breaking news
Bhopal seat
-
బీజేపీ మాజీ సీఎంకు టికెట్ ఆఫర్ చేసిన కాంగ్రెస్
భోపాల్ : రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మరింత ఉత్సాహంగా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బాబులాల్ గౌర్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. తనను భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయమని కోరినట్లు బాబులాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ నన్ను కలిశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున భోపాల్ నుంచి పోటి చేయమని కోరిన’ట్లు బాబులాల్ తెలిపారు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడే ఏమి చెప్పలేనని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని దిగ్విజయ్‌తో చెప్పినట్లు తెలిపారు బాబులాల్. మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో భంగపడిన బీజేపీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్లను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిస్తోంది. -
మోడీ ఫెయిల్, రంగంలోకి దిగిన సుష్మ
న్యూఢిల్లీ : గాంధీనగర్ టికెట్ కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న బీజేపీ అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీని బుజ్జగించేందుకు ఆపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అద్వానీ మాత్రం భోపాల్ స్థానం నుంచే బరిలో దిగుతానని పట్టుతో ఉన్నట్లు సమాచారం. టికెట్ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం ఉదయం అద్వానీకి కలిసి గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని కోరారు. అయితే అందుకు అద్వానీ ససేమిరా అన్నట్లు సమాచారం. దాంతో ఆ పార్టీ నేతలు సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. అగ్రనేతను బుజ్జగించే పనిలో పడ్డారు. మరి అద్వానీ పట్టువీడతారాల లేదా....అనేది తెలియాల్సి ఉంది. -
అద్వానితో నరేంద్ర మోడీ మంతనాలు
న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గురువారం ఉదయం ఆపార్టీ అగ్రనేత అద్వానీని కలిశారు. అద్వానీ నివాసంలో జరిగిన ఈ భేటీలో గాంధీనగర్ సీటు వివాదంపై చర్చించినట్లు సమాచారం. కాగా భోపాల్ నుంచే బరిలోకి దిగుతానని అద్వానీ ఈ సందర్భంగా మోడీకి స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా సమావేశపు వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఇక నరేంద్ర మోడీతో ఉన్న విభేదాల కారణంగా అయిదుసార్లు పోటీ చేసిన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానానికి బదులుగా ఈసారి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బరిలో దిగాలనుకున్న అద్వానీ ఆశలపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. పార్టీలోని సీనియర్లకు కోరుకున్న చోట సీట్లు కేటాయిస్తున్న తరహాలో తనకు కూడా భోపాల్ స్థానాన్ని కేటాయించాలన్న ఆయన డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అద్వానీ, మోడీల మధ్య నెలకొన్న విభేదాలను ప్రతిఫలించినట్లు అయింది. -
అద్వానీకి భంగపాటు
-
అద్వానీకి భంగపాటు
అగ్ర నేత భోపాల్ సీటు ఆశలపై నీళ్లు గాంధీనగర్ నుంచే ఆయన తిరిగి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం మోడీ పోటీ చేసే రెండో స్థానం వడోదరా 67 మంది అభ్యర్థులతో ఐదో జాబితా న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ(86)కి సొంత పార్టీ నుంచే ఘోర అవమానం ఎదురైంది. గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఉన్న విభేదాల కారణంగా ఐదుసార్లు పోటీ చేసిన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానానికి బదులుగా ఈసారి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బరిలో దిగాలనుకున్న ఆయన ఆశలపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నీళ్లుచల్లింది. పార్టీలోని సీనియర్లకు కోరుకున్న చోట సీట్లు కేటాయిస్తున్న తరహాలో తనకు కూడా భోపాల్ స్థానాన్ని కేటాయించాలన్న ఆయన డిమాండ్‌ను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మోడీ కోసం భోపాల్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధమని పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ నేత కైలాశ్ జోషీ ప్రకటించినా బీజేపీ అధిష్టానం మాత్రం అద్వానీకి ఆ సీటును కేటాయించేందుకు ససేమిరా అంది. అద్వానీ ఈసారి కూడా గాంధీనగర్ స్థానం నుంచే తిరిగి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అద్వానీ, మోడీల మధ్య నెలకొన్న విభేదాలను ప్రతిఫలించినట్లు అయింది. మరోవైపు మోడీ పోటీ చేయబోయే రెండో స్థానంగా గుజరాత్‌లోని వడోదరా సీటును పార్టీ ఖరారు చేసింది. మోడీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి పోటీ చేయనుండటం తెలిసిందే. రోజంతా చర్చోపచర్చలు... అద్వానీకి కేటాయించే సీటు విషయంలో నిర్ణయం తీసుకోవడంపై బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అయితే ఈ సమావేశానికి అద్వానీ హాజరుకాలేదు. సమావేశంలో మోడీ మాట్లాడుతూ...అద్వానీ తిరిగి గాంధీనగర్ స్థానం నుంచే పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ భేటీకి ముందు అద్వానీ...పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఇతర సీనియర్ నేతల తరహాలో తనకు కూడా నచ్చిన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే హక్కు ఉండాలని అద్వానీ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, అద్వానీ తిరిగి గాంధీనగర్ నుంచి పోటీ చేసేలా బుజ్జగించేందుకు ఎన్నికల కమిటీ సమావేశానంతరం సుష్మాస్వరాజ్, గడ్కారీలు అద్వానీ ఇంటికెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తనను గాంధీనగర్ నుంచి పోటీకి దింపడంపై అద్వానీ వారి వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత సుష్మా, గడ్కారీలు రాజ్‌నాథ్ ఇంటికి వెళ్లి అద్వానీ అసంతృప్తి గురించి తెలిపారు. మరోపక్క మోడీ... ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు వెళ్లి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో భేటీ అయ్యారు. అద్వానీకి గాంధీనగర్ సీటును ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో చెప్పి, ఎన్నికల వ్యూహం తదితరాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భాగవత్ అద్వానీతో మాట్లాడినట్లు వార్తలొచ్చినా సంఘ్, బీజేపీలు ధ్రువీకరించలేదు. మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అద్వానీ నిరసన స్వరం వినిపిస్తున్నారు. గాంధీనగర్ నుంచి పోటీపై అద్వానీ అనాసక్తికి సంబంధించి రెండు వాదనలు ఉన్నాయి. మోడీతో బెడిసిన సంబంధాల నేపథ్యంలో తన ఓటమికి కుట్ర జరుగుతుందేమోనని అద్వానీ భయపడుతున్నారనేది ఒక వాదన కాగా, గెలుపు కోసం మోడీపై ఆధారపడుతున్నాననే భావన రాకూడదని అద్వానీ ఆ సీటును వద్దనుకున్నారన్నది మరో వాదన. మథుర బరిలో హేమమాలిని ఎన్నికల కమిటీ సమావేశానంతరం బీజేపీ నేత తార్వాచంద్ గెహ్లాట్ 67 మంది అభ్యర్థుల పేర్లతో ఐదో జాబితాను ప్రకటించారు. యూపీలోని మథుర స్థానం నుంచి నిన్నటితరం బాలీవుడ్ హీరోయిన్ హేమమాలిని, రాజస్థాన్‌లోని జైపూర్ (రూరల్) స్థానం నుంచి ఒలింపిక్ పతక విజేత రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ పోటీచేస్తారన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దొమారియాగంజ్ (యూపీ) ఎంపీ జగదాంబికా పాల్‌కు ఈ జాబితాలో అదే స్థానం నుంచి టికెట్ లభించింది. కాగా, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వరుసగా 15, 17 మంది అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించింది.