పనిచేయకుంటే షాక్ ‘ట్రీట్‌మెంట్’ | Minister Harishrao fires on officials | Sakshi
Sakshi News home page

పనిచేయకుంటే షాక్ ‘ట్రీట్‌మెంట్’

Dec 30 2015 3:00 AM | Updated on Oct 9 2018 7:11 PM

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.

సంగారెడ్డి క్రైం: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ముఖ్యంగా అధికారులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవల్లో ఎక్కడా చిన్న లోపం కనిపించినా సహించేది లేదని హెచ్చరించారు.

జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో అపరిష్కృతంగా వున్న సమస్యల పరిష్కారానికి అధికారులకు మార్గదర్శకాలను ఇచ్చారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలపై మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డిలు సమీక్షించారు. జిల్లాకు 13వ ఆర్థిక సంఘం మంజూరు చేసిన ఐదు ప్రాథమిక వైద్యశాలల పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సిన పరికరాలు పీహెచ్‌సీలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం నుంచి మంజూరవుతున్నా వాటిని అందుబాటులోకి తేవడంలో జరుగుతున్న జాప్యంపై మండిపడ్డారు. జనని శిశు సురక్షా కార్యక్రమాన్ని సమీక్షిస్తూ మందులు, ఆహారం, వైద్య పరీక్షలు, రక్తం రవాణా కోసం డబ్బులు రోగులకు కచ్చితంగా అందే విధంగా చూడాలన్నారు. జహీరాబాద్, పటాన్‌చెరు, మెదక్‌లకు ఐసీయులకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంటి వద్దకే మందులు సరఫరా చేసే కార్యక్రమాన్ని జిల్లాలో వెంటనే ప్రారంభించాలన్నారు.

జిల్లాలోని ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానం వెంటనే పునరుద్ధరించాలని, సీసీ కెమెరాల పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ కౌన్సిలర్లకు చెల్లించాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. సదు సంవత్సరాలుగా ఒకే దగ్గర పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

పటాన్‌చెరు, జోగిపేట, నర్సాపూర్, దుబ్బాక, రామాయంపేటలో కూడా రక్త నిధి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్‌రెడ్డితో పాటు జిల్లా ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement