విశాఖపట్నం : ఎండలు మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉక్కపోత, సెగలతో మనుషులే ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్న తరుణంలో... నోరులేని పక్షులు, వ గజీవాలు, పశువులు తాగడానికి గుక్కెడు నీరు లేక విలవిలాడిపోతున్నాయి.
ఎండ తీవ్రతకు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు అడుగంటిపోవడంతో జీవరాశుల దాహం కేకలు అరణ్య రోదనగా మారుతున్నాయి. గత రెండు రోజులుగా అనకాపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో, చల్లదనం కోసం, దాహం తీర్చుకోవడం కోసం పక్షులు విలవిలాడుతూ నక్కపల్లి మండలంలో రామకృష్ణపురం సమీపంలో ఉన్న పోలవరం ఎడమ కాలువలో ఉన్న నీటి కోసం పరుగులు తీస్తున్నాయి.
ప్రవహిస్తున్న కాలువ నీటిని చూసి, ప్రాణాలు నిలుపుకోవాలనే ఆరాటంతో కాలువ వద్దకు చేరుకుంటున్న పక్షుల ఆర్తనాదాలు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలలో స్పష్టమవుతున్నాయి. నీటి చుక్క కోసం పక్షులు పడుతున్న ఇక్కట్లకు అద్దం పడుతున్న గుండెను పిండేసే 'ఫోటో స్టోరీ' ఇది...
ఫొటోలు – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


