breaking news
Brisbane Open doubles title
-
శభాష్... సానియా
• బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్న భారత స్టార్ • బెథానీకి నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన వైనం • 91 వారాల తర్వాత చేజారిన అగ్రస్థానం • ఇండో–అమెరికన్ జంట ఖాతాలో రూ. 31 లక్షల 89 వేల ప్రైజ్‌మనీ విజయం సాధిస్తే ఆమె ఖాతాలో మరో టైటిల్ చేరుతుంది. అదే సమయంలో వరుసగా 91 వారాల నుంచి ఉన్న టాప్ ర్యాంక్ కూడా చేజారుతుంది. అదీ తన భాగస్వామిగా ఉన్న సహచర క్రీడాకారిణికి అగ్రస్థానం ఖాయమవుతుంది. ఇలాంటి సంకట పరిస్థితిని ఎదుర్కొన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాను నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోతాననే విషయాన్ని లెక్క చేయలేదు. గొప్ప క్రీడాస్ఫూర్తితో, ఆద్యంతం సమన్వయంతో ఆడుతూ విజయాన్ని దక్కించుకుంది. అమెరికాకు చెందిన తన డబుల్స్ పార్ట్‌టైమ్ భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ చిరకాల స్వప్నం నెరవేరేందుకు ప్రత్యక్షంగా సహకరించి ఔరా అనిపించింది. బ్రిస్బేన్: కొత్త ఏడాదిని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఘనంగా ప్రారంభించింది. బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ బ్రిస్బేన్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తన డబుల్స్ రెగ్యులర్ భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) అందుబాటులో లేకపోవడంతో... తన పార్ట్‌టైమ్ భాగస్వామి బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలసి సానియా ఈ టోర్నీలో ఆడింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ ఈ ఇండో–అమెరికన్ జంట విజేతగా నిలిచింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ టైటిల్ పోరులో సానియా–బెథానీ ద్వయం 6–2, 6–3తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా–ఎలీనా వెస్నినా (రష్యా) జంటను ఓడించింది. బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గడం సానియాకిది మూడోసారి. గతంలో ఆమె బెథానీతోనే కలసి 2013లో, హింగిస్‌తో జతగా 2016లో ఈ టైటిల్‌ను గెలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 41వ డబుల్స్ టైటిల్‌కాగా... బెథానీ ఖాతాలో ఇది 23వ డబుల్స్ టైటిల్. విజేతగా నిలిచిన సానియా–బెథానీ జంటకు 46,796 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 31 లక్షల 89 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన మకరోవా–వెస్నినా జోడీకి 24,950 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 17 లక్షలు), 305 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి. సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో బెథానీకి అధికారికంగా నంబర్‌వన్ స్థానం లభిస్తుంది. క్వార్టర్ ఫైనల్లో మినహా మిగతా రెండు మ్యాచ్‌ల్లో అలవోకగా నెగ్గి ఫైనల్‌కు చేరుకున్న సానియా–బెథానీ జంటకు ఫైనల్లో ఒకింత ప్రతిఘటన ఎదురైంది. అయితే కీలక సమయాల్లో సహనం కోల్పోకుండా ఆడిన ఈ ఇండో–అమెరికన్ జంటకు విజయం దక్కింది. తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సానియా–బెథానీ తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయారు. కేవలం బ్రిస్బేన్ టోర్నీకి మాత్రమే బెథానీతో సానియా జత కట్టింది. సోమవారం మొదలయ్యే సిడ్నీ ఓపెన్‌లో, ఈనెల 16న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బార్బరా స్ట్రికోవాతో కలసి సానియా ఆడుతుంది. ఈ రెండు టోర్నీల్లోనూ సానియా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. లెక్క సరిచేశారు... గత ఏడాది అక్టోబరులో జరిగిన సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో బెథానీకి టాప్ ర్యాంక్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)తో కలసి ఈ టోర్నీలో ఆడిన బెథానీ ఫైనల్లో గెలిచి ఉంటే ఆమెకు నంబర్‌వన్ ర్యాంక్ దక్కేది. కానీ మకరోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో బెథానీ–సఫరోవా ద్వయం ఓడిపోవడంతో ఈ అమెరికా క్రీడాకారిణి కల చెదిరింది. అదే టోర్నీలో సానియా–హింగిస్ జంట సెమీఫైనల్లో మకరోవా–వెస్నినా చేతిలో ఓడిపోయింది. అయితే బ్రిస్బేన్ ఓపెన్‌లో విజయం సాధించి సానియా, బెథానీ ఒకేసారి రష్యా జంటపై బదులు తీర్చుకున్నారు. సానియా ర్యాంక్ ఎలా చేజారిందంటే.... ఈ టోర్నీకి ముందు సానియా 8,135 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... బెథానీ 7,805 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. వీరిద్దరి మధ్య 330 పాయింట్ల తేడా ఉంది. అయితే గత ఏడాది బ్రిస్బేన్ ఓపెన్‌లో సానియా టైటిల్ గెలిచినందుకు ఆమె ఖాతా నుంచి 470 పాయింట్లు కోత కాకుండా ఉండాలంటే ఈ టైటిల్‌ను సానియా నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సానియా టైటిల్ నిలబెట్టుకోవడంతో ఆమె పాయింట్లలో ఎలాంటి మార్పు ఉండదు. మరోవైపు బెథానీ బ్రిస్బేన్ ఓపెన్‌లో ఆడలేదు కాబట్టి ఆమె ఖాతాలో అదనంగా 470 పాయింట్లు చేరాయి. ఫలితంగా ఐదో ర్యాంక్‌లో ఉన్న బెథానీ ఒక్కసారిగా నాలుగు స్థానాలు ఎగబాకి 8,275 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించనుంది. సెరెనా, వీనస్ తర్వాత... డబ్ల్యూటీఏ 1984లో డబుల్స్ ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టాక నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న 34వ క్రీడాకారిణిగా బెథానీ గుర్తింపు పొందనుంది. 2010 జులైలో సెరెనా, వీనస్ తర్వాత డబుల్స్‌లో టాప్ ర్యాంక్‌లో నిలువనున్న అమెరికా ప్లేయర్‌గా బెథానీ ఘనత వహించనుంది. -
సానియా-హింగిస్ ‘సిక్సర్’
♦ వరుసగా ఆరో టైటిల్ నెగ్గిన ఇండో-స్విస్ ద్వయం ♦ బ్రిస్బేన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం ♦ ఫైనల్లో కెర్బర్-పెట్కోవిచ్ జంటపై గెలుపు బ్రిస్బేన్: ఊహించినట్టే కొత్త ఏడాదిని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్ టైటిల్‌తో ప్రారంభించారు. బ్రిస్బేన్ ఓపెన్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జోడీ 7-5, 6-1తో ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా జంటకు 45,990 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 30 లక్షల 76 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ♦ జోడీగా సానియా-హింగిస్‌లకిది వరుసగా ఆరో టైటిల్. గతేడాది యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ, వుహాన్, బీజింగ్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్స్ సాధించిన సానియా-హింగిస్ ఈ ఏడాది ఆడిన తొలి టోర్నీలోనే విజేతగా నిలిచారు. ♦ ఓవరాల్‌గా సానియా-హింగిస్ జంటకిది 10వ డబుల్స్ టైటిల్. సానియా కెరీర్లో ఇది 33 వ డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్‌కు 51వది. ఈ ఇండో-స్విస్ జోడీకిది వరుసగా 26వ విజయం. మరోవైపు సానియా డబుల్స్ కెరీర్లో ఇది 401వ గెలుపు, హింగిస్‌కు 382వ విజయం. ♦ 69 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా-హింగిస్ రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. తొలి సెట్లో ఒకదశలో సానియా జంట 2-4తో వెనుకబడింది. అయితే వెంటనే తేరుకున్న ఈ ఇండో-స్విస్ జంట స్కోరును 4-4తో సమం చేసింది. ఆ తర్వాత 12వ గేమ్‌లో ప్రత్యర్థి జంట సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ ద్వయం తొలి సెట్‌ను 43 నిమిషాల్లో దక్కించుకుంది. ఇక రెండో సెట్లో ప్రపంచ నంబర్‌వన్ జంటకు ఎదురులేకపోయింది. పూర్తి సమన్వయంతో ఆడిన సానియా-హింగిస్ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ♦ బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడం సానియా, హింగిస్‌లకిది రెండోసారి. గతేడాది సబైన్ లిసికి (జర్మనీ) భాగస్వామిగా హింగిస్ టైటిల్ నెగ్గగా... 2013లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) భాగస్వామిగా సానియా ఈ టైటిల్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. ♦ 1994 తర్వాత మహిళల డబుల్స్‌లో ఓ జంట వరుసగా 26 మ్యాచ్‌లు నెగ్గడం ఇదే ప్రథమం. చివరిసారి 1994లో నటాషా జ్వెరెవా (బెలారస్)-గీగీ ఫెర్నాండెజ్ (అమెరికా) ద్వయం వరుసగా 28 మ్యాచ్‌లు గెలిచింది. ‘‘ప్రత్యర్థి జంట పటిష్టంగా ఉండటంతో మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిం చాలని తెలుసు. ఆరంభంలో వెనుకబడ్డా ఆ తర్వాత తేరుకున్నాం. 12వ గేమ్‌లో సర్వీస్ బ్రేక్ సాధించడం మ్యాచ్‌లో కీలక మలుపుగా భావిస్తున్నాను.’’ -సానియా మీర్జా ‘‘సీజన్‌నులో విజయంతో ప్రారంభించడం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్రిస్బేన్ టైటిల్ నెగ్గడం గొప్పగా అనిపిస్తోంది. వచ్చే వారం సిడ్నీ ఓపెన్‌లోనూ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాం. అక్కడా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం.’’ -మార్టినా హింగిస్