సరికొత్త స్కాం! | Union Minister Kiren Rijiju in 450-crore hydro-electric project scam | Sakshi
Sakshi News home page

సరికొత్త స్కాం!

Dec 15 2016 1:36 AM | Updated on Sep 4 2017 10:44 PM

సరికొత్త స్కాం!

సరికొత్త స్కాం!

చాన్నాళ్ల తర్వాత మళ్లీ కుంభకోణాల సీజన్‌ వచ్చినట్టుంది. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డట్టు తన దగ్గర సమాచారం ఉన్నదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెబుతున్నారు.

చాన్నాళ్ల తర్వాత మళ్లీ కుంభకోణాల సీజన్‌ వచ్చినట్టుంది. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డట్టు తన దగ్గర సమాచారం ఉన్నదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెబుతున్నారు. ఇది వెల్లడిస్తానన్న భయంతోనే లోక్‌సభలో తనను మాట్లాడనివ్వడంలేదని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్నే సభ వెలుపల వెల్లడించడానికి ఆయనకున్న అభ్యంతరమేమిటో బోధపడదు.

ఈలోగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజుతో ముడి పెడుతూ ఒక కొత్త కుంభకోణం జనం ముందుకొచ్చింది. రిజిజు కేంద్ర మంత్రి వర్గంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కామెంగ్‌ జిల్లాలో నిర్మిస్తున్న 600 మెగావాట్ల జల విద్యుత్‌ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు డ్యామ్‌ల నిర్మాణంలో రూ. 450 కోట్ల మేర అవినీతి చోటు చేసుకున్నదని ఒక ఆంగ్ల దినపత్రికలో కథనం వెలువడింది. సహజంగానే విపక్ష కాంగ్రెస్‌కు అది ఆయుధంగా మారింది. తనకు వ్యతిరేకంగా ఈ కట్టుకథ అల్లినవారిని ఆ ప్రాంత జనం బూట్లతో కొడతారని రిజిజు అంటున్నా ఇదంత సులభంగా కొట్టుకుపోయే ఆరోపణ కాదు.

ఈ జలవిద్యుత్‌ ప్రాజెక్టు పబ్లిక్‌ రంగ సంస్థ నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రికల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (నీప్‌కో)కు చెందినది. నీప్‌కో నేరుగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ప్రాజెక్టుపై ఆరోపణలు చేసింది ఒక రాజకీయ పార్టీయో, మరో పౌర సమాజ సంస్థనో కాదు. సాక్షాత్తూ నీప్‌కో సంస్థ చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి సతీష్‌ వర్మ అందజేసిన 129 పేజీల నివేదిక ఈ ఆరోపణ చేస్తున్నది. ఇందులో సంస్థ చైర్మన్, ఎండీలకు కూడా వాటా ఉందని ఆ నివేదిక అంటున్నది.  వాస్తవానికి ఆయన ఈ నివేదిక అందజేసి నాలుగు నెలల కాలం గడిచిపోయింది. దీన్ని కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీఓ)కు కూడా పంపారు. రెండుసార్లు సీబీఐ బృందం ‘మెరుపు తనిఖీలు’ చేసిందంటున్నారు.

అయితే ఈ విషయంలో చివరకు ఏ నిర్ణయానికొచ్చారో తెలియదు. మీడియాలో వెల్లడయ్యాక తామింకా అందుకు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నామని సీబీఐ సంజాయిషీ ఇస్తోంది. ఈ కుంభకోణంలో వాస్తవానికి నేరుగా రిజిజు ప్రమేయాన్ని రుజువు పరిచే అంశాలేమీ లేవు. చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ నివేదిక తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సొమ్ముల్ని నిలిపేస్తే వాటిని విడుదల చేయాలని కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌కు ఆయనొక లేఖ రాశారు. ఆ లేఖ కూడా స్థానికంగా తన నియోజకవర్గానికి చెందినవారు తమకు కాంట్రాక్టర్‌ నుంచి రావలసిన వేతనాలు అందడంలేదని ఫిర్యాదు చేస్తే రాశానంటు న్నారు. కాంట్రాక్టు సంస్థ పటేల్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌కు సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉంటున్న గోబోయ్‌ రిజిజు కిరణ్‌ రిజిజుకు దగ్గర బంధువని సతీష్‌వర్మ చెబుతుంటే కిరణ్‌ దాన్ని ఖండిస్తున్నారు.

చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ నివేదిక అందాక సీబీఐ చురుగ్గా వ్యవహరించి అసలు అక్కడ జరిగిందేమిటో, జరగనిదేమిటో ప్రాథమికంగానైనా నిగ్గు తేల్చి ఉంటే రిజిజు లేఖకు అంత ప్రాధాన్యత వచ్చేది కాదు. పైగా నివేదిక ఇచ్చాక దానిపై చర్యల మాట అటుంచి ‘ఇన్నాళ్లూ అనధికారికంగా ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాల’ంటూ నీప్‌కో పెద్దలు వర్మకు నోటీసు ఇచ్చారు. కుంభకోణం విచారణ కోసమే తాను ఆ సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సివచ్చినట్టు వర్మ ప్రత్యు త్తరమిచ్చినా  కొన్ని రోజులకే ఆయనను సీఆర్‌పీఎఫ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని సవాలు చేస్తూ సతీష్‌ వర్మ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. అన్నీ ఇలా అఘోరిస్తే కుంభకోణం వెనక ఎవరో పెద్ద లుండటం వల్లే, ఎవరినో కాపాడటానికే ఇదంతా జరుగుతున్నదన్న అనుమానాలు సామాన్యుల్లో తలెత్తే అవకాశాలుండవా? వాస్తవానికి నివేదికలోని అంశాలు మరీ అంత సంక్లిష్టంగా ఏమీ లేవు. ప్రాథమిక నిర్ధారణకు రావడానికి సీబీఐ నెలల తరబడి కష్టపడనక్కరలేదు. కాంట్రాక్టర్లు తప్పుడు బిల్లులు సృష్టించి భారీ మొత్తంలో నిధులు మేశారన్నది వర్మ నివేదికలోని ప్రధాన సారాంశం.

డ్యామ్‌ల నిర్మాణానికి అవసరమైన రాళ్లను 70 కిలోమీటర్ల ఆవలినుంచి తీసుకొచ్చామని కాంట్రాక్టర్లు తప్పుడు బిల్లులు చూపించారు. వాటికి అనుబంధంగా వేర్వేరు చోట్ల చలానాలు కట్టినట్టు, వేబిల్లులు చెల్లించినట్టు రశీదులు సృష్టించారు. బండరాళ్లను తరలించడానికి వినియోగించిన వాహనాల నంబర్లలో చాలాభాగం స్కూటర్‌లు, మోటార్‌ సైకిళ్లకు సంబంధించినవని విజిలెన్స్‌ సంస్థ రుజువు చేసింది. పైగా వివిధ ప్రాంతాల నుంచి ఇంచుమించు ఏకకాలంలో బయల్దేరినట్టు చూపిన వేర్వేరు వాహనాలకు కొన్ని సందర్భాల్లో ఒకే డ్రైవర్‌ పేరు రాసిన తీరును కూడా బయ టపెట్టింది. పైగా డ్యామ్‌ల నిర్మాణానికి పనికొచ్చే బండరాళ్లు ఎక్కడో కిలోమీటర్ల ఆవల కాక నిర్మాణ స్థలానికి చాలా సమీపంలోనే ఉన్న వైనాన్ని ఎత్తిచూపింది. విజిలెన్స్‌ దర్యాప్తు సమయంలో వర్మ ఇచ్చిన సలహా మేరకు కాంట్రాక్టర్‌కు నీప్‌కో చెల్లింపులు నిలిపేసింది. ఈలోగా గోబోయ్‌ రిజిజు సతీష్‌వర్మను కలవడం, ఆయనతో జరిగిన సంభాషణను వర్మ రికార్డు చేయడం జరిగిపోయాయి. బిల్లులు విడుదల చేసేలా చూస్తే తన సోదరుడు, కేంద్రమంత్రి ద్వారా ఏదైనా సాయం కావాలంటే చేయిస్తానని గోబోయ్‌ చెప్పినట్టు అందులో రికార్డయింది.

నివేదికను సమర్పించిన సతీష్‌ వర్మది వివాదాస్పద చరిత్ర అన్నది ఆయన వ్యతిరేకుల వాదన. గతంలో గుజరాత్‌లో జరిగిన ఇష్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమైనదని ఆయన ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చి చెప్పిందని గుర్తు చేస్తున్నారు. అయితే ఇవి ఆయన ఇచ్చిన నివేదిక లోపభూయిష్ట మైనదని చెప్పడానికి ఎలా తోడ్పడతాయి? ఆరోపణలు వచ్చినప్పుడు వాటి పీక నొక్కడం కంటే వెనువెంటనే దర్యాప్తునకు ఉపక్రమించి నిజానిజాలేమిటో ప్రాథ మికంగానైనా వెల్లడిస్తే జరిగిందేమిటో ప్రజలకు అర్ధమవుతుంది. కప్పెట్టడానికి ప్రయత్నించినకొద్దీ ఆ ఆరోపణల బలం పెరుగుతుంది. అనుమానాలు రెట్టింపవు తాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా దర్యాప్తు సాగేలా చూడాలి. స్కాం మూలాలను బట్టబయలు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement