breaking news
Artical-3
-
ఆర్టికల్-3ని సవరించి, చర్చించాలి: జగన్
న్యూఢిల్లీ : లోక్‌సభలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు తీర్మానాలను ఇచ్చింది. కేంద్రానికి అపరిమిత అధికారాలను ఇస్తోన్న ఆర్టికల్-3ని సవరించాలని, దీనిపై చర్చ జరగాలని కోరింది. అలాగా అవిశ్వాసంపై చర్చ జరగాలని పార్టీ తీర్మానాన్ని ఇచ్చింది. ఓట్ల కోసం, సీట్ల కోసం తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని అడ్డుకోడానికే ఈ ప్రయత్నాలని పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. వైఎస్ జగన్ రేపు పాట్నా వెళ్లనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో సమావేశమయి.. సమైక్యానికి మద్దతివ్వాల్సిందిగా కోరనున్నారు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై అడుగు ముందుకు పడకుండానే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహ, కాంగ్రెస్‌కు చెందిన రాయపాటి సాంబశివరావు, టీడీపీకి చెందిన కొనకళ్ల నారాయణ రావు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తనకు అందాయని స్పీకర్ మీరా కుమార్ ఈ రోజు కూడా సభలో ప్రకటించారు. దానిపై చర్చ జరగాలంటే ముందు సభ సజావుగా ఉండాలని... సభ్యులంతా వారి వారి స్థానాలకు వెళ్లి కూర్చొవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. పోడియంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ సభ్యులు మాత్రం ఆందోళన కొనసాగించారు. అవిశ్వాసంపై చర్చించేందుకు 50 మంది సభ్యుల్ని లెక్కించాల్సి ఉంటుందని పదే పదే చెప్పిన స్పీకర్.... గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. -
ప్రెస్మీట్లకే చంద్రబాబు పరిమితం: కొణతాల
హైదరాబాద్ : ఆర్టికల్-3పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం సఫలీకృతమైందని ఆపార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. పార్లమెంట్లో అన్ని జాతీయ పార్టీలు ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజనపై స్పష్టత లేని చంద్రబాబునాయుడు రోజుకో లెక్చర్ ఇస్తున్నారని కొణతాల ఎద్దేవా చేశారు. బాబు ప్రెస్మీట్లకే పరిమితం అయ్యారే కానీ, విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం చేయటం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి.... పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి దాసోహమై రాష్ట్రంలో సమైక్య నాటకాలేస్తున్నారని కొణతాల వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అందరూ కలిసి వస్తే ... రాజకీయ సంక్షోభాన్ని సృష్టించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని కొణతాల అన్నారు. -
'టి' బిల్లుని ప్రణబ్ తిరస్కరిస్తారా?
అన్ని అడుగులూ వడివడిగా విభజన దిశగానే పడుతున్నప్పటికీ, ఇటీవల అనుకోకుండా హైదరాబాదు విచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమైక్యవాదుల్లో కొత్త ఆశలు మోసులెత్తించారు. తెలంగాణ బిల్లు మీద ఆయన రాజ్యాంగపరమైన అభ్యంతరాలు తెలియజేసే అవకాశముందని సూచనలు అందినట్టు సమైక్యవాదులు చెబుతున్నారు. తనంత స్థాయి వారు రావాల్సినంత ప్రాధాన్యతలేని కార్యక్రమాంలో పాల్గోడానికి వచ్చినప్పటికీ, రాష్ట్రపతి ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశాన్ని మరింత చేరువగా అర్థం చేసుకోవడానికి వచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్ఠానం అడుగులకి మడుగులొత్తుతూనే, మరో పక్క సమైక్య మాస్కుని ధరించి ద్విపాత్రాభినయం చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖపై కేంద్రాన్ని వివరణ కోరి, సమైక్యవాదులకి నైతిక బలాన్ని అందించిన ప్రణబ్ ముఖర్జీ, తన అనూహ్య రాకతో మరింత బలమిచ్చారంటున్నారు. రాష్ట్ర విభజన అంశంలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తానని, తానే గాక, కేంద్ర కేబినెట్ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన ఇటీవల హైదరాబాదులో తనని కలిసిన అన్ని పార్టీల నేతలకీ స్పష్టం చేశారు. ఆయన హఠాత్తుగా రాష్ట్ర రాజధానికి రావడం, రాజ్ భవన్లో తనని కలిసేందుకు వరస కట్టిన ప్రతి పార్టీ నాయకులు చెప్పింది సావధానంగా వినడం రాజకీయ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. ఆయన పరోక్షంగా చేసిన సూచనలు సమైక్యవాదానికి దన్నుగానే ఉన్నాయని ఆ సమావేశాలలో పాల్గొన్న నాయకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదన, తదనంతర పరిణామాల గురించి ప్రస్తావిస్తూ విభజన ప్రతిపాదన గురించి సోనియాను ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించినట్లు కొన్ని జాతీయ పత్రికలు వార్తలు ప్రచురించిన నేపథ్యంలో, ఆయన రాష్ట్ర విభజనని తిరస్కరిస్తారని ఊహిస్తున్నారు. తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లినప్పుడు, ఆర్టికల్ 371(డి) దృష్ట్యా బిల్లు పై అభ్యంతరం పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ఉద్యోగాల్లో స్థానికులకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) ని సవరిస్తేనేగానీ రాష్ట్ర విభజనకు వీలు కాదని రాజ్యాంగ నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ, తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ అధికరణ దానంతట అదే రద్దైపోతుందని చేస్తున్న వాదన తప్పని నిపుణులు చెబుతున్నారు. 371(డి)లో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ అనే పదం స్థానంలో కొత్త రాష్ట్రాల పేర్లు చేర్చకుండా, రాష్ట్ర విభజన సాధ్యం కాదని వారి వాదం. ఆర్టికల్ 371(డి)ని 7వ షెడ్యూలులో చేర్చినందువల్ల, దానిని సవరించకుండా తెలంగాణ ప్రక్రియలో ముందుకు పోలేమని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అధికరణ ప్రకారం తెలంగాణని ఏర్పాటు చేయొచ్చని కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రపతి దగ్గర రాజ్యంగపరంగా భంగపడే అవకాశం ఉంది. నిపుణుల ప్రకారం, ఆర్టికల్ 371(డి)ని సవరించాలంటే, పార్లమెంటు ఆమోదం పొందాలి, దానికి కనీసం 50 శాతం కోరంలో మూడింట రెండొంతులు సవరణకి మద్దతునివ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పుడల్లా పూర్తయ్యే అవకాశమే లేదని, మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల ముందు రాష్ట్ర విభజన అసాధ్యమని అంటున్నారు. బెంగాల్ విభజన సృష్టించిన గాయం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్ర విభజనపై రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవదీసి, విభజన ప్రక్రియకి కళ్లేలు వేయవచ్చని విశ్లేషకుల అంచనా.