breaking news
blue chips results
-
ఒడిదుడుకుల్లోనే మార్కెట్!
* బ్లూచిప్స్ ఫలితాలు, బిహార్ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం * ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఈ వారం కూడా ఒడిదుడుకులమయంగానే ఉండొచ్చని నిపుణులంటున్నారు. దిగ్గజ కంపెనీలు... టాటా మోటార్స్, సిప్లా, టాటా స్టీల్, ఎస్బీఐ, ఓఎన్జీసీల క్యూ2 ఫలితాలు, బిహార్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్, ప్రపంచ స్టాక్‌మార్కెట్ల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు.. వంటివి ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వాహన షేర్లపై దృష్టి.. అక్టోబర్ నెల అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నందున వాహన షేర్లపై దృష్టి ఉంటుంది. పండుగ సీజన్ సందర్భంగా భారీగా డిస్కౌంట్లు, కొత్త మోడళ్ల కారణంగా వాహన విక్రయాలు పుంజుకుంటాయని, ఈ మేరకు వాహన కంపెనీల షేర్లపై సానుకూల ప్రభావం ఉంటుందని విశ్లేషకుల అంచనా. డీఎల్ఎఫ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెయిల్ వంటి కంపెనీలు కూడా క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఇప్పటిదాకా వెలువడిన కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొన్నారు. మార్కెట్ ముందుకు సాగాలంటే కంపెనీలు మంచి ఆర్థిక ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ నెల 5న(గురువారం) బిహార్ ఎన్నికలు ముగుస్తాయని, 8న(ఆదివారం) ఫలితాలు వస్తాయని, ఫలితాలకు ముందు వెలువడే ఎగ్జిట్ పోల్స్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులంటున్నారు. మొత్తం మీద ఈ వారం ఒడిదుడుకులు తప్పవనేది వారి అభిప్రాయం. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2.9 శాతం క్షీణించి 26,657 పాయింట్లకు పడిపోయింది. బిహార్ ఫలితాలు.. బిహార్ ఎన్నికల ఫలితాలు మార్కెట్‌కు సమీపకాలంలో చోదక శక్తి అవుతుందని జియోజిత్ బీఎన్పీ పారిబా హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలపై ఆందోళన మార్కెట్‌పై ఒత్తిడి పెంచనున్నదని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు, బిహార్ ఎన్నికల ఫలితాల కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్‌కు నిర్ణయాత్మక వారం కానున్నదని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ అంశాలకు వస్తే, చైనా, అమెరికా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) డేటా, అమెరికా నిరుద్యోగ గణాంకాలు, ఇంగ్లండ్ కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయం.. ప్రభావం చూపించవచ్చు. 11న ముహురత్ ట్రేడింగ్... స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు దీపావళి రోజు(11న)న ప్రత్యేకంగా ‘ముహురత్ ట్రేడింగ్’ను నిర్వహించనున్నాయి. ఈ ట్రేడింగ్ సాయంత్రం 5:45 నుంచి 6:45 గంటల వరకూ జరుగుతుందని ఎక్స్ఛేంజీలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. ఏడు నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు.. విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లో గత నెలలో రూ.22,350 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ఇది ఏడు నెలల గరిష్ట స్థాయి. ఆర్బీఐ రేట్ల కోత, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు ఆశావహంగా ఉండడం, ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల వాటాను ఆర్బీఐ పెంచడం.. దీనికి కారణాలు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈక్విటీ మార్కెట్లోకి రూ.6,650 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.15,700 కోట్ల చొప్పున నికర పెట్టుబడులు వచ్చాయని డిపాజిటరీ సంస్థల గణాంకాలు వెల్లడించాయి. చైనాలో ఆర్థిక మందగమనం ఆందోళన, ఫెడ్ రేట్ల పెంపుపై అనిశ్చితితో విదేశీ ఇన్వెస్టర్లు క్యాపిటల్ మార్కెట్ నుంచి ఆగస్టులో రూ.5,784 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.17,524 కోట్లు... మొత్తం ఈ రెండు నెలల్లో రూ.23,000 కోట్ల చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. 1997 నుంచి చూస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విదేశీ ఇన్వెస్టర్లు అధికంగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ.27,597 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.55,096 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. -
ఆర్బీఐ, ఫెడ్ నిర్ణయాలపై దృష్టి
న్యూఢిల్లీ: ఈ నెలాఖర్లో పరపతి విధాన సమీక్షలను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్)లపై స్టాక్ మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం మార్కెట్ల గమనాన్ని ఈ రెండు అంశాలూ ప్రధానంగా నిర్దేశించనున్నట్లు తెలిపారు. వీటితోపాటు బ్లూచిప్ కంపెనీలు ప్రకటించనున్న క్యూ3 ఫలితాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. ఈ నెల 28న ఆర్బీఐ పరపతి సమీక్షను చేపట్టనుండగా... 28, 29 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమీక్ష నిర్వహించనుంది. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోళ్ల(సహాయక ప్యాకేజీ)లో 10 బిలియన్ డాలర్ల కోత(ట్యాపరింగ్)ను ఈ నెల నుంచే మొదలుపెడుతున్నట్లు ఫెడ్ ఇదివరకే ప్రకటించడం తెలిసిందే. భారీ హెచ్చుతగ్గులు... ఈ నెల 30న(గురువారం) జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు ముగియనుండటంతో మార్కెట్లు భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నదని విశ్లేషకులు తెలిపారు. ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్, నిఫ్టీలలో దీర్ఘకాలిక బుల్లిష్ ధోరణి కనిపిస్తున్నందున కనిష్ట స్థాయిలవ ద్ద కొనుగోళ్లకు అవకాశముంటుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంకేతాలు, క్యూ3 ఫలితాలు, ఆర్బీఐ పాలసీ సమీక్ష వంటి అంశాలు సమీప కాలానికి మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పారు. ఈ వారంలో నిఫ్టీకి 6,350 స్థాయి కీలకంగా నిలవనుందని అంచనా వేశారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు పుంజుకుంటాయని చెప్పారు. బ్లూచిప్స్ ఫలితాలు... ఈ వారం పలు బ్లూచిప్ కంపెనీలు క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ జాబితాలో... ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్, బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, పీఎన్బీ, ఆటో దిగ్గజాలు మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, మెటల్ దిగ్గజాలు సెసా స్టెరిలైట్, జిందాల్ స్టీల్, ఇంధన దిగ్గజాలు ఎన్టీపీసీ, గెయిల్‌తోపాటు, మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.