అట్లూరి రామారావు కన్నుమూత
నిన్నటి తరం సినీ ప్రముఖుడు, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’లో సినీ నిర్మాణ బాధ్యతలను దీర్ఘకాలం పర్యవేక్షించిన అనుభవజ్ఞుడు అట్లూరి రామారావు కన్ను మూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పల్లె జీవితపు స్వచ్ఛతకూ, అచ్చతెలుగు తనానికీ నిదర్శనంగా తెల్లటి పంచె, లాల్చీలోనే ఎప్పుడూ కనిపించే అట్లూరి క్రమశిక్షణ, సమయపాలన, పద్ధతిగా కార్యనిర్వహణకు మారుపేరు.
1925 జూన్ 26న ఆయన జన్మించారు. పత్రికాధి పతి రామోజీరావుదీ, అట్లూరిదీ ఒకే ఊరు. కృష్ణాజిల్లా గుడివాడ దగ్గరలోని పెదపారుపూడికి చెందిన ఆయన, రామోజీ ‘మార్గ దర్శి’ ఆరంభించిన తొలి నాళ్ళ నుంచి వెంట నిలిచిన సన్నిహితుల్లో ఒకరు. ‘ఉషాకిరణ్ మూవీస్’ పేరిట చిత్ర నిర్మాణా నికి విస్తరించినప్పటి నుంచి ఆ వ్యవహారాల్లో కుడిభుజంలా వ్యవహరించారు. ఆ సంస్థలో జంధ్యాల ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984) మొదలు ‘మయూరి’, ‘ప్రతిఘటన’ (’85), ‘మౌనపోరాటం’(’89), ‘అశ్వని’ (’91) లాంటి హిట్ చిత్రాలు అట్లూరి చిత్ర నిర్మాణ నిర్వహణలో తయారైనవే. పత్రికావార్త ఆధారంగా నర్తకి సుధాచంద్రన్ను అన్వేషించి ‘మయూరి’ లాంటివి తీయడంలో అట్లూరిది ప్రధానపాత్ర. సంగీత దర్శకుడు కీరవాణిని పరిచయం చేయడంలోనూ ఆయన పాత్ర.
నిజానికి, అట్లూరి చదువుకున్నది కేవలం 5వ తరగతి వరకే. అయితే, ఆ రోజుల్లోని హిందీ భాషా ప్రచార ఉద్యమం వేడితో హిందీ చదివారు. అప్పట్లో గాంధీ గారిని కలవడమే కాక, హిందీ ప్రచారానికి చేసిన కృషికి గాంధీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. కొంతకాలం హిందీ అధ్యాపకత్వం కూడా చేశారు. ప్రజా నాట్యమండలి సభ్యుడూ, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త అయిన పెరుమాళ్ళుతో స్నేహం చేసి, రంగస్థలంపై స్త్రీ పాత్రలు పోషించేవారు. దక్షిణ భారత హిందీ ప్రచారసభ వారు హిందీలోకి అనువదించిన తెలుగు నాటకాల్లో నటించారు.
‘మాభూమి’ తదితర ప్రయోజనాత్మక నాటకాల్లో నటించారు. తరువాత కాలంలో రామోజీ పిలుపు మేరకు ఆయన సంస్థలో చేరి, తొలుత వివిధ పత్రికల ప్రచురణ చూసేవారు. సినీ నిర్మాణబాధ్యతలు చేపట్టాక అడపాదడపా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ, నటనాభిరుచిని కొనసాగించారు. బ్లాక్ అండ్ వైట్ యుగంలోనే ఎన్టీఆర్ ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రంలో సబ్‌రిజిస్ట్రార్ పాత్రలో ఆయన కనిపించారు.
‘ప్రతిఘటన’లో గాంధేయవాది పాత్రలో, ‘మౌనపోరాటం’లో హీరో తండ్రి పాత్రలో ఆదర్శవాదిగా తెరపై మెరిశారు. ఆ మధ్య హీరో వేణుతో వచ్చిన ‘సదా మీ సేవలో’నూ నటించారు. మీద పడుతున్న వయసు కారణంగా 2000ల నుంచి క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకున్నారు. అట్లూరి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.