లీ ఒక పొరలా వేసి ఆ పైన మరో కేక్ ఉంచాలి ∙చివరగా మొత్తం కేక్‌ను క్రీమ్‌తో కవర్ చేయాలి ∙కావలసిన ఆకారంలో కట్ చేసి చల్లగా అందించాలి. గ్రీక్ యోగర్ట్ కేక్ విత్ ఆరెంజ్ సిరప్ (పోర్టోకలోపిటా) కావలసినవి: యోగర్ట్ (గడ్డ పెరుగు) – పావు కేజీ; కార్న్ ఆయిల్ – ఒకటిన్నర కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; ఆరెంజ్ జ్యూస్ – ఒకటిన్నర కప్పులు; బేకింగ్ పౌడర్ – 4 టీ స్పూన్లు ; కమలా పండు తొక్కల తురుము (ఆరెంజ్ జెస్ట్) – ఒక కప్పు; వెనిలా ఎసెన్స్ – ఒక టీ స్పూను; ఫైలో డఫ్ – అర కేజీ సిరప్ కోసం: నీళ్లు – అర లీటరు; పంచదార – అరకేజీ; కమలాపండు తొక్కల తురుము – తగినంత; దాల్చినచెక్క పొడి – చిటికెడు తయారీ: ∙ఫైలో డఫ్ని ప్యాకెట్లో నుంచి బయటకు తీసి, పెద్ద పళ్లెంలో ఉంచి, 20 నిమిషాల పాటు వదిలేస్తే, బాగా ఎండుతుంది ∙బేకింగ్ ట్రే మీద కొన్ని పోసి, అవెన్‌లో 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర తడి ఆరి పొడిగా అయ్యేవరకు ఉంచాలి ∙అన్నిటినీ అదేవిధంగా ఆరబెట్టాలి ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార, కమలాపండు తొక్కల తురుము, దాల్చిన చెక్క పొడి వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙మంట తగ్గించి, సుమారు పది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙ఒక పెద్ద పాత్రలో కార్న్ ఆయిల్, పంచదార వేసి బాగా గిలకొట్టాలి ∙ పెరుగు, కమలా రసం, కమలా పండు తురుము, వెనిలా ఎసెన్స్ వేసి అన్నీ కలిసేవరకు గిలకొట్టాలి ∙బేకింగ్ పౌడర్ జతచేసి తేలికగా గిలకొట్టాలి ∙ఫైలో డఫ్ షీట్లను చిన్న చిన్న ముక్కలు చేసి, పెరుగు మిశ్రమానికి జత చేయాలి ∙ఎనిమిది అంగుళాల మందం ఉన్న బేకింగ్ ట్రేకి ఆయిల్ బ్రష్ చేసి, ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి ∙180 డిగ్రీల సెల్సియస్ దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఈ ట్రేలను ఉంచి, సుమారు 45 నిమిషాలు బేక్ చేయాలి ∙బయటకు తీశాక, వేడి కేక్ మీద చల్లటి ఆరెంజ్ సిరప్‌ను నెమ్మదిగా పోయాలి ∙బాగా పీల్చుకునేలా చూసుకోవాలి ∙కేక్ చల్లారాక ఫ్రిజ్లోఉంచాలి ∙ఈ కేక్‌ను చల్లగా సర్వ్ చేయాలి. వేగన్ జ్యూయిష్ హనీ కేక్ (ఇజ్రాయిల్) కావలసినవి: గోధుమ పిండి – రెండున్నర కప్పులు; బేకింగ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూను; బేకింగ్ సోడా – 2 టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; లవంగాల పొడి – పావు టీ స్పూను; మేపుల్ సిరప్ – ఒక కప్పు (సూపర్ మార్కెట్లో రెడీగా దొరుకుతుంది); ఆపిల్ సాస్ – ఒక కప్పు; సన్‌ఫ్లవర్ ఆయిల్ – అర కప్పు; వెనిలా ఎసెన్స్ – ఒక టీ స్పూను; కిస్మిస్ – అర కప్పు; బాదం పప్పుల తరుగు – పావు కప్పు తయారీ: ∙అవెన్‌ను 325 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్‌పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి, శొంఠి పొడి, లవంగాల పొడి వేసి బాగా కలపాలి ∙వేరొక పాత్రలో మేపుల్ సిరప్, ఆపిల్ సాస్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి ∙ ముందుగా కలిపి ఉంచుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి ∙కిస్మిస్ జత చేసి మరోమారు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి ∙8 అంగుళాల మందం ఉన్న రెండు బేకింగ్ ట్రేలకి కొద్దిగా బటర్ పూయాలి ∙రెండు భాగాలను రెండు ట్రేలలో సమానంగా ఉంచాలి ∙పైభాగంలో బాదం పప్పుల తరుగు వేసి, ట్రేలను అవెన్‌లో ఉంచి సుమారు 50 నిమిషాల పాటు బేక్ చేయాలి ∙మధ్యమధ్యలో పుల్లతో గాని చాకుతో గాని గుచ్చి, కేక్ సిద్ధమైందో లేదో సరిచూసుకోవాలి. క్లాసిక్ విక్టోరియా స్పాంజ్ కేక్ (ఇంగ్లండ్) కావలసినవి: మైదా పిండి – పావు కేజీ; బేకింగ్ పౌడర్ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్లు – 3 (పెద్దవి); పంచదార పొడి – పావు కేజీ; సాఫ్టెన్డ్ బటర్ – పావు కేజీలో సగం; మార్గరిన్ – 100 గ్రా.; స్ట్రాబెర్రీ జామ్ – ఒక జార్; హెవీ క్రీమ్ – పావు కేజీ తయారీ: ∙అవెన్‌ను 350 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి ∙ఎనిమిది అంగుళాల లోతు ఉన్న రెండు బేకింగ్ పాన్లు తీసుకుని, కింది భాగంలో బటర్ సమానంగా పూయాలి ∙ఒక పెద్ద పాత్రలోకి మైదా పిండి జల్లించుకోవాలి ∙ఒక గిన్నెలో కోడి గుడ్లు, పంచదార, మైదా పిండి, బేకింగ్ పౌడర్, సాఫ్టెనింగ్ బటర్, మార్జరిన్ వేసి ఎలక్ట్రిక్ హ్యాండ్ మిక్సర్‌తో అన్నీ కలిసేలా బాగా గిలకొట్టాలి ∙మిశ్రమం చేతిలోకి తీసుకుంటే జారిపోయేలా బాగా మెత్తగా ఉండాలి ∙ఎలక్ట్రిక్ హ్యాండ్ మిక్సర్ లేకపోతే, చెక్క గరిటెతో బాగా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని రెండు బేకింగ్ ట్రేలలో సమానంగా పరవాలి ∙పై భాగాన్ని చెక్కగరిటెతో మృదువుగా సమానంగా చేయాలి ∙అవెన్‌లో గ్రిల్ మీద ఉంచి సుమారు అర గంట సేపు బేక్ చేయాలి ∙మధ్యలో ఒకసారి చూసుకుని, కేక్ బాగా గోధుమరంగులోకి మారుతున్నట్లు అనిపిస్తే, కొన్ని డిగ్రీలు తగ్గించాలి ∙బాగా పొంగి, లేత గోధుమ రంగులోకి వస్తే కేక్ ఉడికినట్లే ∙అవెన్‌లో నుంచి కేక్‌ను బయటకు తీసి, ఐదు నిమిషాలు చల్లారాక, కేక్‌లను వెనుక వైపుకి తిప్పాలి ∙పూర్తిగా చల్లారాక కేక్‌ను ప్లేట్లో ఉంచాలి ∙స్ట్రాబెర్రీ జామ్‌ను మందంగా పరచాలి ∙రెండో కేక్‌ను కూడా ప్లేట్లోకి తీసుకుని, పైభాగంలో చిక్కటి క్రీమ్‌ను సమానంగా పరచాలి ∙ క్రీమ్, జామ్ ఒక దాని మీద ఒకటి కలిసేలా ఉంచాలి ∙ఐసింగ్ సుగర్, స్ట్రాబెర్రీలతో అలంకరించాలి. ఈ పేరు ఎలా వచ్చింది... క్వీన్ విక్టోరియా పేరు మీద ఈ కేక్‌ను విక్టోరియా స్పాంజ్ కేక్ అని పిలుస్తారు. ఇది ఆవిడకు చాలా ఇష్టమైన కేక్. బెడ్ఫోర్ట్ డచెస్ అయిన అన్నా అనే ఆవిడ, మధ్యాహ్నం టీ తాగాక కేక్ తినే సంప్రదాయాన్ని విక్టోరియాకు పరిచయం చేశారట. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 2012లో క్వీన్ డైమండ్ జూబిలీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు క్వీన్ ఎలిజబెత్ – 2, అలవాటు గా టీ తాగాక, కొద్దిగా కేక్ తిన్నారట. ఫ్రెంచ్ చాకొలేట్ కేక్ కావలసినవి: పంచదార – అర కప్పు; సెమీ స్వీట్ చాకొలేట్ – 10 ముక్కలు (సుమారు 30 గ్రా.); అన్సాల్టెడ్ బటర్ – ముప్పావు కప్పు; వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్లు – 5; జల్లించిన మైదా పిండి – పావు కప్పు; క్రీమ్ ఆఫ్ టార్టార్ – ఒక టిన్; ఉప్పు – కొద్దిగా; మెత్తటి పంచదార పొడి – డస్టింగ్ కోసం తయారీ: ∙అవెన్‌ను 325 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి ∙స్ప్రింగ్‌లా ఉండే 9 అంగుళాల మందం ఉన్న కేక్ టిన్కి బటర్ పూయాలి ∙కొద్దిగా పంచదార పొడి చల్లాలి ∙ఎక్కువగా ఉన్న పంచదారపొడిని తీసేయాలి ∙మూడు టేబుల్ స్పూన్ల పంచదారను పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో చాకొలేట్, బటర్, మిగిలిన పంచదార వేసి కలిపి, స్టౌ మీద ఉంచి, సన్నటి మంట మీద కొద్దిగా ఉడికించాలి ∙చాకొలేట్, బటర్ కరిగి, పంచదార కలిసిపోయేవరకు కలుపుతూ ఉడికించి దింపేయాలి ∙వెనిలా ఎసెన్స్ జత చేసి బాగా కలిపి పక్కన ఉంచి, చల్లారనివ్వాలి ∙కోడి గుడ్డు పచ్చ సొన జత చేసి గిలకొట్టాలి ∙మైదా పిండి జత చేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో కోడి గుడ్డు తెల్ల సొన వేసి బాగా నురగలా వచ్చేవరకు గిలకొట్టాలి ∙క్రీమ్ ఆఫ్ టార్టార్, ఉప్పు జత చే సి, బాగా దగ్గరపడే వరకు కలపాలి. పక్కన ఉంచుకున్న పంచదార జత చేసి బాగా కలిసేవరకు గిలకొట్టాలి ∙ఈ మిశ్రమంలో నుంచి మూడో వంతు మిశ్రమాన్ని చాకొలేట్ మిశ్రమానికి జత చేశాక, మొత్తం మిశ్రమాన్ని తెల్ల సొన మిశ్రమంలో వేసి కలపాలి ∙బటర్ పూసుకున్న ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, మిశ్రమాన్ని జాగ్రత్తగా బబుల్స్ లేకుండా సమానంగా పరిచి అవెన్‌లో ఉంచాలి ∙సుమారు గంట సేపు బేక్ చేయాలి ∙అర గంట తరవాత ఒకసారి చెక్ చేసుకోవాలి ∙ఒకవేళ కేక్ సమానంగా పొంగినట్లు లేకపోతే, అరగంట తరవాత కేక్‌ను తిరగేయాలి ∙కేక్ పగిలిపోయినట్లుగా కాని, బాగా గోధుమరంగులోకి మారుతున్నట్లు గాని అనిపిస్తే కేక్ మీద ఒక సిల్వర్ ఫాయిల్ ఉంచాలి ∙కేక్ తయారైన తరవాత వైర్ కూలింగ్ ర్యాక్ మీదకు మార్చి, పూర్తిగా చల్లార్చాక, బేస్ తీసేయాలి (చల్లారక ముందే తీయకూడదు). -
కేకు తెస్తానని వెళ్లి అదృశ్యం
మోమిన్‌పేట(వికారాబాద్): కేక్ తీసుకొస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన షేక్ సికిందర్ డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, డిసెంబరు 31న రాత్రి నూతన సంవత్సర వేడుకల కోసం స్థానికంగా కేకు కొనుగోలు చేసుకొని వస్తానని ఇంట్లో భార్య శభానాబేగంతో చెప్పి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబీకులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భయాందోళనకు గురైన సికిందర్ భార్య గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రణయ్‌కుమార్ తెలిపారు. మరో ఘటనలో.. మాడ్గుల(ఆమనగల్లు): ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని నర్సాయిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై గిరిష్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి రాములు(35) ఈనెల 3న పనినిమిత్తం మాడ్గులకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. అనంతరం కొద్దిసేపు ఇంటి వద్ద ఉన్న ఆయన కనిపించకుండా పోయాడు. రాములు కోసం కుటుంబసభ్యులు గ్రామంలో, బంధువుల వద్ద గాలించినా ఆచూకీ లేకుండా పోయింది. దీంతో గురువారం రాములు సోదరుడు కరుణాకర్ మాడ్గుల పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిష్‌కుమార్ పేర్కొన్నారు. -
చెట్టుకు పుట్టిన రోజు
మేడ్చల్: గత ఏడాది ఇదే రోజు నాటిన మొక్కకు అధికారులు, విద్యార్థులు కేక్ కట్‌చేసి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. మేడ్చల్‌లోని న్యూ లిటిల్ లిల్లి హైస్కూల్లో గత ఏడాది ఇదే రోజు నిర్వహించిన హరితహారంలో స్థానిక తహశీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని ఓ మొక్క నాటారు. అది ఏపుగా పెరిగింది. దీంతో మంగళవారం స్కూల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు తహశీల్దార్, సీఐ రాజశేఖర్‌రెడ్డి, నగరపంచాయతీ కమిషనర్ రాంరెడ్డిలు స్కూల్‌కు వెళ్లి విద్యార్థుల సమక్షంలో ఆనాటి మొక్క వద్ద కేక్ కట్‌చేసి పుట్టినరోజు వేడుక చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మంజులప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు హరితహారం సందర్భంగా కిష్టాపూర్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి పాఠశాల ఆవరణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.