భర్త మరణించిన 50 ఏళ్లకు పెన్షన్ | Woman gets family pension 50 yrs after husband's death | Sakshi
Sakshi News home page

భర్త మరణించిన 50 ఏళ్లకు పెన్షన్

Oct 5 2013 4:35 PM | Updated on Sep 1 2017 11:22 PM

దాదాపు పాతికేళ్ల వయసులో భర్త చనిపోయిన ఓ మహిళకు.. అప్పటినుంచి 50 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు పెన్షన్ మంజూరైంది.

దాదాపు పాతికేళ్ల వయసులో భర్త చనిపోయిన ఓ మహిళకు.. అప్పటినుంచి 50 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు పెన్షన్ మంజూరైంది. ఈ సంఘటన ఒడిశాలో వెలుగుచూసింది. హరప్రియాదేవి భర్త జానకీనాథ్ నంద చౌదరి ఒడిసా రాజధాని భువనేశ్వర్లో గల బీజేపీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేసేవారు. ఆయన కటక్ నగరంలోని జోబ్రా ప్రాంతం వద్ద మహానదిలో మునిగి 1962లో మరణించారు. అప్పటికి ఆయన వయసు 29 ఏళ్లు మాత్రమే. హరప్రియాదేవికి అప్పటికి 26 ఏళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. వారిని పోషించడానికి టీచర్ ఉద్యోగం చేశారు. భర్తకు సంబంధించిన పెన్షన్ కోసం అప్పటి నుంచి ఎక్కే మెట్టు, దిగేమెట్టుగా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

చివరకు ఆమె రిటైరైపోయారు కూడా. ఆ తర్వాత సైతం పెన్షన్ ఇప్పించాలని ఎందరు అధికారులకు మొరపెట్టుకున్నా అది బధిర శంఖారావమే అయ్యింది. ప్రతియేటా ఉన్నత విద్యాశాఖ డైరెక్టరేట్కు వెళ్లడమే ఆమె పని. అయితే.. తన భర్తకు పదేళ్ల సర్వీసు పూర్తి కాలేదు కాబట్టి పెన్షన్ ఇవ్వడం కుదరదన్నారని ఆమె తెలిపింది. అయినా ఆమె మాత్రం పట్టు వదల్లేదు. చివరకు ఒడిసా పెన్షన్ నిబంధనలు మారాయి. ఇన్నేళ్ల తర్వాత ఆమెకు ఇప్పుడు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ మంజూరుచేశారు. దీంతోపాటు ఇన్నేళ్ల బకాయిల కింద రూ. 6.70 లక్షలు కూడా ఇచ్చారు. ఎట్టకేలకు ఆమెకు పెన్షన్ వచ్చినందుకు సంతోషమని ఉన్నత విద్యాశాఖ మంత్రి బదరీ నారాయణ పాత్ర అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement