breaking news
Am admiparti
-
Delhi liquor scam: ఆమ్ ఆద్మీ భవితవ్యం ఏమిటీ?
‘ఆమ్ ఆద్మీ పార్టీకి జరగకూడని వేళ, జరగకూడనంతటి భారీ నష్టం’ ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయమిది. రాజకీయ నిపుణుల నుంచి సామాన్య ప్రజల దాకా ఇదే భావన నెలకొని ఉందంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు విపక్షాల భవితవ్యాన్ని తేల్చేస్తాయని భావిస్తున్న అత్యంత కీలకమైన లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన ఈ అరెస్టు ఆప్‌కు నిజంగా కోలుకోలేని దెబ్బే. ఎందుకంటే ఆ పార్టికి సర్వం కేజ్రీవాలే. ఆయన స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులెవరూ లేరు. కాస్తో కూస్తో జనాకర్షణ ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇప్పటికే ఇదే కేసులో జైల్లో మగ్గుతున్నారు. దాంతో సహజంగానే పార్టీ సారథిగా, సీఎంగా కేజ్రీవాల్ స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేయగల స్థాయి ఉన్న నేతలెవరూ ఆప్‌లో కని్పంచడం లేదు. కేజ్రీయే సీఎంగా కొనసాగుతారని, అవసరమైతే జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనల ఆంత్యరమూ అదే. చట్టపరంగా అందుకు అడ్డంకులేమీ లేకపోయినా జైలునుంచి సీఎంగా కొనసాగడం అసాధ్యమేనన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. అందులో ఇమిడి ఉన్న రాజ్యంగపరమైన సవాళ్లను ఎత్తిచూపుతూ రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేస్తారని, చివరికి ఢిల్లీ రాష్ట్రపతి పాలనలోకి వెళ్లవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే ఆప్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు చందమే అవుతుంది. సమస్యలు కూడా రెట్టింపవుతాయి. ఏదేమైనా 12 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ లేనంత అతి పెద్ద సమస్యను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. జాతీయ పార్టీగా మారడమే గాక పంజాబ్‌లోనూ అధికారం చేజిక్కించుకుని, దేశవ్యాప్తంగా మరింతగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ఆప్, ఏకంగా తన ఉనికికే సవాలుగా మారిన ఈ పెను గండం నుంచి బయట పడగలదా అన్నది వేచి చూడాల్సిన అంశమే. చాలాకాలం జైల్లోనే...? ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ తరహాలోనే కేజ్రీవాల్ కూడా ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చే అవకాశాలు కని్పంచడం లేదు. అదే జరిగితే ఆప్ మనుగడే ప్రమాదంలో పడవచ్చు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు ఆరో విడతలో మే 25న, పంజాబ్‌లోని 13 స్థానాలకు జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. కీలకమైన రెండు నెలలూ ఆప్‌ను అనుక్షణం నాయకత్వ లేమి వేధించనుంది. ఢిల్లీ, పంజాబ్‌లో కేజ్రీవాల్ ప్రచారంపైనే పార్టీ ప్రధానంగా ఆధారపడింది. ప్రస్తుత ఆప్ నేతల్లో గట్టిగా విని్పంచే పేర్లు ఆతిషి మర్లేనా, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ మాత్రమే. వీరిలో ఎవరికీ పాలనపరమైన అనుభవం లేదు. రాజకీయంగా కూడా కేజ్రీవాల్ స్థాయిలో బీజేపీని ఢీకొనగల సత్తా కూడా అంతంతమాత్రమే. హస్తినలో అస్తవ్యస్తమే! ఆప్, కేజ్రీవాల్ హవా ఎంతగా ఉన్నా గత పదేళ్లుగా లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ హవాయే కొనసాగుతూ వస్తోంది. ఆప్ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అక్కడ బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం కట్టబెడుతున్నా లోక్‌సభకు వచ్చేసరికి కాషాయ మంత్రం జపించడం ఢిల్లీ ఓటర్లకు ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా దీన్ని మార్చి సత్తా చూపాలని కేజ్రీవాల్ కృతనిశ్చయంతో ఉన్నారు. ‘లోక్‌సభలోనూ కేజ్రీవాల్, ఢిల్లీలో మరింత ప్రగతి’, ‘గుజరాత్‌లోనూ కేజ్రీవాల్’ అంటూ ఆప్ ఎన్నికల నినాదాలు కూడా పూర్తిగా ఆయనను కేంద్రంగా చేసుకునే రూపొందాయి. ఇలాంటి సమయంలో ఆయన జైలుపాలవడంతో ఒక్కసారిగా ఆప్ లోక్‌సభ ఎన్నికల ప్రణాళికే తలకిందులైపోయింది. ఇదిక్కడితో ఆగకపోవచ్చని, వచ్చే ఏడాది జరగనున్న కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనా ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ ఘనవిజయం సాధించడం తెలిసిందే. ప్రాంతీయ పార్టిల నేతల్లో మమత వంటి దిగ్గజాలే మోదీ సర్కారు ధాటికి వెనుకంజ వేసినా కేజ్రీవాల్ మాత్రం ప్రధానితో నిత్యం ఢీ అంటే ఢీ అంటున్నారు. అలా పదేళ్లుగా బీజేపీకి కంట్లో నలుసుగా మారారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఎలాగైనా ముకుతాడు వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. కేజ్రీ గైర్హాజరీలో డీలా పడ్డ ఆప్ నేతలను నయానో భయానో లొంగదీసుకుని ఆ పార్టీ ఉనికే లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేయడం ఖాయమంటున్నారు. సానుభూతి కష్టమే...? అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించడం ద్వారా రాజకీయాల్లోకి వచి్చన కేజ్రీవాల్ అవినీతి కేసులో జైలుపాలు కావడాన్ని సమర్థించుకోవడం ఆప్ నేతలకు కష్టంగానే కని్పస్తోంది. ఆ పార్టీ వాదన ఎలా ఉన్నా ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం వాస్తవమేనన్న అభిప్రాయం ప్రజల్లో గట్టగా ఉంది. కనుక కేజ్రీవాల్‌కు, ఆయన అరెస్టు విషయంలో ఆప్‌కు పెద్దగా సానుభూతి లభించే అవకాశాలు లేవంటున్నారు. ఆప్ వర్గాలను మరింతగా noకలవరపరిచే అంశమిది. మద్యం ఆదాయంపై అత్యాశ వద్దని తానెంత చెప్పినా కేజ్రీ విన్లేదంటూ ఆయనకు గురుతుల్యుడైన సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే చేసిన తాజా వ్యాఖ్యలు ఆప్‌కు మరింత చేటు చేసేవే. ‘ఇండియా’ కూటమి డీలా ఇప్పటికే జనాకర్షక నాయకుల కొరత ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కేజ్రీవాల్ అరెస్టుతో మరింతగా డీలా పడింది. జేడీ(యూ) చీఫ్ నితీశ్‌కుమార్, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వంటి అగ్ర నేతలు ఇప్పటికే కూటమిని వీడారు. దాంతో సోనియా, రాహుల్, ఖర్గే తర్వాత కేజ్రీవాల్ మినహా దేశవ్యాప్త ఆదరణ ఉన్న నాయకులు కూటమిలో పెద్దగా లేరు. ఖాతాల స్తంభన తదితరాలతో ఇప్పటికే నిధుల కొరతతో కిందా మీదా అవుతున్న కాంగ్రెస్‌ను ఈ పరిణామం మరింతగా నిస్తేజపరుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆప్‌కు కీలక నేత రాజీనామా...
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన అశుతోష్ బుధవారం ఆప్‌కు రాజీనామా చేశారు. అత్యంత వ్యక్తిగత కారణాలరీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రతి ప్రయా ణానికి ముగింపు ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో నా అనుబంధం చాలా అందమైనది, విప్లవాత్మకమైంది. దీనికి కూడా ముగింపు ఉంటుంది. పార్టీకి రాజీనామా చేశా. పార్టీకి, నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ వ్యాపార వేత్తను పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా పంపడంపై అశుతోష్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేగాక తనకు ఆ టికెట్ ఇవ్వలేదని కినుక వహిస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. అయితే ఈ వార్తలను ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ కొట్టిపారేశారు. రాజీనామాపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘మీ రాజీనామాను ఎలా ఆమోదించాలి. నా, ఇస్ జన్మ్ మే తో నహీ(ఈ జన్మలో ఇది సాధ్యం కాదు)’’అంటూ వివరించారు. అశుతోష్ జర్నలిస్ట్ నుంచి రాజకీయ నేతగా మారారు. రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. -
మై బనియా హూ!దందా సమజ్తా హూ!!
న్యూఢిల్లీ: తనను తాను వ్యాపారిగా అభివర్ణించుకున్న ఆమ్ ఆద్మీపార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట నగర వ్యాపారులను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో పన్నుల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తానని, వ్యాట్ విభాగం బలవంతపు వసూళ్ల ర్యాకెట్‌ను అరికడతానని వాగ్దానం చేశారు. నెహ్రూప్లేస్‌లో సోమవారం జరిగిన వ్యాపారుల ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగించారు. వ్యాపారుల కోసం ఆయన వాగ్దానాలు చేశారు. తాను అధికారంలోకి వస్తే వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తానని చెప్పారు. ఢిల్లీని టోకు వ్యాపార, పంపిణీ కేంద్రంగా మారుస్తానని అన్నారు. ‘‘మై బనియా హూ! దందా సమజ్తా హూ’’ (తాను వ్యాపార వర్గం నుంచి వచ్చానని తనకు వ్యాపారం తెలుసు)నని చెప్పారు. వ్యాపారులు నిజాయితీగా వ్యాపారం చేసి, పన్నులు కట్టాలని తాము ఆశిస్తున్నామని ఆప్ నేత చెప్పారు. వ్యాపారుల విషయంలో ప్రభుత్వ జోక్యం నామమాత్రంగా ఉంటుందని అన్నారు. దాడులకు పాల్పడటం తమ పార్టీ విధానం కాదని, వ్యాపారులను నమ్మటం తమ విధానమని పేర్కొన్నారు. వ్యాట్ దాడులు, బలవంతపు వసూళ్లను తమ ప్రభుత్వం నిలిపివేస్తుందని, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తామని చెప్పారు. తాను పదవి నుంచి దిగిపోయిన వెంటనే వ్యాపారులను వ్యాట్ విభాగం వేధింపులకు గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. తాము వ్యాపారులను వేధింపులకు గురి చేయలేదని, అయినా తమ 49 రోజుల పాలనలో వ్యాట్ వసూళ్లు అత్యధికంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఢిల్లీలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు పన్నుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తామని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. ఢిల్లీలో వ్యాపారం చేయాలనుకునే వారికి అనుమతులు మంజూరుచేసేందుకు ఏకగవాక్ష (సింగిల్ విండో) వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుల విధానాన్ని కూడా సరళతరం చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించేందుకు లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌కు మారుస్తామని చెప్పారు. ఇంట్లో నుంచే లెసైన్సులకు దరఖాస్తు చేసి, అక్కడే వాటిని పొందవచ్చని అన్నారు. అవినీతి, అధికారస్వామ్యం కారణంగా వ్యాపారం దెబ్బతింటోందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఏడు రోజుల్లో అనుమతులన్నీ మంజూరు చేస్తామని చెప్పారు. అయినా ఆలస్యమైతే వారు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి అనుమతి పొందవచ్చని భరోసానిచ్చారు. వచ్చే ఐదేళ్లలో దేశంలోనే అతి తక్కువ వ్యాట్ ఢిల్లీలో ఉండగలదని వాగ్దానం చేశారు. వ్యాట్ తగ్గింపు వల్ల ధరలు తగ్గుతాయని, తద్వారా ద్రవ్యోల్బణం తగ్గుతుందని కేజ్రీవాల్ వివరించారు. వ్యాపారుల భాగస్వామ్యం లేకుండా వారికి సంబంధించిన ఎటువంటి విధానాన్నీ రూపొందించబోమని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో రోడ్లు, నీరు, విద్యుత్ వ్యవస్థలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ని వ్యతిరేకిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. అయితే ఇ-కామర్స్ వెబ్సైట్లకు మాత్రం తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.