
రంగంలోకి ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారు.
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు. తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేస్తారని యూపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజ్ బబ్చర్ చెప్పారు. ప్రియాంక ప్రచారం చేయడం వల్ల పార్టీ నాయకుల్లో, రాష్ట్ర ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు.
వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రియాంక ప్రచారం చేస్తారని, కీలక పాత్ర పోషిస్తారని ఆ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ కూడా చెప్పారు. ప్రచారం చేయాలన్న తమ విన్నపాన్ని ప్రియాంక అంగీకరించారని యూపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ అయిన సంజయ్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రియాంక ప్రచార కార్యక్రమ తేదీలను ఖరారు చేస్తామని చెప్పారు.