breaking news
Antibacterial Therapy
-
చీమల తేనె గురించి విన్నారా! ఇది జలుబు, గొంతు నొప్పి ఇన్ఫెక్షన్లను..
తేనె అంటే తేనెటీగల నుంచి వస్తుందని అందరికీ తెలుసు. మహా అయితే కొన్ని దేశాల్లో ఇంకాస్తా ఔషధాలతో కూడిన తేనె దొరకొచ్చు. కానీ మాగ్జిమమ్ తేనె అంటే వివిధ తేనెటీగల జాతుల నుంచే వస్తుంది. చీమల నుంచి కూడా తెనె వస్తుందని మీరు ఎప్పుడైనా విన్నారా?. పైగా ఇందులో చాలా మంచి ఔషధాలు ఉన్నాయట. ఆస్ట్రేలియాలోని ప్రజలు ఈ తేనెనే ఎక్కువగా ఉపయోగిస్తారట. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. ఆస్ట్రేలియలో ఉండే హనీపాట్ చీమలు ఈ తేనెను ఉత్పత్తి చేస్తాయట. ఇందులో జలుబు, గొంతు నొప్పుల ఇన్ఫెక్షన్ల భారి నుంచి కాపాడే మంచి యాంటీబయోటిక్స్ ఉన్నాయట. అక్కడ ప్రజలు సాంప్రదాయ వైద్యంలో భాగంగానే కాగా నిత్య జీవితంలో కొన్ని రకాల వ్యాధులకు ఔషధంగా వాడతారట. ఈ చీమలు పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉత్తర భూభాగంలోని ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని రిప్లీట్స్ అని పిలుస్తారు. ఇవి తేనేను అధికంగా తింటాయి. వాటి పొత్తికడుపులో చిన్న అంబర్ గోళీల పరిమాణానికి చేర్చి తేనెను ఉత్పత్తి చేస్తాయి. అవి తమ గూళ్లు పై కప్పులపై వేళ్లాడుతూ ఉండి ఈ తేనెను స్టోర్ చేయడం ప్రారంభిస్తాయి. వాటికి ఆహరం కొరత ఉన్న సమయంలో ఈ తేనెను తీసుకుని జీవిస్తాయి. ఈ తేనె స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. క్రిప్టోకోకస్ చెట్లలో ఈ చీమలు గూడ్లు కట్టుకుంటాయని చెబుతున్నారు. వీటి తేనెలో యాంటీమైక్రోబయల్ పెప్టైడ్, మిథైల్గ్లైక్సాల్ సమ్మేనం, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. అందువల్లే ఇది మంచి ఔషధంగా ప్రజలు భావించినట్లు తెలిపారు. దీన్ని గాయాలకు లేపనంగా పూస్తే త్వరితగతిన తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఈ చీమల తేనె మాములు తేనె కంటే చిక్కగా ఉండి తక్కువ తీపి ఉంటుందట. ఇది మాపుల్ సిరప్‌ని పోలి ఉంటుంది. అంతేగాదు పరిశోధకులు ఈ తేనెలో ఉండో మైక్రోబయల్ను ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని మందులు తయారు చేసే దిశగా అధ్యయనాలు చేస్తున్నాట్లు పరిశోధకులు తెలిపారు. (చదవండి: ఈ ప్యాక్స్‌తో..జుట్టురాలే సమస్యకు చెక్‌పెట్టండి!) -
నగర చెరువులకు బాక్టీరియా థెరపీ!
సాక్షి, సిటీబ్యూరో: మురుగు, వ్యర్థాలు, రసాయనాలు కలసి కాలుష్య కాసారాలైన చెరువులకు ‘బ్యాక్టీరియా చికిత్స’ అందించేందుకు సర్కారు విభాగాలు రంగం సిద్ధంచేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతోన్న ఘన,ద్రవ వ్యర్థజలాల కలయికతో దశాబ్దాలుగా మురుగుకూపాలుగా మారిన చెరువులకు పూర్వపు స్థాయిలో మహర్దశనందించేందుకు జలమండలి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ విభాగాలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయోగాత్మకంగా జలగం వెంగళరావు పార్క్, బంజారా పాండ్, రాజేంద్రనగర్ చెరువుల్లో ఈ చికిత్స విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవలే పెన్నార్ ఎన్విరో, బ్లూ ప్లానెట్ ల్యాబ్స్ సంస్థలు సంయుక్తంగా చేపట్టనున్న ఈ ప్రయోగం వివరాలను ఆయా సంస్థల నిపుణులు ఇటీవలే అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యాక్టీరియా చికిత్సతో సత్ఫలితాలు.. కలుషిత జలాలు చేరడం వల్ల చెరువుల్లో పేరుకుపోతున్న జీవ, రసాయన వ్యర్థాలను తినే ‘మైక్రో ఆర్గానిజం కల్చర్ బ్యాక్టీరియా’తో మురుగునీటిని శుద్ధిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా, జపాన్ తదితర దేశాల్లోనే ఈ విధానం అమల్లో ఉంది. చెరువుల్లో కలిసిన ఆర్గానిక్ వ్యర్థాలను ఈ బ్యాక్టీరియా ఆహారంగా స్వీకరించి క్రియారహితంగా మారుతుంది. సూపర్‌బగ్ తరహాలో పనిచేస్తుంది. ఈ విధానం పర్యావరణానికి కూడా హానికలిగించదని జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ బ్యాక్టీరియా పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని చెరువులో చల్లుతారు. ఈ బ్యాక్టీరియా పనితీరుపై సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు జలమండలి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులకు ఇటీవల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రయోగాత్మకవిధానం అమలు విషయంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిపుణుల సలహాలను కూడా స్వీకరించనున్నారు. పౌడర్ బ్యాక్టీరియా... తెల్లటి పౌడర్ రూపంలో ఉన్న మిశ్రమంలో ఈ బ్యాక్టీరియా దాగి ఉంటుంది. దీనిని ఆయా చెరువుల్లోని వ్యర్థజలాలపై పెద్ద మొత్తంలో చల్లుతారు. దీంతో బ్యాక్టీరియా క్రియాశీలమై మురుగునీటిలోని జీవ, రసాయన ఘన వ్యర్థాలను ఆహారంగా స్వీకరిస్తుంది. సంక్లిష్ట కర్భన పదార్థాలను సరళ పదార్థాలుగా విడగొడుతుంది. ఆతరవాత ఇది క్రియారహితంగా మారుతుంది. మురుగు ప్రవాహంలో కొట్టుకుపోతుంది. దీని జీవితకాలం తక్కువగానే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా పర్యావరణానికి మేలు చేస్తుందే తప్ప కీడు చేయదని నిపుణులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది తిరిగి చైతన్యవంతం అయ్యే వీలులేదని తెలిపారు. ఉపయోగాలివీ... ► ఆయా చెరువుల్లోని మురుగునీటిలో ఉన్న జీవసంబంధ ఘన వ్యర్థాలను తొలగించి నీటిని శుద్ధిచేస్తుంది. ► నీటిలో ఉండే హానికారక రసాయనాలు,ఘన వ్యర్థాలు, మురుగు అవశేషాలు నిర్వీర్యమౌతాయి ► మురుగు ప్రవాహానికి ఆటంకాలు తొలగుతాయి ► ఆధునిక బ్యాక్టీరియా టెక్నాలజీ ఆధారంగా ఘన వ్యర్థాలను శుద్ధిచేయవచ్చు ► శుద్ధిచేసిన వ్యర్థజలాల్లో బిఓడి,సిఓడి స్థాయిలను ప్రమాణాల ప్రకారం ఉండేలా చూడవచ్చు. ►ఈ చికిత్సా విధానం ద్వారా ఆయా చెరువుల చుట్టూ ఉన్న ఆవరణ వ్యవస్థను పరిరక్షించవచ్చు.