breaking news
broadcast stalled
-
పలు జిల్లాలో గంటపాటు కేబుల్ ప్రసారాల నిలిపివేత
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం గంటపాటు కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్టు ఏపీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ తెలిపింది. ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లపై విజయవాడ జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం విజయ కృష్ణన్ అధికారులతో జరిగిన ఫోన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై పరుష పదజాలన్ని వాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఫైబర్ గ్రిడ్‌ను ప్రమోట్ చేయడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విజయ కృష్ణన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై కేబుల్ ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు విధాలుగా తమ ఆందోళన చేపడుతున్నారు. జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మగౌరం చాటుకున్నందుకు ధన్యవాదాలు.. కేబుల్ ప్రసారాలు నిలిపివేసినందుకు ఎమ్మెస్వోలకు, కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ఎమ్మెస్వోల సంఘం ధన్యవాదాలు తెలిపింది. కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకుని ఆత్మగౌరం చాటుకున్నారని అభిప్రాయపడింది. అత్యంత అవమానకరంగా తిట్టిన, బెదిరించిన ఐఏఎస్ అధికారి వైఖరికి సరైన రీతిలో నిరసన తెలిపినట్టు వెల్లడించారు. -
ఏపీలో నిలిచిన సాక్షి టీవీ ప్రసారాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సాక్షి టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే ఈ ప్రసారాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. ప్రసారాలను అకారణంగా నిలిపివేయడం సరికాదని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ అన్నారు. ఇది భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్య అని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు అమర్నాథ్ మండిపడ్డారు. 'సాక్షి' టీవీ ప్రసారాలు నిలిపివేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూలు ఖండించాయి. 'సాక్షి' ప్రసారాలు నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని మండిపడ్డాయి. రాజకీయ ఒత్తిళ్లుకు లొంగకుండా తక్షణమే ప్రసారాలు పునరుద్దరించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు మల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఐపీ సుబ్బారావు, ఐజీయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు డిమాండ్ చేశారు.