ఏ ప్రాతిపదికన తొలగించారు? | Sakshi
Sakshi News home page

ఏ ప్రాతిపదికన తొలగించారు?

Published Tue, Sep 15 2015 12:32 AM

ఏ ప్రాతిపదికన తొలగించారు? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కళింగ కులాన్ని బీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలగించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ‘మధ్యంతర స్టే’ ఇచ్చింది. కళింగ కులాన్ని తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి తొలగించడంతో తాము మెడిసిన్‌లో ప్రవేశాలు కోల్పోయామని, తమకు ప్రవేశం కల్పించాలని కోరుతూ ఇద్దరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పిటిషనర్‌కు రిజర్వేషన్ పొందే హక్కు, అర్హత ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి కళింగ తదితర కులాలను తొలగించడంతో విద్యార్థులు మెడిసిన్‌లో ప్రవేశం పొందలేకపోయారు’ అని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. కులాల తొలగింపు రాజ్యాంగబద్ధంగానే జరిగిందని వివరించారు.

ఈ సందర్భంగా జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు స్పందిస్తూ రాష్ట్ర విభజనకు ముందు కళింగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్ వర్తించిందని, అయితే ఇప్పుడు తెలంగాణలో ఆ కులానికి చెందిన వారు లేరని రోహత్గీ తెలిపారు. ‘లేరని ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఏదైనా కమిషన్ వేశారా? విభజనకు ముందున్నప్పుడు.. ఇప్పుడు కూడా ఉండాలి కదా?’ అని న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు.

పిటిషనర్ అభ్యర్థన లోని ‘సి’ భాగంపై కౌంటర్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పు(తీర్పు అమలు కాలానికి సంబంధించి)పై ‘మధ్యంతర స్టే’ విధిస్తున్నామని, ఇది పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement