పీజీ వైద్యులకే ప్రభుత్వ సర్వీసు! | PG doctors to Government service! | Sakshi
Sakshi News home page

పీజీ వైద్యులకే ప్రభుత్వ సర్వీసు!

Aug 24 2015 3:00 AM | Updated on May 25 2018 3:27 PM

ప్రభుత్వాసుపత్రుల్లో విధిగా ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధనను పీజీ పూర్తి చేసిన వైద్యులకే పరిమితం చేయనున్నారు.

వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్‌లకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో విధిగా ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధనను పీజీ పూర్తి చేసిన వైద్యులకే పరిమితం చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధనను విధించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన రాగా.. దీనిని త్వరలోనే ఆమోదించి ఉత్తర్వులు ఇవ్వబోతున్నారు. ఇకపై ఎంబీబీఎస్ పూర్తి చేసినవారు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది సర్వీసు చేయాల్సిన అవసరం ఉండదు.

ఇప్పటివరకు ఎంబీబీఎస్ పూర్తిచేశాక సూపర్ స్పెషాలిటీ వరకూ ఎప్పుడైనా ఒక ఏడాది ప్రభుత్వ సర్వీసు చేయాల్సి ఉంది. అయితే ఎంబీబీఎస్ వైద్యులు ఎక్కువ మంది అందుబాటులో ఉన్నారని, పీజీ వైద్యుల కొరతే వేధిస్తోందన్న కారణంతో పీజీ వైద్యులకే ఈ నిబంధన విధించాలని నిర్ణయించారు. ఉదాహరణకు ఎంబీబీఎస్ పూర్తిచేయగానే ఏడాది గ్రామీణ ప్రాంతంలో సర్వీసు చేసి వెళ్లిపోతారు. ఇలా ఎంబీబీఎస్ స్థాయిలో విధిగా ఏడాది సర్వీసు చేసి.. వెళ్లిపోతే పీజీ చేశాక బోధనాసుపత్రుల్లో పనిచేయడానికి పీజీ వైద్యులు అందుబాటులో ఉండరని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ఇన్‌సర్వీసు పీజీ కోటా కుదింపు
ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తవగానే ప్రభుత్వ ఉద్యోగం పొందినవారికి పీజీ సీట్లలో 30 శాతం ఇన్‌సర్వీస్ కోటా కింద ఇస్తున్నారు. ఇకపై దీన్ని భారీగా కుదించాలని నిర్ణయించారు. నాన్ క్లినికల్ విభాగంలో మొత్తం సీట్లను ఎత్తేస్తారు. ప్రస్తుతం నాన్ క్లినికల్‌లో అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి 9 విభాగాలున్నాయి.

ఈ విభాగాల్లో ఇన్‌సర్వీస్ కోటాలో సీట్లు పొందినా బోధనాసుపత్రుల్లో పదోన్నతులు పొందేందుకు పోస్టులు లేవని, అలాగని పీహెచ్‌సీల్లో పనిచేయడానికి ఈ అర్హతలు వృథా అని భావించి.. ఈ విభాగాల్లో సీట్లను ఇన్‌సర్వీస్ కోటా నుంచి తీసేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement