బీజేపీకి గుడ్‌బై.. ఆ వెంటనే విజయ్ TVK బంపర్ ఆఫర్!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తమిళగ వెట్రి కజగం (TVK) రాజకీయంగా విస్తరించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకే పరిమితం కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ అవకాశాలను ఇప్పటికే పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన నటుడు దేవన్‌కు మాంచి ఆఫర్ ఇచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా బీజేపీపై రగిలిపోతున్న ఆ సీనియర్ నటుడే ఓ జాతీయ మీడియా చానెల్‌కు వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా అంది వచ్చిన అవకాశాన్ని విజయ్ టీవీకే సకాలంలో అందిపుచ్చుకుంది. అద్భుత విజయంతో అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ కన్ను పక్క రాష్ట్రాలపై పడింది. విజయ్ క్రేజ్, అలాగే.. రాజకీయ పరిస్థితులను బేరీజూ వేసుకుని విస్తరణకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కేరళలో టీవీకే విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ నటుడైన దేవన్‌కు.. టీవీకే పార్టీ తాజాగా కేరళ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. దేవన్ ఆగస్టు 16న బీజేపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన బీజేపీపై భగ్గుమన్నారు. దాదాపు ఐదేళ్లు పార్టీలో ఉన్నప్పటికీ తనకు ఎలాంటి బాధ్యత ఇవ్వలేదని, పనిచేయాలన్నా అవకాశం కల్పించలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజీనామా చేసిన మరుసటి రోజే సీఎం విజయ్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని దేవన్ తెలిపారు.#WATCH | Kollam, Keralam: On joining TVK after resigning from BJP, Malayalam actor Devan said, "...I've been working for the BJP very affirmatively, aggressively, taking a lot of risks. But they couldn't understand my mission and my planning. They are against all these things. I… pic.twitter.com/q9PW7Ur3Tp— ANI (@ANI) August 23, 2026ఆ తర్వాత టీవీకేకి చెందిన ఇద్దరు నేతలు తన ఇంటికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లు చెప్పారు. అనంతరం సీనియర్ నేతలతో గూగుల్ మీట్ ద్వారా కూడా చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఈ చర్చల్లో కేరళ TVK రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తనకు ఆఫర్ చేసినట్లు దేవన్ తెలిపారు.విజయ్‌తో భేటీ తర్వాతే ప్రకటనదేవన్ త్వరలో చెన్నై వెళ్లి విజయ్ను కలవనున్నారు. సెప్టెంబర్ 10 తర్వాత ఈ భేటీ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విజయ్‌తో చర్చించిన అనంతరం TVKలో చేరిక, కేరళ పార్టీ బాధ్యతలు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.విజయ్, దేవన్‌కు సినిమా రోజుల నుంచే మంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆ అనుబంధమే ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త సమీకరణానికి దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే!మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన దేవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. బాషా, ధర్మక్షేత్రం, రౌడీ మొగుడు, శుభాకాంక్షలు, పెళ్లి చేసుకుందాం, చన్నకేశవరెడ్డి, దేశముదురు, ఏ మాయ చేశావె, ఢమరుకం, హార్ట్ ఎటాక్, రాజుగారి గది-2, సాహో వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. దేవన్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. విద్యార్థి దశలో కాంగ్రెస్, KSUతో అనుబంధం ఉన్న ఆయన.. 2004లో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో దాన్ని నవ కేరళ పీపుల్స్ పార్టీగా పునరుద్ధరించి, 2021లో బీజేపీలో విలీనం చేశారు. అనంతరం కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి TVK వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం కేరళలో అధికార, ప్రతిపక్ష కూటముల మీద జనాలకు అసంతృప్తి నెలకొందని, మాంచి స్ట్రాటజీతో ముందుకెళ్తే టీవీకే రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారాయన.కేరళలో ‘కొత్త ప్రత్యామ్నాయం’..కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. ఈ రెండు కూటముల మధ్యే అధికార పంపిణీ రొటీన్‌గా మారింది. ఈ మధ్యలో బీజేపీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమోనని భావించినా ఫలితం దక్కలేదు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, విజయ్ నేతృత్వంలోని TVK వైపు యువత, విద్యార్థులు ఆసక్తి చూపించొచ్చని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్‌కు కేరళలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలు విపరీతంగా ఆడేవి. గతంలో అక్కడికి వెళ్లిన ఆయన.. అభిమానులతో దిగిన సెల్ఫీలు సైతం నెట్టింట పంచుకునేవారు. విజయ్ రాజకీయ ఎంట్రీ, విజయాన్ని సైతం అక్కడి ప్రజలు నిశితంగా గమనించారు. దీంతో ఆయన ఎంట్రీ ఇస్తే ఆదరణ దక్కవచ్చని దేవన్ అంటున్నారు. టీవీకేలోకి దేవన్ ఎంట్రీ జరిగితే.. కేరళలో TVKకి తొలి కీలక అడుగు పడినట్లే. అయితే ఒకవైపు తమిళనాడులో పార్టీని బలోపేతం చేస్తూనే.. కేరళలో సినీ రంగంలో పరిచయం ఉన్న నేతను ముందుకు తీసుకురావడం ద్వారా విజయ్ తన పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారా అన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఎస్ఐ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు